ఏపీలో రెండో విడత పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల..పూర్తి షెడ్యూల్ ఇదే.!
Published on: Mon Nov 16, 2026 1:36PM

ఆంధ్రప్రదేశ్లో పల్లెపోరు మరింత వేడెక్కనుంది. రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ వేగవంతమైంది. ఇప్పటికే తొలి విడత ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ కొనసాగుతుండగా.. తాజాగా రెండో విడత పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం రెండో విడత ఎన్నికలకు సంబంధించి పూర్తి షెడ్యూల్ను ప్రకటించింది. దీంతో గ్రామాల్లో ఎన్నికల సందడి మొదలైంది.
27 జిల్లాల్లో రెండో విడత ఎన్నికలు.!
రాష్ట్రంలోని మొత్తం 27 జిల్లాల పరిధిలో ఎంపిక చేసిన మండలాల్లో రెండో విడత ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ విడతలో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించి రిటర్నింగ్ అధికారులు ఫారమ్-1లో ఎన్నికల నోటీసులు జారీ చేయనున్నారు. అదే రోజు పోలింగ్ కేంద్రాల వారీగా ఓటర్ల జాబితాలను కూడా ప్రదర్శిస్తారు.
నవంబర్ 18 నుంచి నామినేషన్లు.!
ఎన్నికల షెడ్యూల్ ప్రకారం నవంబర్ 18 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. నవంబర్ 20వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. నవంబర్ 21న నామినేషన్ల పరిశీలన చేపడతారు. నామినేషన్లు తిరస్కరణకు గురైన అభ్యర్థులు నవంబర్ 22న సంబంధిత ఆర్డీవో లేదా అప్పీలేట్ అధికారికి అప్పీలు చేసుకోవచ్చు.
ఇది కూడా చదవండి: పులివెందుల ఎంపీపీ ఎన్నికకు కొత్త చిక్కు.!
ఈ అప్పీళ్లను నవంబర్ 23 నాటికి పరిష్కరిస్తారు.ఇక నవంబర్ 24 మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది. అదే రోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత బరిలో నిలిచే అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు.
నవంబర్ 29న పోలింగ్.. అదే రోజు ఫలితాలు.!
రెండో విడత ఎన్నికల్లో నవంబర్ 29న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. పోలింగ్ ముగిసిన వెంటనే మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. కౌంటింగ్ పూర్తయిన వెంటనే ఫలితాలను ప్రకటిస్తారు. అంతేకాదు.. అదే రోజు ఉప సర్పంచ్ ఎన్నికను కూడా నిర్వహించనున్నారు.
రెండో విడతలో భారీగా స్థానాలు.!
రెండో విడతలో రాష్ట్రవ్యాప్తంగా 4,960 సర్పంచ్ పదవులకు, 49,224 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలో మొత్తం మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. తొలి విడత పోలింగ్ నవంబర్ 26న, రెండో విడత నవంబర్ 29న, మూడో విడత డిసెంబర్ 2న జరగనుంది.

మూడు విడతల్లో కలిపి మొత్తం 13,167 సర్పంచ్ పదవులు, 1.32 లక్షలకు పైగా వార్డు సభ్యుల స్థానాలను భర్తీ చేయనున్నారు. దీంతో పల్లెల్లో రాజకీయ సందడి మరింత పెరగనుంది. స్థానిక సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలు, గ్రామాల్లో నెలకొన్న సమస్యలే ప్రధాన అజెండాగా అభ్యర్థులు ప్రచారానికి సిద్ధమవుతున్నారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
మీకు నచ్చవచ్చు: ప్రేమించింది..చంపేయాలనుకుంది..ప్రియుడి హత్యకు 19 ఏళ్ల యువతి మాస్టర్ ప్లాన్.!
మీకు నచ్చవచ్చు: స్నేహితులతో సరదాగా బయటకు వెళ్లిన ఇండిగో మహిళా ఉద్యోగిని దారుణ హత్య.!
[ AP Panchayat Elections 2026, AP Second Phase Panchayat Elections, Andhra Pradesh SEC, Panchayat Election Schedule, AP Sarpanch Elections, MPTC, Village Elections, November 29 Polling, AP Local Body Elections ]


