అల్పపీడన ప్రభావం.. ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు..!
Published on: Sun Sep 13, 2026 11:58AM

అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మరోసారి వాతావరణం చల్లబడింది. దక్షిణ ఛత్తీస్‌గఢ్ పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో నేడు భారీ నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. గత కొన్ని రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వాతావరణం మారుతూ వస్తోంది. ఎండ తీవ్రత కాస్త తగ్గి, అక్కడక్కడ చిరుజల్లులు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే వాతావరణ కేంద్రం తాజాగా మరో కీలక అప్‌డేట్ అందించింది.
.webp)
ప్రస్తుతం దక్షిణ ఛత్తీస్‌గఢ్ వైపు కొనసాగుతున్న అల్పపీడనం రాబోయే ఇరవై నాలుగు గంటల్లో విదర్భ మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా పయనించే ఛాన్స్ ఉందని అధికారులు తెలిపారు. దీని ప్రభావం కారణంగా ఇరు రాష్ట్రాల్లోనూ వర్షాలు జోరందుకునే సూచనలున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు దక్షిణ కోస్తాలో వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేశారు. రాయలసీమ ప్రాంతంలో కూడా తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
.webp)
ఏలూరు, అల్లూరి సీతారామరాజు, మన్యం, పోలవరం, పల్నాడు, అనకాపల్లి, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్, కృష్ణా మరియు గుంటూరు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడే ప్రమాదం ఉందని హెచ్చరికలు జారీ అయ్యాయి.
తెలంగాణ విషయానికి వస్తే, యాదాద్రి భువనగిరి, మేడ్చల్, మెదక్, సిద్దిపేట, హన్మకొండ, వరంగల్, భూపాలపల్లి, ములుగు, కరీంనగర్, మహబూబాబాద్, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ అకస్మాత్తు వాతావరణ మార్పులతో ఉక్కపోత నుంచి ప్రజలకు ఉపశమనం లభించినప్పటికీ, లోతట్టు ప్రాంతాల ప్రజలు మరియు ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వ్యవసాయ పనుల్లో ఉన్న రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
[ AP and Telangana rains, Low pressure weather update, Telugu states rain forecast, Meteorological department warning, Heavy rain districts AP Telangana, Telugu One, Telugu News ]


