ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు: నాలుగు నగరాల్లో కొత్త కమిషనరేట్లు.!
Published on: Wed Sep 23, 2026 6:53PM
.webp)
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు. పరిపాలన, పోలీస్ వ్యవస్థ, పారిశ్రామిక అభివృద్ధి, అమరావతి మౌలిక వసతులు, స్థానిక సంస్థల ఎన్నికలు తదితర అంశాలపై కేబినెట్ చర్చించింది. రాష్ట్రంలో పోలీస్ పరిపాలనను మరింత పటిష్టం చేసే దిశగా కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. రాజమహేంద్రవరం, గుంటూరు, తిరుపతి, కర్నూలు కేంద్రాలుగా నాలుగు కొత్త పోలీస్ కమిషనరేట్ల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. కొత్త కమిషనరేట్ల ఏర్పాటుతో ఆయా ప్రాంతాల్లో పోలీస్ పరిపాలన మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు అవకాశం కలగనుంది. రాజధాని అమరావతి పరిధిలోని గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చింది. ఇందులో భాగంగా రూ.1,548.98 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టేందుకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది.
LPS రైతులకు కనీస యాన్యుటీ చెల్లించేలా నిబంధనల్లో మార్పులు చేసేందుకు కూడా కేబినెట్ అంగీకరించింది. పారిశ్రామిక రంగానికి సంబంధించి పలు ప్రతిపాదనలకు కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దాచేపల్లిలో మై హోమ్ ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయనున్న గ్రీన్‌ఫీల్డ్ సిమెంట్ యూనిట్‌కు ప్రోత్సాహకాలు కల్పించేందుకు ఆమోదం తెలిపింది. అదేవిధంగా శ్రీసిటీలో క్యాటర్‌పిల్లర్ గ్రీన్‌ఫీల్డ్ ఫెసిలిటీ ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది. కుప్పం ప్రాంతంలో పలు పరిశ్రమలకు భూముల కేటాయింపుల ప్రతిపాదనలకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయాల ద్వారా రాష్ట్రానికి పెట్టుబడులు రావడంతో పాటు పారిశ్రామిక కార్యకలాపాలు, ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వం పేర్కొంది. స్థానిక సంస్థల ఎన్నికల అంశం కూడా కేబినెట్ సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది.
.webp)
ఎన్నికలు దశలవారీగా నిర్వహించనున్నట్లు సీఎం చంద్రబాబు మంత్రులకు వివరించారు. ఎన్నికల ప్రక్రియకు సంబంధించి సమయం వృథా చేయకుండా ముందస్తుగా సిద్ధంగా ఉండాలని మంత్రులకు సూచించారు.సోషల్ మీడియాలో జరుగుతున్న అవాస్తవ ప్రచారంపై కూడా సమావేశంలో చర్చ జరిగింది. తప్పుడు కథనాలను గుర్తించి పర్యవేక్షించేందుకు ప్రత్యేక మానిటరింగ్ మెకానిజం ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. దీనిపై డీజీపీ స్పందిస్తూ త్వరలోనే ప్రత్యేక మానిటరింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని తెలిపినట్లు సమాచారం. రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న వర్షాల పరిస్థితిపైనా కేబినెట్ సమీక్షించింది. వర్షాల ప్రభావం, రైతులకు కలిగే ప్రయోజనాలు, తీసుకోవాల్సిన తదుపరి చర్యలపై మంత్రులు చర్చించారు. కేబినెట్ ఎజెండా పూర్తైన అనంతరం ఎల్‌నినో అంశంపైనా కీలకంగా చర్చ జరిగినట్లు సమాచారం.
[ AP Cabinet meeting, CM Chandrababu, New commissionerates, Amaravati, Greenfield Cement Unit, My Home Industries, Naralokesh, Home minister anitha, Telugu One, Telugu News ]


