ఏపీలో 11 మంది ఐఏఎస్ లకు పోస్టింగులు: యువజన, పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శిగా అమ్రాపాలి.!
Published on: Mon Oct 12, 2026 2:10PM

ఆంధ్రప్రదేశ్ పరిపాలనా విభాగంలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేయడంతో పాటు పోస్టింగ్‌ల కోసం ఎదురుచూస్తున్న అధికారులకు కీలక బాధ్యతలను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జీవో ఆర్టీ నంబర్ 1985 ద్వారా అధికారిక ఉత్తర్వులను విడుదల చేశారు. మొత్తం 11 మంది ఐఏఎస్ అధికారులకు కొత్త నియామకాలు, అదనపు బాధ్యతలను అప్పగించారు. ఈ బదిలీల ప్రక్రియలో సీనియర్ ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలికి పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించారు.
పాలనా యంత్రాంగాన్ని మరింత వేగవంతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం, 2002 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి సౌరభ్ గౌర్‌ను న్యూఢిల్లీలోని ఏపీ భవన్‌లో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ)గా నియమించారు. అదే విధంగా 2006 బ్యాచ్ అధికారి డి. మురళీధర్ రెడ్డికి గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శిగా ప్రాముఖ్యత ఉన్న బాధ్యతలను కట్టబెట్టారు. మంజులే బాలాజీ దిగంబర్‌కు ఈడబ్ల్యూఎస్ సంక్షేమ శాఖ అదనపు కార్యదర్శిగా బాధ్యతలు కేటాయించారు.
.webp)
కొంతకాలంగా పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న సీనియర్ అధికారిణి ఆమ్రపాలిని యువజన, పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రభుత్వ కార్యదర్శిగా నియమిస్తూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఇక యువజన సేవల విభాగం డైరెక్టర్‌గా కె. నీలకంఠ రెడ్డిని, పరిశ్రమలు, ఎంఎస్‌ఎంఈ శాఖ సంయుక్త కార్యదర్శిగా బి. అనిల్ కుమార్ రెడ్డిని నియమించారు. సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శిగా ఎన్. తేజ్ భరత్, స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు శాఖ ఉప కార్యదర్శిగా గేదెల శ్రీను కుమార్ బాధ్యతలు అప్పగించారు.
మిగిలిన నియామకాల్లో భాగంగా ఏపీ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా ఎం. వరప్రసాద్ నియమితులయ్యారు. ఉద్యానవన, పట్టు పరిశ్రమల శాఖ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న కె. శ్రీనివాసులుకు అదనంగా వ్యవసాయ మార్కెటింగ్ డైరెక్టర్ బాధ్యతలను అప్పగించారు. ఏపీ రాష్ట్ర ఆర్థిక సంస్థ (ఎప్‌ఎస్‌ఎఫ్‌సీ) మేనేజింగ్ డైరెక్టర్‌గా శుభం భన్సాల్‌కు పూర్తి అదనపు బాధ్యతలను కేటాయించారు. ఈ కొత్త పోస్టింగ్‌లు, బాధ్యతల మార్పులు అన్నీ తక్షణమే అమల్లోకి వస్తాయని జీవోలో పేర్కొన్నారు.
[AP IAS Transfers, Amrapali, posting, AP government IAS posting, AP Tourism Secretary Amrapali, Telugu One]


