TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఏపీ మునిసిపోల్స్ ఎప్పుడంటే: కొత్త తేదీని ప్రకటించిన రాష్ట్ర ఎన్నికల సంఘం.!

Published on: Fri Oct 23, 2026 11:39AM

ఆంధ్రప్రదేశ్‌లో ఉత్కంఠ రేకెత్తిస్తున్న మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో మార్పులు అనివార్యమయ్యాయి.  సుప్రీంకోర్టు జోక్యంతో రాష్ట్ర ఎన్నికల సంఘం  మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్‌ను సవరిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.  ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 28వ తేదీన జరగాల్సిన పోలింగ్‌ను   నవంబర్ 1కి  వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం  అధికారికంగా ప్రకటించింది. అలాగే నవంబర్ 3న ఓట్ల లెక్కింపు నిర్వహించి ఫలితాలు వెల్లడించనున్నట్లు తెలిపింది. నామినేషన్ల దాఖలు సమయంలో అభ్యర్థులు ఎదుర్కొన్న అడ్డంకులు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన దాడుల ఫిర్యాదులు, వైసీపీ  సుప్రీంకోర్టును ఆశ్రయించడం వంటి పరిణామాల నేపథ్యంలో ఈ మార్పులు చోటుచేసుకున్నాయి. 

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు, రాష్ట్రంలోని ఎంపిక చేసిన నాలుగు కీలక పట్టణ స్థానిక సంస్థల్లో  అభ్యర్థుల కోసం అదనంగా 48 గంటల పాటు నామినేషన్ల స్వీకరణకు వెసులుబాటు కల్పించారు.   ముఖ్యంగా కడప మున్సిపల్ కార్పొరేషన్, రాజంపేట మున్సిపాలిటీ, మైదుకూరు మున్సిపాలిటీ, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నామినేషన్లు వేయలేకపోయిన అభ్యర్థుల కోసం శుక్ర, శనివారాలలో (అక్టోబర్ 23, 24) ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు.

సాధారణ కేంద్రాలతో పాటు సంబంధిత కలెక్టర్లు నిర్దేశించిన కలెక్టరేట్ ప్రాంగణాల్లో కూడా నామినేషన్ లు   స్వీకరించేలా యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం అక్టోబర్ 25వ తేదీన అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించనున్నారు. అలాగే కొత్తగా నామినేషన్లు దాఖలు చేసే అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడానికి అక్టోబర్ 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు గడువు ఇచ్చారు.  

ఎన్నికల సంఘం ప్రకటించిన నూతన గడువు లోపు అభ్యర్థులందరూ తమ నామినేషన్లను సక్రమంగా సమర్పించాలని అధికారులు సూచించారు. నిబంధనలకు అనుగుణంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కచ్చితంగా పాటించాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరిగేలా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. మున్సిపల్ పోరుకు సంబంధించిన పూర్తి వివరాలు మరియు తదుపరి తేదీల మార్పులకు అనుగుణంగా యంత్రాంగం తన సన్నాహాలను ముమ్మరం చేసింది.


[AP municipal elections Poling Date, AP Municipal Election, New Schedule, Nomination Deadline Extended, Telugu One]