TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పురపోరు: తెలుగుదేశం కూటమి జోరు.!

Published on: Tue Nov 3, 2026 10:48AM

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు మరియు నగర పంచాయతీల ఎన్నికల ఓట్ల లెక్కింపు జోరుగా కొనసాగుతోంది. అధికార తెలుగుదేశం కూటమి  ప్రారంభం నుంచే స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ పలు స్థానాలను కైవసం చేసుకుంటున్నది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వెలువడుతున్న ఫలితాలు అధికార కూటమికి హవాకు అద్దం పడుతున్నాయి.

పుర పోరులో భాగంగా  పోలింగ్ ముగిసిన తర్వాత అధికారులు కౌంటింగ్ ప్రక్రియను పకడ్బందీగా చేపట్టారు. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించిన సిబ్బంది, ఆ తర్వాత సాధారణ బ్యాలెట్ ఓట్ల లెక్కింపును ప్రారంభించారు. రాష్ట్రంలోని పలు ముఖ్యమైన మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయాలు నమోదు చేస్తున్నారు. ముఖ్యంగా  కడప జిల్లాలోని బద్వేల్ మున్సిపల్ చైర్‌పర్సన్ పీఠాన్ని కూటమి దక్కించుకుంది. ఇక్కడ మెజారిటీ వార్డులను కైవసం చేసుకోవడంతో పాటు, ఎర్రగుంట్ల నగర పంచాయతీలోనూ కూటమి అభ్యర్థులు   విజయం సాధించారు.

ఇక ఉమ్మడి  ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ తెలుగుదేశం కూటమి అభ్యర్థులు తమ ప్రాబల్యాన్ని చాటుతున్నారు. పెద్దాపురం లాంటి ప్రాంతాల్లో జనసేన అభ్యర్థులు భారీ మెజారిటీలతో విజయం సాధించగా, మిగిలిన అర్బన్ లోకల్ బాడీస్‌లోనూ కూటమి పార్టీల మధ్య సమన్వయం సత్ఫలితాలను ఇస్తోంది. ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నాటి నుంచే వ్యూహాత్మకంగా వ్యవహరించిన కూటమి నాయకత్వం, క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగడమే ఈ విజయాలకు ప్రధాన కారణంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

మరోవైపు, కొన్ని తీర ప్రాంతాల్లో మాత్రం ప్రతికూల వాతావరణం, భారీ వర్షాల ప్రభావం కౌంటింగ్ ప్రక్రియపై పడింది. ప్రకాశం, బాపట్ల, నెల్లూరు జిల్లాల్లో తుఫాను ప్రభావం కారణంగా ఓట్ల లెక్కింపులో  స్వల్ప ఆలస్యం చోటుచేసుకుంది. అయినప్పటికీ అధికారులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా గట్టి భద్రతా ఏర్పాట్లతో కౌంటింగ్‌ను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. పోలీసుల పటిష్ట నిఘా నడుమ ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద ప్రశాంత వాతావరణం నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా తుది ఫలితాలు పూర్తిగా వెలువడే కొద్దీ ఏయే పురపాలక సంఘాలు ఏ పార్టీ  ఖాతాలో  చేరనున్నాయనే అంశంపై స్పష్టత రానుంది.  

[AP Municipal Election Results, Vote Counting, TDP Jana Sena BJP Alliance, AP Local Body Elections, Telugu One]