తుపాను తీరం దాటింది: అయినా ఏపీని వదలని వాన గండం.. ఏడు జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ కు అవకాశం.!
Published on: Thu Sep 24, 2026 11:52AM

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీరం దాటినా ఏపీకి వర్షాల ముప్పు ఇంకా తప్పలేదు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాల తీవ్రత కొనసాగుతోంది. అంతే కాకుండా రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో వర్షాలు దంచి కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ ఏపీలోని ఏడు జిల్లాలకు ఆకస్మిక వరదల ముప్పు పొంచి ఉందని హెచ్చరించింది.
ఉత్తరాంధ్ర జిల్లాలు, వాటిని ఆనుకుని ఉన్న తీర ప్రాంతాలలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో సీతారామరాజు, పార్వతీపురం మన్యం, కాకినాడ జిల్లాలలో మరో 12 గంటల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి.
ఈ జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యే అవకాశం ఉంది. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారయంత్రాంగం అప్రమత్తమైంది. ఏజెన్సీ ప్రాంతాలు, కొండ ప్రాంతాల నుంచి ప్రవహించే వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహించే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది.
.webp)
కాజ్‌వేలు దాటే సాహసం చేయవద్దని, ప్రయాణాల సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కొండచరియలు విరిగిపడే అవకాశం ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచింది. లోతట్టు ప్రాంతాలలో ఉన్న ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు, పునరావాస కేంద్రాలకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రజల ఇబ్బందులను నివారించేందుకు జిల్లాల వారీగా ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశారు.
గత కొన్ని రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాల కారణంగా ఇప్పటికే వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. లోతట్టు కాలనీల్లోకి వరద నీరు చేరడంతో జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తమైంది. రోడ్లు దెబ్బతినడం, రవాణా వ్యవస్థకు అంతరాయం కలగడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లోనూ సముద్రంలోకి వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు. అలాగే ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించారు.
[AP Flash Floods, Andhra Pradesh Rains, IMD Weather Warning, 7 Districts Flood Alert, Heavy Rains, AP News, Telugu One]


