మరో DSC: నోటిఫికేషన్ ఎప్పుడంటే.?
Published on: Tue Sep 22, 2026 4:54PM

ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పనుంది. రాష్ట్రంలో ప్రతి ఏడాది క్రమం తప్పకుండా డీఎస్సీ నిర్వహించాలనే సంకల్పంతో కూటమి ప్రభుత్వం ముందుకువెళ్తుండగా, తాజాగా నూతన డీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేసేందుకు విద్యాశాఖ సమాయత్తమవుతోంది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా వివిధ పాఠశాలలు, విద్యా సంస్థల్లో ఉన్న ఉపాధ్యాయ ఖాళీల వివరాలను సేకరించి, ప్రాథమిక ప్రతిపాదనలను సిద్ధం చేసినట్లు అధికారిక వర్గాల ద్వారా తెలుస్తోంది.
గతంలో ప్రకటించిన జాబ్ క్యాలెండర్, విధానాలకు అనుగుణంగా, అక్టోబర్ 15వ తేదీన ఈ నూతన ఉపాధ్యాయ నియామక ప్రకటన వెలువడే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం. కేవలం పాఠశాల విద్యాశాఖ పరిధిలోని పోస్టులే కాకుండా, డైట్ కళాశాలలు, రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి, గ్రంథాలయాల్లోని సిబ్బంది ఖాళీల భర్తీకి సైతం అదే రోజున నోటిఫికేషన్ విడుదల చేసేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు అర్హులైన అభ్యర్థులకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకుసాగుతోంది.

రాష్ట్రంలోని ప్రభుత్వ, మండల పరిషత్, జిల్లా పరిషత్, పురపాలక పాఠశాలల్లో దాదాపు 2,250 వరకు ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గుర్తించారు. అయితే ఈ ఖాళీల సంఖ్యపై ప్రభుత్వం నుంచి తుది ఆమోదం రావాల్సి ఉంది. దీనికి తోడు జువెనైల్ సంక్షేమం, గిరిజన గురుకులాలు, సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ విద్యా సంస్థలు, ఆదర్శ పాఠశాలలు, ఏపీ రెసిడెన్షియల్ పాఠశాలలు, దివ్యాంగ, బీసీ సంక్షేమ శాఖల పరిధిలోని విద్యా సంస్థల్లో ఉన్న ఖాళీలను కూడా కలుపుకుంటే మొత్తం టీచర్ పోస్టుల సంఖ్య పాతిక వందలు దాటు అవకాశం ఉందని అంటున్నారు.
ఉపాధ్యాయ పోస్టులతో పాటు డైట్, ఎస్‌సీఈఆర్టీ సంస్థల్లోని 160 లెక్చరర్ పోస్టులు, 209 జూనియర్ లెక్చరర్ పోస్టులతో పాటు వంద వరకు లైబ్రేరియన్ ఖాళీలను కూడా భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రత్యేక పోస్టుల భర్తీ బాధ్యతను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా చేపట్టేలా ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
AP DSC Notification, Andhra Pradesh Teacher Jobs, AP DSC, Nara Lokesh, Teacher Recruitment, AP Nwes, Telugu One


