క‌మ్మ‌..క‌మ్మ‌.. జ‌గ‌న్‌రెడ్డీ ఏమిటీ కుల జాడ్యం?

వీచే గాలిది ఏ కులం? పారే నీటిది ఏ కులం? కాసే ఎండ‌ది ఏ కులం? మ‌నుషుల్లోనే ఎందుకీ కులం? అంటే, అదేం మాట‌.. కులంతో ఎన్నో రాజ‌కీయ‌ ప్ర‌యోజ‌నాలు. ఎన్నో వైఫ‌ల్యాల‌ను క‌ప్పిపుచ్చుకునే సౌక‌ర్యాలు. కులం పేరుతో స‌మాజాన్ని చీల్చ‌వ‌చ్చు. కులం పేరుతో ఓట్ల‌ను దండుకోవ‌చ్చు. కులం పేరుతో ఎన్నో స్వార్థ‌ రాజ‌కీయాలు నెర‌ప‌వ‌చ్చు. ఏంటి? న‌మ్మ‌ట్లేదా? డౌట్ ఉంటే.. ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డిని అడ‌గండి తెలుస్తుంది.. కులం పేరుతో రాజ‌కీయం ఎంత క‌మ్మ‌గుంటుందో చెబుతారు. ఆయ‌న చెప్ప‌డ‌మెందుకు.. జ‌గ‌న్ తీరును ఓ సారి ప‌రిశీలిస్తే చాలు.. కులంతో గంద‌ర‌గోళం సృష్టించి.. ఏ మేర‌కు రాజ‌కీయ ప్ర‌యోజ‌నం పొందారో అర్థం అవుతుంది.

తాజా ఎపిసోడ్ నుంచే మొద‌లుపెడితే.. కొవాగ్జిన్‌కూ కులం మ‌కిలి అంట‌గ‌ట్టిన మ‌హానుభావుడు జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి. క‌మ్మ కులంలో కొవాగ్జిన్ పుట్టిన‌ట్టు మాట్లాడుతున్నారు. ఆ వ్యాక్సిన్‌కు స‌మీప బంధువులు ఇద్ద‌రట‌. ఒక‌రు ఈనాడు గ్రూప్ ఛైర్మ‌న్ రామోజీరావు.. మ‌రొక‌రు టీడీపీ అధినేత చంద్ర‌బాబు. ఇక్క‌డ మ‌రో అక్ర‌మ సంబంధమూ అంట‌గట్టారు సీఎం గారు. రామోజీరావుకు చంద్ర‌బాబుకు మ‌ధ్య ఎలాంటి బంధుత్వం లేద‌నేది జ‌గ‌మెరిగిన విష‌యమే. అయినా.. జ‌గ‌న్‌రెడ్డి వారిద్ద‌రికీ బ‌ల‌వంతంగా బంధం క‌లిపేశారు. కొవాగ్జిన్ త‌యారు చేస్తున్న‌ భార‌త్ బ‌యోటెక్ య‌జ‌మాని.. రామోజీరావు కొడుకు వియ్యంకుడు కాబ‌ట్టి.. ఆయ‌న‌ చంద్ర‌బాబుకూ బంధువే అవుతార‌ట‌. అదెలాంటి చుట్ట‌రిక‌మో ఆయ‌న‌కే తెలియాలి. చంద్ర‌బాబుతో వారికి ఎలాంటి బంధుత్వం లేకున్నా.. బ‌ట్ట కాల్చి మీద వేయ‌డ‌మే జ‌గ‌న్‌రెడ్డి తీరులా ఉంది. 

కృష్ణా ఎల్లా, రామోజీరావు, చంద్ర‌బాబులు క‌మ్మ కులంలో పుట్ట‌డ‌మే వారు చేసిన త‌ప్పిదం. అందుకే, వ్యాక్సిన్లు కొన‌డానికి క‌నీసం ఆర్డ‌ర్లు కూడా పెట్ట‌కుండా.. అడ్వాన్సులు చెల్లించ‌కుండా.. కొవాగ్జిన్ కోసం ఎలాంటి ప్ర‌య‌త్నాలూ చేయ‌కుండా.. ఆ ముగ్గురు క‌మ్మ కుల‌స్తులు కాబ‌ట్టే.. ఏపీకి వ్యాక్సిన్ ఇవ్వ‌టం లేదంటూ నోటికొచ్చిన కూత‌లు కూస్తున్నారు గౌర‌వ ముఖ్య‌మంత్రివ‌ర్యులు. న‌వ్వి పోదురు గాక నాకేంటి అన్న‌ట్టు ఉంది ఆయ‌న తీరు.

జ‌గ‌న్ నోట ఇలాంటి క‌మ్మ‌టి మాట‌లు రావ‌డం ఇదే మొద‌టిసారి ఏమీ కాదు. ఏపీ మాజీ ఎస్ఈసీ నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్ కుమార్ విష‌యంలో అనేక‌మార్లు ఇలా కుల గ‌జ్జిని గోకుతూనే ఉండేవారు. నిమ్మ‌గ‌డ్డ‌, చంద్ర‌బాబులు ఒకే సామాజిక వ‌ర్గం కాబ‌ట్టి.. బాబు చెప్పిన‌ట్టు నిమ్మ‌గ‌డ్డ ఆడుతున్నాడంటూ రాజ్యాంగ‌బ‌ద్ద ప‌ద‌విలో ఉన్న ర‌మేశ్ కుమార్‌పై బ‌హిరంగంగా, నిస్సిగ్గుగా ఆరోప‌ణ‌లు చేయ‌డం అప్ప‌ట్లో తీవ్ర వివాదాస్ప‌దం అయింది. అప్ప‌టి ఎస్ఈసీ నిమ్మ‌గ‌డ్డ‌కు అడుగ‌డుగునా మోకాలొడ్డే ప్ర‌య‌త్నం చేసినా.. కోర్టుల పుణ్యాన ఎప్ప‌టిక‌ప్పుడు స‌ర్కారు చ‌ర్య‌ల‌కు చెక్ పెడుతూ.. ఏపీలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌ను స‌జావుగా పూర్తి చేసి.. చ‌రిత్ర‌లో నిలిచిపోయారు నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్‌కుమార్‌. క‌మ్మ కులం పేరుతో ఆనాడు జ‌గ‌న్‌రెడ్డి చేసిన దిగ‌జారుడు ఆరోప‌ణ‌ల‌పై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు చెల‌రేగినా.. వాటిని ఏమాత్రం ప‌ట్టించుకోకుండా.. విమ‌ర్శ‌ల‌ను దులిపేసుకుంటూ.. ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త కొత్త అంశాల్లో.. కొత్త కొత్త‌ వారి విష‌యంలో.. కులం కార్డు ప్ర‌యోగిస్తూ.. జ‌గ‌న్‌రెడ్డి రాజ‌కీయ ప‌బ్బం గడుపుకుంటున్నారనేది ఆరోప‌ణ‌ .

ఏకంగా సుప్రీంకోర్టు జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ విష‌యంలోనూ ఇలాంటి క్యాస్ట్ పాలిటిక్స్‌ చేసేందుకు ట్రై చేసి.. ఏకంగా న్యాయ‌స్థానాల‌నే వివాదంలోకి లాగాల‌ని చూశారు జ‌గ‌న్‌రెడ్డి. క‌మ్మ కులం అయితే చాలు.. వెన‌కా ముందు చూసే ప్ర‌స‌క్తే లేద‌న్న‌ట్టు.. ఎదుటి వారు ఎలాంటి వారైనా.. వారి మెడ‌లో కులం కార్డు వేసేసి.. చంద్ర‌బాబు మ‌నిషంటూ ముద్రేసి.. రాజ‌కీయ కులం క్రీడ ఆడేస్తున్నారు. సుప్రీంకోర్టు జ‌డ్జిగా ఉంటూ.. ఎన్వీ ర‌మ‌ణ ఏపీ హైకోర్టు తీర్పుల‌ను ప్ర‌భావితం చేస్తున్నారంటూ.. అప్ప‌టి ఎస్‌సీజేకు ఫిర్యాదు చేశారు. సుప్రీంకోర్టు చీఫ్ జ‌స్టిస్ రేసులో ఉన్న ర‌మ‌ణ‌కు ఆ అత్యున్న‌త హోదా రాకుండా అడ్డుకునేందుకే అలా కుట్ర చేశారని అంటారు. జ‌గ‌న్ చెప్పింద‌ల్లా న‌మ్మ‌డానికి వాళ్లేమీ ఏపీ ఓట‌ర్లు కాదు క‌దా. అందుకే, జ‌స్టిస్‌ ర‌మ‌ణ‌పై సీఎం జ‌గ‌న్‌రెడ్డి చేసిన‌ ఆరోప‌ణ‌ల‌కు కొట్టేసింది సుప్రీంకోర్టు. జ‌గ‌న్ కుతంత్రాల‌ను కూల‌దోసి.. ఎన్వీ ర‌మ‌ణ‌నే సుప్రీంకోర్టు చీఫ్ జ‌స్టిస్ అయ్యారు. అయితే, ఆ విష‌యంలో అసంబ‌ద్ధ ఫిర్యాదు చేసిన సీఎం జ‌గ‌న్‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల్సిన సుప్రీంకోర్టు ఎందుకోగానీ క్ష‌మించి వ‌దిలేసింది. 

కొవాగ్జిన్‌, ఎస్ఈసీ, సుప్రీంకోర్టు జ‌స్టిస్‌.. ఇవి మ‌చ్చుకు కొన్ని మాత్ర‌మే. క‌మ్మ కులం, చంద్ర‌బాబు టార్గెట్‌గా జ‌గ‌న్ రేపిన కుల గ‌జ్జి.. రాచ‌పుండులా ఏపీని వేధిస్తూనే ఉంది. ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా ఉన్న‌ప్పుడు కూడా ఇలానే కుల ఆరోప‌ణ‌ల‌తో రాజ‌కీయంగా లాభం పొందేవారు. సీఎం చంద్ర‌బాబు హ‌యాంలో ఏపీ పోలీస్ శాఖ‌లో బ‌దిలీలు జ‌రిగితే.. క‌మ్మ కుల‌స్తుల‌కే ప్ర‌మోష‌న్లు, స‌ముచిత స్థానాలు క‌ల్పించారంటూ విష ప్ర‌చారం చేశారు. తీరా ప‌క్కాగా లెక్క‌లు తీస్తే.. అందులో క‌మ్మ వారు అతి త‌క్కువ మందే. కానీ, అప్ప‌టికే రాజ‌కీయంగా పొందాల్సినంత లాభం పొందేశారు జ‌గ‌న్‌రెడ్డి. ప్ర‌జ‌లూ ఆయ‌న ఆరోప‌ణ‌లను ఎప్ప‌టిక‌ప్పుడూ ఫ్రెష్‌గా న‌మ్ముతుండ‌టం శోచ‌నీయం. ఇక‌, చంద్రబాబు సీఎంగా ఉన్న‌ప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ప‌ని చేసిన ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావును క‌మ్మ కుల‌స్తుడిగా, చంద్ర‌బాబు మ‌నిషిగా ఫిక్స్ చేసి.. ఆయ‌న్ను ఎంత‌లా వేధిస్తున్నారో అంద‌రికీ తెలిసిందే. 

ఇలా.. క‌మ్మ కులాన్ని ఎంత‌లా అబాసుపాలు చేయాలో అంత‌కంటే ఎక్కువే చేస్తున్నారు జ‌గ‌న్‌రెడ్డి. త‌న పాల‌నా వైఫ‌ల్యాల‌ను క‌ప్పి పుచ్చుకోడానికి, తాను రాజ‌కీయంగా ప్ర‌యోజ‌నం పొంద‌టానికి.. క‌మ్మ కులం ఆయ‌న‌కి ఆట బొమ్మ‌లా మారిందంటున్నారు. లేక‌పోతే ఏంటి.. దేశానికి కొవాగ్జిన్‌-క‌రోనా టీకా అందిస్తున్న‌ మ‌న తెలుగు వాడిని అభినందించాల్సింది పోయి.. వ్యాక్సిన్ పైనా క‌మ్మ ముద్ర వేసి.. రామోజీరావు, చంద్ర‌బాబుతో ముడిపెట్టి.. కుల రాజకీయం చేయ‌డం.. హేయ‌మైన, నీతిబాహ్య‌మైన‌, నీచ‌, దిగ‌జారుడు రాజ‌కీయం కాక మ‌రొక‌టి కాదనే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. 

రాగ‌ధ్వేషాల‌కు అతీతంగా బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తానంటూ ప్ర‌మాణం చేసిన ముఖ్య‌మంత్రి.. గ‌ద్దె నెక్కాక‌.. క‌మ్మ కులంపై కేవ‌లం ధ్వేషం మాత్ర‌మే చూపిస్తూ.. ప‌రిపాలిస్తుండ‌టం.. రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధం అంటున్నారు. జ‌గ‌న్‌రెడ్డికి ముఖ్య‌మంత్రిగా కొన‌సాగే అర్హ‌త అస‌లే మాత్రం లేదని తప్పుబ‌డుతున్నారు. రాష్ట్రంలోని ప్ర‌తీ ఒక్క‌రినీ ఒకేలా చూడాల్సిన ముఖ్య‌మంత్రి.. ఇలా ఒక కులంపై క‌క్ష కట్టిన‌ట్టు వ్య‌వ‌హ‌రించ‌డం.. ఒక కులానికి చెందిన‌ కొంద‌రు వ్య‌క్తుల‌ను ప‌దే ప‌దే టార్గెట్ చేయ‌డం సీఎం జ‌గ‌న్‌రెడ్డికి ఏమాత్రం త‌గ‌దు. కాలం.. రంగుల రాట్నం లాంటిది. ఎప్పుడూ ఒకరి ద‌గ్గ‌రే ఆగిపోదు. కాలం గిర్రున తిరిగి.. అధికార‌మూ తారుమారు కావొచ్చు. అందుకే, కాస్త‌.. త‌గ్గు..త‌గ్గు. ఇలాంటి కుల రాజ‌కీయం వ‌ద్దు..వ‌ద్దు.