ఏపీకి మరో తుపాను ముప్పు: రాష్ట్రంపై ప్రకృతి పగపట్టిందా.?
Published on: Thu Oct 29, 2026 12:29PM

ఆంధ్రప్రదేశ్ ను వర్షాలు, తుపాను ముప్పులు వదలనంటున్నాయి. అర్నాబ్ తుపాను కష్టాలు, నష్టాల నుంచి ఇంకా తేరుకోకముందే రాష్ట్రంపై మరో పెను తుపాను పంజా విసరడానికి సిద్ధమౌతోంది. వాతావరణ శాఖ సమాచారం మేరకు దక్షిణ అండమాన్ సముద్రంలో ఏర్పడిన మరో అల్పపీడనం క్రమంగా బలపడి రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.
ఈ అల్పపీడనం పశ్చిమ, వాయువ్య దిశగా పయనిస్తూ అండమాన్, అండమాన్ నికోబా దీవుల సమీపంలో తుపానుగా బలపడే సూచనలు ఉన్నాయి. ఆ తరువాత ఇది మరింత బలపడి ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. దీని ప్రభావంతో వచ్చే నెల 1, 2 తేదీలలో కోస్తాంధ్రతో పాటు పలు ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.

ఇప్పటికే అర్నాబ్ తుపాను ధాటికి ఉత్తరాంధ్ర, ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలు అతలాకుతలమయ్యాయి. వేలాది ఎకరాల్లో పంటలు, ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. ఇప్పుడు మరో తుపాను ముప్పు ముంచుకొస్తున్నదన్న హెచ్చరికలతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలలో ఆందోళన వ్యక్తమౌతోంది.
[Another Cyclone Threat AP, Bay of Bengal Low Pressure, Andaman Sea Cyclone Alert, AP Weather Forecast November, Andhra Pradesh Heavy Rains, Telugu One]


