కేసీఆర్ తో సఖ్యత కోసం తెలంగాణా-తెదేపా నష్టపోనవసరం లేదు

 

అమరావతి శంఖుస్థాపన కార్యక్రమం సందర్భంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కేసీఆర్ ల మధ్య కొంత సయోధ్య ఏర్పడింది. ఇటువంటి సానుకూల వాతావరణం వలన రెండు ప్రభుత్వాల మధ్య ఘర్షణలు కూడా తగ్గుతాయి కనుక రెండు ప్రభుత్వాలు పరిపాలన, రాష్ట్రాభివృద్ధిపై పూర్తిగా దృష్టి కేంద్రీకరించగలుగుతాయి. ఈ సహృద్భావ వాతావరణం చెదిరిపోకుండా ఉండేందుకే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరంగల్ ఉప ఎన్నికల ప్రచారానికి వెళ్ళలేదని భావించవచ్చును. అందుకు ఇతరత్రా అనేక కారణాలు కూడా ఉండి ఉండవచ్చును కానీ ప్రధాన కారణం మాత్రమే ఇదేనని భావించవచ్చును.

 

ఇదే కారణంగా ఇక ముందు కూడా ఆయన తెలంగాణా రాజకీయాలకు దూరంగా ఉండాలని భావిస్తున్నట్లు వార్తలు వచ్చేయి. ఒకవేళ ఆ వార్తలు నిజమనుకొంటే చంద్రబాబు నాయుడు తీసుకొన్న ఆ నిర్ణయం వలన ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మరింత సయోధ్య పెరగవచ్చును కానీ తెలంగాణాలో తెదేపా తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంటుంది.

 

గత పన్నెండేళ్లుగా తెలంగాణా తెదేపా నేతలు ప్రతిపక్ష బెంచీలలో కాలం వెళ్లదీస్తున్నారు. ఇంకా మరో మూడున్నరేళ్ళు వెళ్లదీయవలసి ఉంది. కనీసం వచ్చే ఎన్నికలలో అయినా విజయం సాధించి అధికారంలోకి రావాలంటే ఇప్పటి వరకు వారు ప్రజా సమస్యలపై ఏవిధంగా తెరాస ప్రభుత్వంతో గట్టిగా పోరాడుతున్నారో అదేవిధంగా ఇక ముందు కూడా పోరాడవలసి ఉంటుంది. అప్పుడే వారి ఉనికిని చాటుకోగలుతారు, వచ్చే ఎన్నికలలో ప్రజలను ఓట్లు అడుగగలుగుతారు. కానీ ఇరువురు ముఖ్యమంత్రులు, ప్రభుత్వాల మధ్య ఏర్పడిన సహృద్భావ వాతావరణం అలాగే నిలిపి ఉంచేందుకు తెరాస ప్రభుత్వంపట్ల తెలంగాణా తెదేపా నేతలు మెతకవైఖరి అవలంభించినట్లయితే, అది కాంగ్రెస్ పార్టీకి గొప్ప వరంగా మారుతుంది.

 

ఇంతవరకు తెలంగాణాలో తెదేపా కూడా ఒక బలమయిన రాజకీయ శక్తిగా గుర్తింపు కలిగి ఉంది. కానీ ఇప్పుడది వెనక్కి తగ్గినట్లయితే దాని స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ ఆక్రమిస్తుంది. తెరాస ప్రభుత్వానికి ఎదురొడ్డి పోరాడగల ఏకైక పార్టీగా, తెరాసకు ఏకైక ప్రత్యామ్నాయంగా అవతరిస్తుంది. ప్రతిపక్షంలో ఉండి ప్రజా సమస్యలపై పోరాడలేకపోతే చివరికి నష్టపోయేది సదరు పార్టీ నేతలే తప్ప ప్రజలు కాదు. తెలంగాణాలో వైకాపా పరిస్థితిని చూసినట్లయితే ఆ విషయం అర్ధం అవుతుంది.

 

రెండు రాష్ట్రాల మధ్య సయోధ్య నిలిపి ఉంచుతూనే, తెలంగాణాలో తెదేపా లాభపడే మార్గం ఒకటుంది. తెరాస ప్రభుత్వాన్ని వ్యతిరేకించలేని పరిస్థితిలో ఉండి నష్టపోవడం కంటే, తెరాస-తెదేపా-బీజేపీలు చేతులు కలిపినట్లయితే తెలంగాణాలో తిరుగులేని మహాశక్తిగా అవతరించవచ్చును. అంతే కాదు దాని వలన తెలంగాణాలో తెదేపా, బీజేపీ నేతలకు అధికారం అవకాశం దక్కవచ్చును. తెలంగాణా రాష్ట్రాభివృద్ధికి కేంద్రప్రభుత్వ సహాయసహకారాలు పుష్కలంగా లభిస్తాయి. కాంగ్రెస్ నేతలు జోస్యం నిజం చేస్తూ తెరాస కూడా ఎన్డీయే కూటమిలో చేరి కవితమ్మ కలలు సాకారం చేసుకోవచ్చును. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వాల మధ్య, ప్రజల మధ్య ఇంకా సహృద్భావం పెరిగి, విభజన సమస్యలన్నీ సమసిపోవచును. రెండు తెలుగు రాష్ట్రాలు ఒకదానికొకటి సహకరించుకొంటూ పోటాపోటీగా అభివృద్ధి సాధించవచ్చును.

 

ఈవిధంగా చేయగలిగినట్లయితే తెలంగాణాలో కాంగ్రెస్, ఆంధ్రప్రదేశ్ లో వైకాపా ఒంటరి అయిపోతాయి. బహుశః అప్పుడు ఆ రెండు పార్టీలు చేతులు కలుపవచ్చును కానీ దాని వలన బలీయమయిన శక్తిగా అవతరించే తెరాస, తెదేపా, బీజేపీలపై ఎటువంటి ప్రభావం ఉండబోదు. చంద్రబాబు నాయుడు తెలంగాణా రాజకీయాలకు దూరంగా ఉండి తన పార్టీని నష్టపరుచుకోవడం కంటే, ఎలాగు కేసీఆర్ తో సఖ్యత కోరుకొంటున్నారు కనుక తెరాసతో చేతులు కలిపి తన పార్టీని కాపాడుకొంటూనే తన తెలంగాణా నేతల రాజకీయ భవిష్యత్ కి కూడా భరోసా కల్పించినట్లయితే వారు సంతోషిస్తారు. పైగా దానివలన ఇన్ని ప్రయోజనాలు కూడా ఉంటాయి కదా.