TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ షురూ: తుపాను కారణంగా ఐదు మండలాల్లో వాయిదా.!

Published on: Thu Nov 5, 2026 8:22AM

ఏపీ వ్యాప్తంగా మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలు (ఎంపీటీసీ), జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల (జెడ్పీటీసీ) ఎన్నికల పోలింగ్ గురువారం (నవంబర్ 5) ఉదయం సరిగ్గా  7 గంటలకు   ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద క్యూ కట్టారు. సాయంత్రం   5 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది.  

ఈ ఎన్నికల్లో మొత్తం 582 జెడ్పీటీసీ స్థానాలు, 7,767 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఈ స్థానాల కోసం మొత్తం 21,012 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2.61 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇప్పటికే రెండు వేలకు పైగా స్థానాలు ఏకగ్రీవమయ్యాయి.  

పోలింగ్ ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం పకడ్బందీ చర్యలు చేపట్టింది. మొత్తం 31 వేల 460 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా, వాటిలో రెండు లక్షల మందికి పైగా అధికారులు, సిబ్బంది విధుల్లో పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రాష్ట్రవ్యాప్తంగా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా  సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించారు.  

ఇదిలా ఉండగా, తుఫాను ప్రభావంతో ఏర్పడిన ప్రతికూల వాతావరణం కారణంగా ఏలూరు, తూర్పు గోదావరి జిల్లాల్లోని ఐదు మండలాల్లో పోలింగ్‌  శుక్రవారానికి  (నవంబర్ 6) వాయిదా వేశారు.   మిగిలిన అన్ని ప్రాంతాల్లో యథావిధిగా పోలింగ్ జరుగుతోంది. పోలింగ్ ముగిసిన అనంతరం, శనివారం (నవంబర్ 7)  ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడించనున్నారు.

[AP MPTC ZPTC Elections, Poling, Start, Arrangements, Voting, Telugu One]