TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బగా పని చేశారు భేష్: అయినా విశ్రమించొద్దు.. అధికారులకు చంద్రబాబు దిశా నిర్దేశం.!

Published on: Thu Oct 29, 2026 11:47AM

ఆంధ్రప్రదేశ్ ను అతలాకుతలం చేసిన అర్నబ్ తుపాను తీరం దాటింది.  తీరం దాటి 24 గంటలు గడుస్తున్నా, రాష్ట ప్రజలకు, రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రభుత్వ యంత్రాంగానికి ఇసుమంతైనా వెసులుబాటు దక్కలేదు. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన సహాయక ,  పునరుద్ధరణ చర్యలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం (అక్టోబర్ 29) ఉదయం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. తుపాను తీరం దాటినా, దాని ప్రభావం ఇంకా రాష్ట్రంపై తీవ్రంగా ఉందనీ, మరో వారం రోజుల పాటు రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఆయన అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు.  క్షేత్ర స్థాయిలో  సాధారణ పరిస్థితులు నెలకొనేంత వరకు అధికార యంత్రాంగం  విశ్రమించవద్దని విస్పష్ట ఆదేశాలు జారీ చేశారు.  తుపాను తీవ్రత ఉన్నప్పటికీ అధికారులు, యంత్రాంగం, ప్రభుత్వం సమష్టి కృషితో ప్రాణ, ఆస్తి నష్టాన్ని గణనీయంగా తగ్గించగలిగామన్న సీఎం.. అవిశ్రాంతంగా శ్రమించిన అధికారులు, యంత్రాంగాన్ని అభినందిస్తూనే..   విపత్తు ప్రభావం నుంచి ప్రజలు పూర్తిగా కోలుకునే వరకు  నిరంతరం అప్రమత్తంగా ఉండాలని దిశా నిర్దేశం చేశారు.

ముఖ్యంగా తుపాను ప్రభావిత ప్రాంతాలన్నింటిలో రేపటిలోగా విద్యుత్ సరఫరాను పూర్తిస్థాయిలో పునరుద్ధరించాలనీ,  అలాగే తుపాను కారణంగా రోడ్లపై పడిపోయిన చెట్లు, పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తక్షణమే తొలగించి రాకపోకలను సులభతరం చేయాలని సూచించారు. నష్టపరిహారం చెల్లింపునకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం ప్రత్యేక జీవోను జారీ చేసిందనీ, పంట నష్టం మినహా  బాధితులందరికీ పరిహారం అందజేసే ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని  ఆదేశించారు.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రెండు వైరుధ్యాలతో కూడిన విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటోందన్న చంద్రబాబు.. ఒకవైపు రాయలసీమ ప్రాంతంలో ఎల్ నినో ప్రభావంతో తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు, మరోవైపు కోస్తా,  ఉత్తరాంధ్ర జిల్లాలలో అర్నబ్ తుపాను కారణంగా పంటలు,   తోటలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. ఈ రెండు భిన్నమైన సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొని ప్రజలను, రైతులను అన్ని విధాలుగా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.  

భారీ వర్షాలకు నీట మునిగిన పంటలను ఏ మేరకు కాపాడగలమనే అంశంపై వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలతో కలిసి  అధ్యయనం చేయాలన్నారు. మట్టిపాలు కాకుండా పంటలను రక్షించే మార్గాలపై ప్రణాళికలు రూపొందించాలని, నేలకూలిన కొబ్బరి చెట్లు సహా ఇతర ఉద్యాన పంటల మొక్కలను తిరిగి నాటే అవకాశాలను పరిశీలించాలని సూచించారు. పంట నష్టం అంచనాలను త్వరితగతిన పూర్తి చేసేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని ఆదేశించారు.

వ్యవసాయ, ఉద్యాన రంగాల రైతులు నష్టపోయిన  వారికి ప్రభుత్వ పథకాలను సకాలంలో వర్తింపజేయాలని పేర్కొన్నారు. ప్రభుత్వం చేపడుతున్న సహాయక చర్యలను ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేయడం ద్వారా క్షేత్రస్థాయిలో మరింత మెరుగైన ఫలితాలు సాధించవచ్చని తెలిపారు. ఈ విపత్కర సమయంలో ప్రజా ప్రతినిధులు, యంత్రాంగం సమన్వయంతో పనిచేసి ప్రజలకు అండగా నిలవాలని ఆయన పునరుద్ఘాటించారు.

[AP CM Chandrababu Naidu Praises overnment machinery, Arnab Cyclone Andhra Pradesh, Relief and Restoration Works, AP Officials Teleconference, Caution, No Relax, Crop Loss Compensation, Normalcy, Ground, Level, Telugu One]