ఏపీలో జిల్లా పరిషత్ ల పునర్విభజన.. జీవో జారీ.!
Published on: Sat Sep 5, 2026 3:43PM

ఆంధ్రప్రదేశ్ లో స్థానిక ఎన్నికల నిర్వహణ దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా జడ్పీల పునర్విభజన ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. జిల్లాల పునర్విభజనకు అనుగుణంగా కొత్తగా జిల్లా పరిషత్‌లను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులతో గతంలో ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన కొనసాగిన 13 జడ్పీల స్థానంలో 28 జెడ్పీలు అందుబాటులోకి రానున్నాయి. కొత్తగా రూపుదిద్దుకున్న మార్కాపురం, పోలవరం తదితర ప్రాంతాలకు సైతం ప్రత్యేకంగా జిల్లా పరిషత్‌లను మంజూరు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పాలనా సౌలభ్యం, ప్రజలకు ప్రభుత్వ ఫలాలు మరింత చేరువయ్యేలా ఈ మార్పులు జరిగాయి.
కొత్త జిల్లా పరిషత్‌ల సమర్థవంతమైన నిర్వహణపై అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. అదనంగా 15 జెడ్పీ సీఈవో పోస్టులతో పాటు మరో 15 డిప్యూటీ సీఈవో పోస్టుల మంజూరుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మొత్తంగా ఈ పరిపాలనా మార్పుల కోసం 30 కీలక ఉన్నత స్థాయి అధికారుల పోస్టులను కొత్తగా కేటాయించేలా ప్రణాళికలు రూపొందించారు.

ప్రస్తుతం కొనసాగుతున్న జిల్లా పరిషత్ పాలకవర్గాల పదవీకాలం ఈ నెల 24తో ముగియనుంది. పాలక వర్గాల గడువు పూర్తి కాగానే ఈ నూతన 28 జెడ్పీల వ్యవస్థ పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తుంది. ఈ మేరకు రాష్ట్రంలోని దాదాపు 660 మండలాలను నూతనంగా ఏర్పడిన జెడ్పీల పరిధిలోకి మ్యాపింగ్ చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి.
ఇక ఉద్యోగుల సర్దుబాటు విషయంలోనూ ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోంది. అదనపు సిబ్బంది నియామకాలకు బదులుగా, ప్రస్తుత పనిభారం ఆధారంగా అందుబాటులో ఉన్న సిబ్బంచినే కొత్త జెడ్పీలకు కేటాయించి సర్దుబాటు చేయాలని భావిస్తున్నది. మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ పూర్తి అయ్యేలోగా ఈ జడ్పీల పునర్విభజన, మ్యాపింగ్ ప్రక్రియను పూర్తిగా ముగించాలని ప్రభుత్వం భావిస్తోంది.
Andhra Pradesh Zilla Parishads, AP District Reorganisation, Local Body Elections AP, ZP CEO Posts, AP News, Telugu One


