ఆంధ్రప్రదేశ్ లో కొత్త పర్యాటక శోభ.. పది ప్రాంతాలలో సీప్లేన్ లు.!
Published on: Wed Sep 9, 2026 10:53AM

ఆంధ్రప్రదేశ్ సరి కొత్త పర్యాటక శోభకు తెరలేచింది. రాష్ట్ర పర్యాటక రంగంలో కొత్త శకం ఆరంభం అయ్యేందుకు తెర లేచింది. రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలను జల మార్గాల ద్వారా అనుసంధానించే సీ ప్లేన్ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. స్కైహోప్ ఏవియేషన్, మారిటైం ఎనర్జీ హెలి ఎయిర్ సర్వీసెస్ సంస్థలు ముందుకు రాగా, కేంద్ర పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ ఈ ప్రాజెక్టు ప్రతిపాదనలకు అఫీషియల్ గా ఆమోదముద్ర వేసింది. పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ (పీపీపీ) విధానంలో అమలవుతున్న ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 10 పర్యాటక ప్రాంతాల్లో సీ ప్లేన్ సేవలు అందుబాటులోకి వస్తాయి. ఈ సరికొత్త రవాణా విధానం వల్ల రాష్ట్రంలో పర్యాటక రంగం కొత్త పుంతలు తొక్కుతుందనడంలో సందేహం లేదు.
ఎంపిక చేసిన ఈ పది ప్రాంతాల్లోనూ ప్రయాణికుల రాకపోకల కోసం వాటర్‌డ్రోమ్‌లు అంటే మినీ విమానాశ్రయాల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ పర్యాటకాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో త్వరలోనే వీటికి టెండర్లు పిలువనున్నారు. ఒక్కో వాటర్‌డ్రోమ్ నిర్మాణానికి అంచనా వ్యయం 20 కోట్ల రూపాయలు.

విజయవాడలోని బెర్మ్ పార్క్, ఆధ్యాత్మిక క్షేత్రం శ్రీశైలం, తీర ప్రాంత నగరమైన విశాఖపట్నం, తిరుపతిలోని రాయలచెరువు, సూర్యలంక, చారిత్రక గండికోట, కాకినాడ, అరకులోని జోలాపుట్, లంబసింగిలోని తాజంగి రిజర్వాయర్, పోలవరం ప్రాంతాలలో ఈ సీ ప్లేన్ సేవలు దశలవారీగా ప్రారంభం కానున్నాయి. గతంలో విజయవాడలోని బెర్మ్ పార్కు నుంచి శ్రీశైలం వరకు నిర్వహించిన ట్రయల్ రన్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా సీ ప్లేన్‌లో ప్రయాణించి ఈ ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే.
ఈ ప్రాజెక్టు విజయవంతం కావడానికి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన ఉడాన్ పథకం కింద ఆర్థిక చేయూత అందిస్తోంది. ప్రయాణికుల నుంచి పూర్తి స్థాయి ఆదరణ లభించే వరకు ఆపరేటర్లకు నష్టాలు వస్తే వాటిని భర్తీ చేసేందుకు లోటు భర్తీ నిధి కింద సాయం అందనుంది. దేశంలో ఇప్పటికే గుజరాత్, కేరళ రాష్ట్రాల్లో ఉడాన్ పథకం కింద సీ ప్లేన్ సర్వీసులు విజయవంతంగా నడుస్తున్నాయి. ఇప్పుడు ఆ జాబితాలో ఆంధ్రప్రదేశ్ కూడా చేరుతోంది. ఈ వాటర్‌డ్రోమ్‌లను కేవలం సీ ప్లేన్ల రాకపోకలకే కాకుండా, స్థానికంగా పర్యాటకుల కోసం నడిచే ఇతర బోటింగ్ అవసరాలకు కూడా ఉపయోగపడేలా డిజైన్ చేస్తున్నారు. ఈ వినూత్న సేవలు అందుబాటులోకి వస్తే ఏపీకి వచ్చే దేశవిదేశీ పర్యాటకుల సంఖ్య మరింత పెరిగి, స్థానిక ఉపాధి అవకాశాలు కూడా విపరీతంగా పెరుగుతాయని పర్యాటక శాఖ అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
[New Era In Andhra Pradesh tourism, AP seaplane services, UDAN scheme AP, waterdromes in AP, Vijayawada Srisailam seaplane, APTDC tourism projects, Telugu One]


