ఏపీలో వర్ష బీభత్సం: పొంగుతున్న వాగులు, వంకలు.!
Published on: Thu Sep 24, 2026 10:34AM

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలను భారీ వర్షాలు ముంచెత్తాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుంభవృష్టి కారణంగా పలు ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. నదులు, కాలువల్లో నీటిమట్టాలు ప్రమాదకరస్థాయికి చేరాయి. భారీ వర్షాలు పట్టణాలు, గ్రామాలలో జనజీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి. రోడ్లు జలమయమై రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
వాతావరణ శా, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సమాచారం మేరకు రాష్ట్రంలోని 80 ప్రాంతాల్లో 100 మిల్లీమీటర్లకు పైగా భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదైంది. విశాఖపట్నం రూరల్ పరిధిలోని తులసినగర్‌లో అత్యధికంగా 236 మిల్లీమీటర్ల రికార్డు స్థాయి వర్షం కురిసింది. అలాగే మధురవాడలో 218, ఎండాడలో 210, మీ., సీతమ్మధారలో 205మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. దీంతో విశాఖపట్నం నగరంలోని పలు కాలనీలు, లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి.

బుధవారం అర్ధరాత్రి కళింగపట్నం సమీపంలో వాయుగుండం తీరం దాటినట్లు వాతావరణ శాఖ తెలిపింది. వాయుగుండం తీరం దాటే సమయంలో ఈదురుగాలుల తీవ్రత అధికంగా ఉంది. తీరం దాటినా వాయుగుండం ప్రభావం రాగల మరో పన్నెండు గంటల పాటు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కాగా తుపాను నేపథ్యంలో రాష్ట్ర యంత్రాంగం అప్రమత్తమైంది. సహాయక చర్యలను ముమ్మరం చేసింది.
శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది. మరో 48 గంటల పాటు ప్రతికూల వాతావరణం కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలనీ, వర్షం కురిసే సమయంలో చెట్ల కింద నిలబడవద్దని సూచించింది.
Andhra Pradesh, Cyclone, Rains, Visakhapatnam Heavy Rainfall, Kalingapatnam, Weather Alert, North Andhra, AP news, Telugu One


