లోన్ ఫ్రాడ్ కేసు: వైసీపీ మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ కు బిగుస్తున్న ఉచ్చు.!
Published on: Thu Oct 1, 2026 12:21PM

లోన్ ఫ్రాడ్ కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే అన్నా బత్తుని శివకుమార్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. జగన్ హయాంలో ఏం చేసినా నడిచిపోతుందన్న ధీమాతో వ్యవహరించిన అన్నాబత్తుని ఇప్పుడు ఆ సమయంలో చేసిన తప్పిదాలు, మోసాలకు మూల్యం చెల్పించుకోవలసిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
జగన్ హయాంలో లేని కంపెనీని ఉన్నట్టుగా భ్రమింపజేసి, పత్రాల మాయాజాలంతో పెద్ద మొత్తంలో రుణాలు తీసుకుని ఎగ్గొట్టేసిన వ్యవహారం ఇప్పుడు అన్నాబత్తుని మెడకు చుట్టుకుంటోంది.ఆ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు వేగంతం చేయడంతో.. అన్నాబత్తుల ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ముఖ్యంగా ఏపీజే ఇంపెక్స్ అనే కంపెనీ పేరుతో జరిగిన లావాదేవీలు, సమర్పించిన డాక్యుమెంట్ల ప్రామాణికత అనుమానాస్పదంగా ఉందని పోలీసులు ఇప్పటికే నిర్ధారించారు. విజయవాడ నగరానికి చెందిన ఐకేఎఫ్ ఫైనాన్స్ సంస్థ ఫిర్యాదుతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
పోలీసుల దర్యాప్తులో.. సదరు కంపెనీ రిజిస్ట్రేషన్ పత్రాలలో పేర్కొన్న చిరునామాలు తప్పుడివని తేలింది. రిజిస్ట్రేషన్ పత్రాలలో పేర్కొన్న చిరునామాలలో ఎలాంటి కార్యాలయం బోర్డు గానీ, కంపెనీ కార్యకలాపాల ఆనవాళ్లు గానీ లేవని దర్యాప్తులో వెల్లడైంది. ఏపీజే ఇంపెక్స్ పేరుతో అన్నా బత్తుని శివకుమార్ 2019లో 3 కోట్ల రూపాయల రుణాన్ని పొందినట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. ఈ లోన్ మంజూరైన తర్వాత ఆ బ్యాంకు ఖాతాలలో జరిగిన లావాదేవీలు, నిధుల మళ్లింపు, ఇతర ఆర్థిక అంశాలపై ఫైనాన్స్ నిపుణులు, ప్రత్యేక దర్యాప్తు బృందాలు దృష్టి సారించాయి. అసలు కంపెనీ పేరుతో ఎలాంటి వ్యాపార కార్యకలాపాలు నిర్వహించకుండా, కేవలం అక్రమంగా డబ్బు పొందడానికే ఈ ఫేక్ కంపెనీ పేరును వాడుకున్నారని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.

ఈ మొత్తం కుంభకోణంలో కేవలం కంపెనీ ఉనికి మాత్రమే కాకుండా, లోన్ కోసం సమర్పించిన ఆస్తి పత్రాలు, భూముల సర్వే వివరాలు, ఎన్‌కంబరెన్స్ సర్టిఫికెట్లు వంటి డాక్యుమెంట్లు కూడా వివాదాస్పదంగా మారాయి. ఆ పత్రాలు ఎవరు జారీ చేశారు, ఏ రకమైన ఆధారాలతో వాటిని ధ్రువీక రించారు, సంబంధిత ప్రభుత్వ అధికారులు వాటిపై ఎలా సంతకాలు పెట్టారనే అంశాలపై పోలీసులు దృష్టి పెట్టి దర్యాప్తు చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ సమయంలో చూపిన అడ్రస్, బ్యాంకు ఆడిట్ నివేదికలు, మరియు సమర్పించిన ఆస్తి పత్రాలు నకిలీవని తేలితే మాజీ ఎమ్మెల్యే ఇరుక్కున్నట్లేనని పరిశీలకులు అంటున్నారు.
[Anna Battuni Sivakumar, Y CP former MLA, Loan Fraud Case, APJE Impex Loan Fraud, IKF Finance Complaint, Telugu One]


