TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మద్యం స్కాం అంతిమ లబ్ధిదారు జగనే.. కోర్టులో బేవరేజెస్ మాజీ ఓఎస్డీ వాంగ్మూలం.!

Published on: Sat Sep 19, 2026 9:09AM

జగన్ హయాంలో ఏపీలో సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసులో  దర్యాప్తు ముమ్మరమైన తరుణంలో అత్యంత కీలకమైన పరిణామం వెలుగు చూసింది. అప్పటి జగన్ ప్రభుత్వంలో  వేల కోట్ల లిక్కర్ స్కామ్‌లో అసలు సిసలైన అంతిమ లబ్ధిదారు అప్పటి సీఎం జగనేనని రాష్ట్ర బేవరేజస్‌ కార్పొరేషన్‌ మాజీ ఓఎస్డీ సత్యప్రసాద్‌ న్యాయస్థానం ఎదుట  వాంగ్మూలం ఇచ్చారు. తాడేపల్లిలోని మాజీ ముఖ్యమంత్రి అధికారిక నివాసంలోనే ఈ మొత్తం స్కాప్ కు రూపకల్పన జరిగిందని, అక్కడే మద్యం విధివిధానాలు, పాలసీలు ఖరారయ్యాయని ఆయన తన వాంగ్మూలంలో విస్పష్టంగా చెప్పారు.  ఈ కేసులో ఇప్పటికే సిట్‌ అధికారులు అనేక ఆధారాలు సేకరించినప్పటికీ, మాజీ అధికారి ఏకంగా కోర్టులో ఈ స్కాం కు స్కెచ్ ఎక్కడ వేశారు. అంతిమ లబ్ధిదారు ఎవరు అన్న వివరాలను పూసగుచ్చినట్లు  వెల్లడించడం సంచలనంగా మారింది. 

ఈ కేసుకు సంబంధించి విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయాధికారి సమక్షంలో శుక్రవారం(సెప్టెంబర్ 18) దాదాపు ఐదుగంటల పాటు  సత్యప్రసాద్‌ తన వాంగ్మూలాన్ని నమోదు చేయించారు. ఈ ప్రక్రియలో పలువురు న్యాయవాదులు, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు   పాల్గొన్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు కీలక బాధ్యతలు నిర్వర్తించిన సత్యప్రసాద్, ఈ అక్రమ వసూళ్ల తంతు ఎలా సాగిందో సవివరంగా న్యాయమూర్తి ఎదుట చెప్పారు.   డిస్టిలరీల నుంచి పెద్ద ఎత్తున కమీషన్లు వసూలు చేయడం, నచ్చిన బ్రాండ్లకు మాత్రమే ఆర్డర్లు ఇవ్వడం, మిగిలిన బ్రాండ్లను పక్కన పెట్టడం వంటి అంశాలన్నింటినీ ఆయనీ సందర్భంగా కళ్లకుకట్టినట్లు చెప్పారు. ఆటోమేటిక్‌ విధానాన్ని పక్కన పెట్టి పూర్తిగా మాన్యువల్‌ విధానాన్ని ఎలా అమల్లోకి తెచ్చారనే విషయాలను ఆయన కోర్టు ముందు వివరించారు. 

విజయవాడ ఏసీబీ కోర్టులో నమోదు చేసిన ఈ వాంగ్మూలం ప్రకారం..  మద్యం విక్రయాల డేటా పరిశీలన, కమీషన్ల వసూళ్ల బాధ్యతలను తొలుత తనకు, నాటి ఎండీ వాసుదేవరెడ్డికి అప్పగించారని సత్యప్రసాద్ వెల్లడించారు. నాన్‌ కేడర్‌ ఐఏఎస్‌ లేదా తూడా కార్యదర్శిగా పోస్టింగ్ ఇస్తామని నమ్మబలికి తనను ఈ వ్యవహారంలోకి లాగారని సత్యప్రసాద్ తన వాంగ్మూలంలో పేర్కొన్నారు. తాడేపల్లిలోని జగన్‌ నివాసంలో జరిగిన సమావేశంలో కీలక వ్యక్తుల సమక్షంలో లిక్కర్ పాలసీని ఖరారు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ భేటీలో కొద్దిమంది ప్రముఖులు, ప్రజాప్రతినిధులు కూడా పాల్గొన్నారన్న సత్యప్రసాద్.. డిస్టిలరీల నుంచి నెలకు  50 కోట్ల నుంచి  60 కోట్ల రూపాయల వరకు ముడుపులు వసూలు చేసేవారనీ, ఈ సొమ్మును వివిధ మార్గాల ద్వారా సమీకరించి   నాటి ముఖ్యమంత్రి జగన్‌కు చేరవేశారని ఆయన వెల్లడించారు.

ఈ  కుంభకోణంలో భాగంగా ఆటోమేటిక్‌ విధానానికి స్వస్తి పలికి పూర్తిగా మాన్యువల్‌ పద్ధతిని ప్రవేశపెట్టడం జరిగిందని సత్యప్రసాద్‌ తెలిపారు. డిస్టిలరీల యజమానులతో ప్రత్యేక యాప్‌ల ద్వారా సంప్రదింపులు జరిపి, విక్రయాలు, డిపోల సమాచారాన్ని సేకరించేవారని చెప్పారు. కమీషన్లు చెల్లించడానికి అంగీకరించిన కంపెనీలకే ఆర్డర్లు కేటాయించడమే కాకుండా.. ధరలు కూడా పెంచారని వెల్లడించారు. ముడుపులు ఇవ్వడానికి నిరాకరించిన కంపెనీల ఆర్డర్లను నిలిపివేశారని తెలిపారు. ఒక్కో మద్యం కేసుపై నిర్దిష్ట మొత్తంలో వసూళ్లు చేసి, వాటిని సంబంధిత వ్యక్తుల ద్వారా పంపిణీ చేసి అంతిమంగా అప్పటి ముఖ్యమంత్రికి చేరవేసేవారని సత్యకుమార్ తన వాంగ్మూలంలో విస్పష్టంగా పేరుకోవడం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. 

గతంలో ఎక్సైజ్ శాఖలోనూ, బేవరేజెస్‌ కార్పొరేషన్‌లోనూ వివిధ హోదాల్లో పనిచేసిన అనుభవం ఉన్న సత్యప్రసాద్, ఈ కుంభకోణానికి సంబంధించిన గుట్టును  బయటపెట్టడం విశేషం. కేవలం బ్రాండ్ల ఎంపిక మాత్రమే కాకుండా, ఫీల్డ్‌ మానిటర్ల నియామకం, రవాణా బాధ్యతల అప్పగింత, సాఫ్ట్‌వేర్ మార్పుల వంటి ప్రతి దశలోనూ భారీస్థాయిలో అక్రమాలు జరిగాయని సత్యప్రసాద్ వాంగ్మూలమిచ్చారు.  కొన్ని కంపెనీలకు రాష్ట్రంలో డిస్టిలరీలు లేకపోయినా నాసిరకం బ్రాండ్లను విరివిగా అమ్ముకునేందుకు అనుమతులు ఇచ్చారని, జీవోల ద్వారా ధరలను అమాంతం పెంచేశారని వివరించారు.   ఈ అక్రమాల ద్వారా సమీకరించిన మొత్తం సుమారు 3 వేల 2 వందల కోట్ల రూపాయలు ఉంటుందనీ,   ఈ నిధులన్నీ వివిధ స్థాయిలలో  చేరాల్సిన వారికి చేరాయని పేర్కొన్నారు.

ఈ కేసులో మాజీ అధికారి అప్రూవర్‌గా మారడానికి ముందుకు రావడం, నేరుగా న్యాయస్థానం ఎదుట  వాంగ్మూలం ఇవ్వడం  రానున్న రోజుల్లో మరికొన్ని కీలక అరెస్టులు జరిగే అవకాశం ఉందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే జగన్ ను కూడా ఈ కేసులో విచారణకు పిలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయనీ పరిశీలకులు అంటున్నారు.   

[AP Liquor Scam, YS Jagan Mohan Reddy, Satya Prasad Statement, Vijayawada ACB Court, Final Benificiary, Telugu One]