చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ: ఏయే అంశాలు చర్చకు రానున్నాయంటే.?
Published on: Wed Sep 23, 2026 9:41AM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం బుధవారం (సెప్టెంబర్ 23) జరగనుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కానున్న ఈ సమావేశంలో పలు కీలక ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలపనున్నట్లు సమాచారం.
రాష్ట్ర అభివృద్ధి, రాజధాని అమరావతి నిర్మాణం, కొత్త పెట్టుబడుల ఆకర్షణ వంటి అంశాలపై కేబినెట్ చర్చించి ఆమోదముద్ర వేసే వఅవకాశం ఉంది. కేబినెట్ సమావేశంలో అమరావతి అభివృద్ధితో పాటు రాష్ట్రానికి కొత్త పరిశ్రమలను తీసుకురావడం, పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పించడం వంటి అంశాలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అమరావతి అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లే క్రమంలో వివిధ ప్రాజెక్టుల అమలుపై దృష్టి సారిస్తోంది. రాజధాని ప్రాంతంలో నిర్మాణ పనులు వేగవంతం కావడం, అవసరమైన నిధుల సమీకరణ, మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాలు కీలకంగా మారాయి. ఇటీవల జరిగిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి, ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ ఏపీసీఆర్డీఏ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలకు ఈ భేటీలో కేబినెట్ ఆమోదముద్ర వేయనుంది. ప్రధానంగా అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పన, భూ సమీకరణ సంబంధిత అంశాలపైకేబినెట్ ప్రధానంగా చర్చించనుంది.
వీటితో పాటు రాష్ట్రానికి నూతన పెట్టుబడులను ఆకర్షించే అంశాలపై కూడా కేబినెట్ దృష్టి సారించనుంది. ఐటీ రంగంలో కోట్ల రూసపాయల పెట్టుబడి ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదించే అవకాశం ఉంది. అదేవిధంగా, రాష్ట్రం వర్షాభావం, కరువు పరిస్థితులు, తుపాను ప్రభావం, తాజా రాజకీయ పరిణామాలపై కూడా చర్చించనున్నట్లు తెలుస్తోంది.

రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధిని వేగవంతం చేయడానికి ప్రభుత్వం పెట్టుబడుల ప్రోత్సాహక చర్యలు చేపడుతోంది. సెప్టెంబర్ 18న జరిగిన 21వ రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో 22 వేల177.84 కోట్ల రూపాయల విలువైన 28 పారిశ్రామిక ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. ఈ ప్రాజెక్టుల ద్వారా సుమారు 19 వేల 739 మందికి ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని ప్రభుత్వం వెల్లడించింది. ఐటీ, ఇంధనం, ఆహార శుద్ధి, తయారీ, పర్యాటక రంగాల్లో పెట్టుబడులకు చంద్రబాబు సర్కార్ ప్రాధాన్యత ఇస్తున్న సంగతి తెలిసిందే.
రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించేందుకు ముందుకొచ్చే సంస్థలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడం, అనుమతుల ప్రక్రియను సులభతరం చేయడం వంటి అంశాలు పెట్టుబడుల వృద్ధికి కీలకంగా మారనున్నాయి. భవిష్యత్తు సాంకేతిక రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌ను ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో ప్రభుత్వం ఐటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటం కంప్యూటింగ్ వంటి రంగాలపై దృష్టి సారిస్తోంది. ఈ రంగాలకు సంబంధించిన పది ప్రాజెక్టులకు రూ.500 కోట్లకు పైగా పెట్టుబడులతో పాటు దాదాపు 9 వేల ఉద్యోగాల కల్పనకు సంబంధించిన ప్రతిపాదనలు ఆమోదం పొందాయి.
[AP Cabinet Meeting, Government Andhra Pradesh, Amaravati Development, Chandrababu Naidu, AP Investments, Andhra Pradesh Industries, AP IT Sector, Quantum Technology]


