బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు: జీవోలను కొట్టివేసిన ఏపీ హైకోర్టు.!
Published on: Thu Oct 1, 2026 11:25AM

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ హైకోర్టు తీర్పుతో కీలక మలుపు తిరిగింది. స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 105, 1065జీవోలను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. అదే సమయంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను ఆరు వారాల్లోగా ప్రారంభించాలని ఆదేశించింది. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో దాఖలైన పిటిషన్లను విచారించిన ఏపీ హైకోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది. మొత్తం రిజర్వేషన్లు సుప్రీంకోర్టు నిర్దేశించిన పరిమితిని దాటుతున్నాయని పిటిషనర్లు వాదించారు. అయితే ప్రభుత్వం మాత్రం బీసీలకు 34 శాతం కోటాను సమకాలీన బీసీ జనాభా లెక్కలు, యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే వంటి వివరాల ఆధారంగా నిర్ణయించినట్లు కోర్టుకు తెలిపింది.
ఈ పిటిషన్ల విచారణ సందర్భంగా హైకోర్టు ప్రభుత్వాన్ని 34 శాతం రిజర్వేషన్లను ఏ గణాంకాల ఆధారంగా నిర్ణయించారో పూర్తి వివరాలను సమర్పించాలని ఆదేశించింది. రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ నివేదిక, సమగ్ర కుటుంబ సర్వే వివరాలను కూడా పరిశీలించింది. కమిషన్ నివేదిక ఇంకా ప్రభుత్వ పరిశీలనలోనే ఉందని చెబుతున్న సమయంలో.. అదే నివేదిక ఆధారంగా రిజర్వేషన్లు ఎలా నిర్ణయించారన్న అంశంపై కూడా ధర్మాసనం ప్రశ్నలు లేవనెత్తింది. మొత్తం మీద స్థానిక ఎన్నికల్లో బసీలకు 34 శాతం రిజర్వేషన్లకు హైకోర్టు తీర్పుతో బ్రేక్ పడింది.

మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలను ఆలస్యం చేయకుండా ఎన్నికల ప్రక్రియను ఆరు వారాల్లోగా ప్రారంభించాలని హైకోర్టు ఆదేశించింది. ఇక ఎన్నికల నోటిఫికేషన్, షెడ్యూల్ తదితర అంశాలపై రాష్ట్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాల్సి ఉంది. హైకోర్టు 34 శాతం రిజర్వేషన్లకు సంబంధించిన జీవోలను కొట్టివేయడంతో.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ఎంత మేర రిజర్వేషన్లు అమలు చేస్తారన్నది ఇప్పుడు కీలకంగా మారింది. ప్రభుత్వం తదుపరి న్యాయపరమైన చర్యలు తీసుకుంటుందా? లేక కోర్టు ఆదేశాలకు అనుగుణంగా కొత్త విధానాన్ని రూపొందిస్తుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.
[Andhra Pradesh, Local Body, Elections, BC reservations, GOs, AP High Court, Struk Down, Telugu One]


