ఇక్క‌డ ఇరానీ.. అక్కడ అల్ హిందీ.. ఏమిటీ లింకు?

posted on: Mar 4, 2026 8:30AM

భార‌త్ కి ఇరాన్ కీ ఉన్న సంబంధ బాంధ‌వ్యాలు శతాబ్దాల నాటివి. సింధూనాగ‌రిక‌త కాలం నాటివి.. ఇది విన‌డానికి ఒకింతఅతిశ‌యోక్తిగా ఉన్నా.. ఇది  వాస్త‌వం, ప‌చ్చి నిజం అని చెబుతారు చరిత్ర కారులు. ఆర్య- ద్ర‌విడ సిద్ధాంతం పుట్టుకొచ్చిన విధం కూడా ఇందులో క‌ల‌గ‌ల‌సి ఉంటుందంటారు  ప‌రిశోధ‌కులు. 

 అదెలాగంటే.. హిమాల‌య ప‌ర్వ‌తాలు ఏర్ప‌డ్డానికి.. ఈ ఆర్య- ద్ర‌విడ సిద్ధాంతానికీ ఎంతో సంబంధం. అందులో ఇరాన్ కి భార‌త్ కీ ఉన్న లింకులు చాలా చాలా  పురాత‌న‌మైన‌వి. అదెలాగో చూస్తే అప్ప‌ట్లో అంటే ఐస్ ఏజ్ కాలంలో భూమి.. పై క‌దిలిక‌లు ఉండేవి. ఈ క‌ద‌లిక‌ల ద్వారా.. ఆఫ్రికా ఖండం ఒక‌టి కొట్టుకొచ్చి.. ఇక్క‌డి ఏషియా ఖండాన్ని ఢీ కొట్టింద‌ని అంటారు. ఆ ఘ‌ర్ష‌ణ వ‌ల్ల ఏర్ప‌డిన‌వి  హిమ‌శిఖ‌రాల‌ని చెబుతారు  ప‌రిశోధ‌కులు. అలా హిమానీ న‌దాలు ఏర్ప‌డి ఈ ఖండం మీద‌కు సింధూ జ‌లాల ప్ర‌వాహం మొద‌లైందని అంటారు.

ఆల్రెడీ ఆఫ్రికా ఖండం ద్వారా వ‌చ్చిన‌ వారు ద్ర‌విడులుగానూ.. ఈ జ‌లాల‌ను ఆశించి ఇరాన్, ఇరాక్, ఆఫ్ఘన్ దేశాల నుంచి వ‌ల‌స వ‌చ్చిన వారు ఆర్యులుగానూ చెబుతారు. అస‌లు ఆర్యులు అనే ప‌దంలోంచి పుట్టుకొచ్చిందే ఇరాన్ అని   చెబుతుంది మ‌న ఖ‌గోళ చ‌రిత్ర‌.  

అందుకే మ‌న‌కు ఇక్క‌డ ఇరానీ సంప్ర‌దాయంతో పాటు వారి ద్వారా వ‌చ్చిన పార్శీల పేర్ల‌లో ఇరానీ అనే శ‌బ్ధాలు క‌ల‌గ‌ల‌సి ఉంటాయి. బొమ‌న్ ఇరానీ, అలీ ఇరానీ, స్మృతీ ఇరానీ వంటి పేర్లు అలా వ‌చ్చిన‌వే. ఈ పార్శీలు 8వ శ‌తాబ్దికాలంలో ఇరాన్ లో ఇస్లామిక్ దాడులు పెరిగిన‌పుడు త‌మ మ‌త‌మైన జొరాష్ట్రియ‌నిజాన్ని కాపాడుకోవ‌డం కోసం భార‌త్ కి వ‌ల‌స వ‌చ్చారు. ఇక స్మృతి  ఇరానీ పుట్టుక‌తో ఇరానియ‌న్ కాదు. కానీ ఆమె భ‌ర్త జుబిన్ ఇరానీ పార్శీ. దీంతో ఆమె ఇంటి పేరులో ఇరానీ శ‌బ్ధం వ‌చ్చి క‌లిసింది. ఇక ఫ‌క్తు ఇరానీలు.. 19వ శ‌తాబ్దిలో ఇరాన్ నుంచి వ్యాపారం నిమిత్తం భార‌త్ కి వ‌చ్చారు. వీరి ద్వారా భార‌త్ లో వెల‌సిన‌వే ఇరానీ చాయ్ లు, కేఫ్ లు. 
       
అప్ప‌ట్లో ఇరాన్, ఇరాక్, ఆఫ్గ‌న్ వంటి  ప్రాంతాల్లో విప‌రీత‌మైన క‌ర‌వు కాట‌కాలుండేవి. ఆ మాట‌కొస్తే అవ‌న్నీ ఎడారి ప్రాంతాలు. జ‌ల శ‌బ్ధం అక్క‌డి వారికి ఎంత‌కీ వినిపించేది కాదు. అలాంటి ప‌రిస్థితుల్లో ఇక్క‌డి ప్ర‌కృతి వ‌న‌రులను ఆశించి వ‌చ్చిన వారే ఆర్యులుగా చెబుతాయి ప‌లు హిస్టారిక‌ల్ రిపోర్ట్స్.ఇక పురాత‌న ఇరానియ‌న్ గ్రంధం జెండ్  అవెస్తా, మ‌న రుగ్వేదం మ‌ధ్య భాషా ప‌రంగా, దేవుళ్ల ప‌రంగా కొంత ద‌గ్గ‌ర పోలిక‌లు ఉన్న‌ట్టు క‌నిపిస్తాయి. ఉదాహ‌ర‌ణ‌కు మిత్ర‌, వ‌రుణ వంటి పోలిక‌లున్నట్టు చెబుతారు. ప‌లువురు  భాషా  శాస్త్ర‌వేత్త‌ల అంచ‌నాల ప్ర‌కారం.. ఇండో- ఇరానియ‌న్లు ఒక‌ప్పుడు క‌లిసి ఉండేవార‌ని తెలుస్తోంది. కాల క్ర‌మేణా ఒక వ‌ర్గం ఇరాన్ వైపు, మ‌రో వ‌ర్గం స‌ప్త సింధూ అంటే భార‌త్ వైపు ప‌య‌నించార‌నీ.. అంటారు. ఉత్త‌రాదిలో.. ఇక్క‌డున్న ప్ర‌కృతి వ‌న‌రుల దృష్ట్యా ఒక ప్ర‌త్యేక జీవ‌న శైలి ఏర్పాటు చేసుకున్నార‌నీ అంటారు.
 
ఇక జ‌న్యు ప‌ర‌మైన మూలాల్లోకి వెళ్తే.. భార‌తీయుల్లోని  హ్యాప్లో గ్రూప్ జ‌న్యువులు ఇరానియ‌న్ల‌లో ఎక్కువ‌గా క‌నిపిస్తాయ‌ని చెబుతారు వైద్య‌నిపుణులు. అక్క‌డి  నుంచి ఇక్క‌డికి వల‌స వ‌చ్చిన వారిని ఇరానీ అన్న పేరుతో ఎలా  పిలుస్తారో.. ఇక్క‌డి నుంచి అక్క‌డికి వెళ్లిన  వారి  పేరు చివ‌ర హిందీ అని ఉంటుంది. ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ గా.. ఖ‌మేనీ గురువు ఖొమేనీ పూర్వికుల ఉదంతం తీసుకోవ‌చ్చు. ఖొమేనీ  తాత పేరు- స‌య్య‌ద్ అహ్మ‌ద్ ముసావీ హిందీ. ఇలా హిందీ అన్న పేరు ఎందుకు పెట్టుకున్నారంటే.. వీరు భార‌త దేశంలోని ఉత్త‌ర ప్ర‌దేశ్ కి చెందిన కింతూర్ అనే గ్రామానికి చెందిన వారు.  1830 ప్రాంతంలో వీరు మ‌త‌ప‌ర‌మైన ఉన్న‌త చ‌దువుల కోసం ల‌క్నో నుంచి ఇరాన్ లోని న‌జాఫ్ న‌గ‌రానికి వెళ్లారు. అక్క‌డే స్థిర‌ప‌డి పోయారు. 
 
ఇక హిందీ గుర్తింపు ఎలాంటిదో చూస్తే ఖొమేనీ కుటుంబం ఇరాన్ లో నివ‌సిస్తున్నా వారి  పేర్ల చివ‌ర అల్ హిందీ ఉండేది. అంటే వీరు భార‌త్ నుంచి వ‌ల‌స వ‌చ్చిన వార‌ని గుర్తించ‌డం కోసం. అలా భార‌త్ నుంచి ఇరాన్ కి, ఇరాన్ నుంచి భార‌త్ కి వ‌ల‌స‌లు ఈనాటివి  కావు. కొంత క‌న్ ఫ్యూజింగా  ఉన్నా.. భార‌త్ లో ఇరాన్, ఇరాన్ లో భార‌త్ మూలాలు పురాత‌న  కాలం  నాటివి. అందుకే అక్క‌డి నుంచి ఇక్క‌డికి వ‌చ్చిన వారికి ఇరానీ అన్న పేర్లు, ఇక్క‌డి నుంచి అక్క‌డికి వెళ్లిన వారికి అల్ హిందీ అన్న బిరుదులు త‌గిలిస్తుంటారు. ఇదంతా ఎవ‌రెవ‌రు ఎక్క‌డి నుంచి వ‌చ్చారో తెలియ‌డం కోసమ‌ని చెబుతారు మ‌న చ‌రిత్ర కారులు.

google-ad-img
    Related Sigment News
    • Loading...