ఏపీలో కొత్తగా మరో నాలుగు పోలీస్ కమిషనరేట్ లు: జీవో జారి చేసిన ప్రభుత్వం.!
Published on: Tue Oct 6, 2026 10:37AM

పోలీస్ శాఖలో మార్పులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో తిరుపతి, గుంటూరు, కర్నూలు, రాజమహేంద్రవరం కేంద్రాలుగా నాలుగు కొత్త పోలీస్ కమిషనరేట్లను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పెరుగుతున్న జనాభా, పట్టణీకరణ, ట్రాఫిక్, నేరాలు, వీఐపీ భద్రత, శాంతిభద్రతల నిర్వహణ మరింత మెరుగుపరి చేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.
కొత్త కమిషనరేట్లకు ఐజీపీ లేదా డీఐజీ స్థాయి అధికారి కమిషనర్ ఆఫ్ పోలీస్‌గా వ్యవహరించనున్నారు. వీరికి బీఎన్ఎస్ఎస్ 2023లోని సెక్షన్ 14(6) ప్రకారం ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ అధికారాలను కల్పించింది.. దీంతో పోలీస్ అడ్మినిస్ట్రేషన్, లా అండ్ ఆర్డర్ నిర్వహణలో నిర్ణయాలు తీసుకునే అధికారం కేంద్రీకృతమవుతుంది.
భక్తుల రద్దీ, ట్రాఫిక్, నేరాల నియంత్రణ, వీఐపీల భద్రత వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని తిరుపతికి ప్రత్యేక కమిషనరేట్ ఏర్పాటు చేశారు. దీని పరిధిలో తిరుమల, తిరుపతి, శ్రీకాళహస్తి, శ్రీసిటీ టెరిటోరియల్ జోన్లు ఉంటాయి. తిరుమల, తిరుపతి, శ్రీకాళహస్తి, రేణిగుంట, చంద్రగిరి, శ్రీసిటీ, పుత్తూరు, నాయుడుపేట సబ్‌డివిజన్లు కూడా ఈ కమిషనరేట్ పరిధిలోకే వస్తాయి.
తిరుపతి కమిషనర్ పోస్టు కోసం విజయవాడ సిటీ క్రైమ్స్ జాయింట్ సీపీ పోస్టును పునర్వ్యవస్థీకరించారు. అలాగే మెరైన్ వింగ్ ఎస్పీ పోస్టును డీసీపీ, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్పీ పోస్టును డీసీపీ (శ్రీకాళహస్తి), విజయవాడ ట్రాఫిక్ డీసీపీ పోస్టును డీసీపీ (తిరుపతి), గ్రేహౌండ్స్ గ్రూప్ కమాండర్ పోస్టును డీసీపీ (శ్రీసిటీ)గా మార్చారు.
ఇక గుంటూరు కమిషనరేట్‌కు కూడా ఐజీపీ లేదా డీఐజీ స్థాయి అధికారి నేతృత్వం వహిస్తారు. దీని పరిధిలో గుంటూరు, గుంటూరు రూరల్, అమరావతి క్యాపిటల్ రీజియన్, తెనాలి జోన్లను ఏర్పాటు చేశారు. గుంటూరు ఈస్ట్, గుంటూరు వెస్ట్, తుళ్లూరు, మంగళగిరి తదితర ప్రాంతాలు కూడా ఈ పరిధిలోకి వస్తాయి. కమిషనరేట్‌కు ఐదుగురు డీసీపీలు, నలుగురు అదనపు డీసీపీలు, ఆరుగురు ఏసీపీలను కేటాయించారు.
రాజమహేంద్రవరం కమిషనరేట్‌కు ఐజీపీ లేదా డీఐజీ స్థాయి అధికారి కమిషనర్‌గా ఉంటారు. దీని కింద నలుగురు డీసీపీలు, నలుగురు అదనపు డీసీపీలు, ఐదుగురు ఏసీపీలు పనిచేయనున్నారు. రాజమహేంద్రవరం సెంట్రల్, సౌత్, నార్త్, ఈస్ట్, కొవ్వూరు సబ్‌డివిజన్లు ఈ కమిషనరేట్ పరిధిలోకి రానున్నాయి.
కర్నూలు కమిషనరేట్ పరిధిలో కర్నూలు అర్బన్, కర్నూలు రూరల్, ఆదోని, ఎమ్మిగనూరు, పత్తికొండ సబ్‌డివిజన్లు ఉంటాయి. రాష్ట్రంలోని ఇతర కొత్త కమిషనరేట్ల మాదిరిగానే దీనికి కూడా ఉన్నత స్థాయి పోలీస్ అధికారి నేతృత్వం వహించనున్నారు.
కాగా ఈ నాలుగు కమిషనరేట్ల ఏర్పాటు చేసినప్పటికీ, అదనపు పోస్టులను మంజూరు చేయకుండా, ఇప్పటికే ఉన్న పోలీస్ శాఖ పోస్టులను పునర్వ్యవస్థీకరించి సిబ్బందిని సర్దుబాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అవసరమైన చోట డీసీపీలు, అదనపు డీసీపీలు, ఏసీపీల పోస్టులను ప్రస్తుతం ఉన్న క్యాడర్ నుంచి మార్చారు.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ, విశాఖపట్నం నగరాలకు పోలీస్ కమిషనరేట్ వ్యవస్థ అమల్లో ఉంది. తాజాగా మరో నాలుగు కమిషనరేట్ల ఏర్పాటుతో ఈ వ్యవస్థ పరిధి రాష్ట్రంలోని మరిన్ని ప్రధాన పట్టణ, అభివృద్ధి ప్రాంతాలకు విస్తరించింది.
మొత్తంగా చూస్తే, నాలుగు కొత్త కమిషనరేట్ల ఏర్పాటు ద్వారా పోలీస్ శాఖలో కమాండ్, కంట్రోల్, సమన్వయాన్ని మరింత బలోపేతం చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం, ఉద్యేశంగా కనిపిస్తోంది. ముఖ్యంగా తిరుపతిలో భక్తుల రద్దీ, గుంటూరు, అమరావతి ప్రాంతంలో వేగంగా జరుగుతున్న అర్బనైజేషన్, రాజమహేంద్రవరం, కర్నూలు ప్రాంతాల్లో శాంతిభద్రతల నిర్వహణకు కొత్త వ్యవస్థ ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
[AP Police Commissionerates, Andhra Pradesh Police, Tirupati Commissionerate, Guntur Commissionerate, Kurnool Commissionerate, Rajamahendravaram Commissionerate, AP Police, Police Commissionerates, Chandrababu Government,Telugu One]


