స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు: హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేసిన ఏపీ సర్కార్.!
Published on: Sat Oct 3, 2026 2:30PM

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను నిర్దిష్ట గడువులోగా ప్రారంభించాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విస్పష్ట ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ ఎన్నికల నిర్వహణ దిశగా రాష్ట్ర ప్రభుత్వానికి ఓ అడ్డంకి కూడా హైకోర్టు తీర్పుతో ఏర్పడింది. అదేంటంటే.. స్థానిక ఎన్నికలలో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ గతంలో ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను ఉమ్మడి హైకోర్టు కొట్టివేసింది. మొత్తం రిజర్వేషన్ల శాతం ఎట్టి పరిస్థితుల్లోనూ 50 శాతానికి మించకూడదని న్యాయస్థానం కుండబద్దలు కొట్టినట్లుగా తన తీర్పులో పేర్కొంది. బీసీ వర్గాలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఈ తీర్పు ఎదురదెబ్బగా పరిణమించింది.
.webp)
దీంతో ఏపీ సర్కార్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. బీసీ వర్గాలు దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీ వెన్నంటి నిలిచాయి. ఈ నేపథ్యంలో ఆ వర్గానికి మరింత ప్రాధాన్యం కల్పించడం పార్టీకి, అధికార కూటమికి అత్యంత కీలకం అనడంలో సందేహం లేదు. అందకే బీసీ లకు 34 శాతం రిజర్వేషన్లు దక్కేలా ప్రభుత్వం అన్ని రకాల చట్టపరమైన ప్రయత్నాలు చేసేందుకు సిద్ధపడింది. అందులో భాగంగానే హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేసింది.
.webp)
అదలా ఉంటే.. తీర్పుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. బీసీలకు రాజకీయంగా అత్యున్నత ప్రాతినిధ్యం కల్పించాలనే సంకల్పంతోనే ప్రభుత్వం స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించి జీవోలు జారీ చేసిందని, గతంలో తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ, రాజకీయ విధానాల వల్ల అనేక మంది వెనుకబడిన వర్గాల నాయకులు చట్టసభలకు ఎన్నికయ్యే అవకాశం లభించిందని అన్నారు.
అయితే.. ప్రత్యర్థులు కోర్టుల ద్వారా అడ్డంకులు సృష్టించడం వల్ల బీసీల రాజకీయ హక్కులకు విఘాతం కలుగుతోందన్నారు. రాష్ట్రంలోని స్థానిక సంస్థలకు త్వరగా ఎన్నికలు నిర్వహించకపోతే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన కోట్ల రూపాయల నిధులు నిలిచిపోయే ప్రమాదం ఉందని ఆయన మరోసారి గుర్తు చేశారు.

ఈ నేపథ్యంలోనే హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో ప్రత్యేక పిటిషన్ దాఖలు చేసింది. ఢిల్లీలోని ప్రముఖ సీనియర్ న్యాయవానులతో సంప్రదింపులు జరిపి రాష్ట్ర ప్రభుత్వం ఈ పిటిషన్ దాఖలు చేసింది. రెండు మూడు రోజుల్లో బీసీ రిజర్వేషన్ల విషయంలో న్యాయపోరాటం చేసి, వెనుకబడిన వర్గాలకు న్యాయం జరిగేలా చూస్తామని అధికార వర్గాలు చెబుతున్నాయి.
[AP Local Body Elections, BC Reservations, Andhra Pradesh High Court Verdict, Supreme Court Petition, AP Government, Telugu One]


