ఎల్ నినో ఎఫెక్ట్.. రైతులకు అండగా సీఎం చంద్రబాబు యాక్షన్ ప్లాన్..!
Published on: Sun Sep 20, 2026 5:13PM

ధరలు అదుపులో పెట్టేందుకు అధికారులకు ముఖ్యమంత్రి కీలక ఆదేశాలు..!
ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలో తలెత్తే పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎల్ నినో ప్రభావం, తీసుకోవాల్సిన ముందస్తు చర్యలు, యాక్షన్ ప్లాన్ అమలుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. వివిధ శాఖల ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లు, అధికారులు, ఉద్యోగులు, ఆర్ఎస్కే సిబ్బందితో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం.. ఎల్ నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. ఎల్ నినో ప్రభావం కేవలం వ్యవసాయ రంగానికే పరిమితం కాదని, అన్ని వ్యవస్థలపై ప్రభావం చూపే అవకాశం ఉందని చంద్రబాబు అన్నారు. రైతులను ఆదుకోవడంతో పాటు నిత్యావసర వస్తువుల ధరలు పెరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. బియ్యం, ఉల్లి, పామాయిల్, కందిపప్పు ధరలను అదుపులో ఉంచేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు.
గోడౌన్లలో ఉన్న బియ్యం నిల్వలను పరిశీలించి.. అవసరానికి అనుగుణంగా మార్కెట్‌లోకి విడుదల చేసే చర్యలు చేపట్టాలని సీఎం సూచించారు. ఉల్లి ధరలను నియంత్రించేందుకు ఇప్పటికే వివిధ ప్రాంతాల నుంచి కొనుగోళ్లు చేస్తున్నామని తెలిపారు. భవిష్యత్ డిమాండ్‌కు అనుగుణంగా ఉల్లి సాగును ప్రోత్సహించాలని చెప్పారు. పామాయిల్, కందిపప్పు ధరలను నియంత్రించేందుకు ఇప్పటికే తీసుకున్న నిర్ణయాలను వేగంగా అమలు చేయాలని ఆదేశించారు. డిమాండ్‌కు అనుగుణంగా పంటల సాగుపై రైతుల్లో అవగాహన కల్పించాలని చంద్రబాబు సూచించారు. వర్షాభావాన్ని తట్టుకునే పంటలు, పప్పుధాన్యాలు, చిరుధాన్యాల సాగును ప్రోత్సహించాలని చెప్పారు. సంప్రదాయేతర ప్రాంతాల్లోనూ ఉల్లి, మిరప వంటి పంటల సాగును ప్రోత్సహించాలని సూచించారు. పంటల బీమా చేయించినందున.. పంట నష్టం జరిగితే రైతులకు బీమా పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
కిచెన్ గార్డెన్లను ప్రోత్సహించాలని సీఎం సూచించారు. స్వయం సహాయక బృందాల ద్వారా కూరగాయల సాగును విస్తరించగలిగితే.. కూరగాయల ధరలను కూడా కొంతమేర నియంత్రించవచ్చని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అందించే కనీస మద్దతు ధర పథకాలపై కేంద్రంతో సమన్వయం చేసుకోవాలని అధికారులకు సూచించారు. హైరిస్క్ ప్రాంతాల్లోని ఉద్యాన పంటలను రక్షించేందుకు కేటాయించిన రూ.190 కోట్లను సమర్థవంతంగా వినియోగించాలని చంద్రబాబు ఆదేశించారు. రైతులను ఎల్ నినో ప్రభావం నుంచి కాపాడటంతో పాటు తాగునీరు, పశువులకు నీరు, పశుగ్రాసం అందుబాటులో ఉండేలా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. మల్చింగ్‌కు అవసరమైన విత్తనాలు, ఇతర వనరులను రైతులకు అందుబాటులో ఉంచాలని చెప్పారు.
.webp)
రాష్ట్రవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే సిద్ధం చేసిన కంటింజెన్సీ ప్లాన్‌ను సమర్థవంతంగా అమలు చేయాలని సీఎం ఆదేశించారు. 5.21 లక్షల హెక్టార్లకు పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు, పచ్చిరొట్ట ఎరువులు సరఫరా చేశామని, 1.31 లక్షల క్వింటాళ్ల విత్తనాలను 80 శాతం సబ్సిడీతో అందించామని అధికారులు తెలిపారు. ఖరీఫ్ కంటింజెన్సీ ప్రణాళిక కోసం రూ.60 కోట్లు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. అధికారులు క్రమం తప్పకుండా క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితులను పర్యవేక్షించాలని చంద్రబాబు సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ఉన్నప్పటికీ.. ప్రజాప్రతినిధులు గ్రామాల్లో పర్యటిస్తూ ఎల్ నినో ప్రభావం, ప్రత్యామ్నాయ పంటలు, వర్షాభావ పంటల ప్రయోజనాలపై రైతులకు అవగాహన కల్పించాలని చెప్పారు.
నీటి వనరుల నిర్వహణపైనా సీఎం ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. వర్షాధార పంటలు, ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. వర్షాలను సద్వినియోగం చేసుకోవడంతో పాటు వీబీ-జీ రామ్-జీ పనులను అనుసంధానం చేసుకుంటూ జలధార కార్యక్రమాన్ని ముమ్మరం చేయాలని ఆదేశించారు. కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో పంటలపై ఎల్ నినో ప్రభావం ఎక్కువగా కనిపిస్తోందని అధికారులు సీఎంకు వివరించారు. హంద్రీ-నీవా ద్వారా చివరి భూములకు కూడా నీరు అందించామని, ప్రస్తుతం తాగునీటికి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నామని చంద్రబాబు తెలిపారు.
ముందస్తు చర్యల వల్లే ఎల్ నినో వంటి పరిస్థితుల్లోనూ హంద్రీ-నీవా కాల్వల్లో నీరు అందుబాటులోకి వచ్చిందని సీఎం అన్నారు. రూ.3,500 కోట్ల వ్యయంతో 100 రోజుల్లో హంద్రీ-నీవా కాల్వల్లో నీటిని పారించగలిగామని తెలిపారు. విపత్తుల సమయంలో వాటి ప్రభావం ప్రజలపై పడకుండా చూడటం ప్రభుత్వాల బాధ్యత అని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు, సాగునీటి సంఘాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఎల్ నినోను సవాలుగా స్వీకరించి తాత్కాలిక, మధ్యంతర ప్రణాళికలతో ముందుకు సాగాలని అధికారులను ఆదేశించారు.
[ AP CM Chandrababu, El Nino Effect, Andhra Pradesh, Amaravati, El Nino Action Plan, AP Farmers, Agriculture, Crop Damage, Crop Insurance, Contingency Plan, Rabi Crops, Kharif Season, Rice Prices, Onion Prices, Palm Oil Prices, Dal Prices, Kitchen Gardens, Horticulture Crops ]


