అనంతపురంలో అద్భుతం: ఎండిన నదిలో నీళ్లు వచ్చాయి.!
Published on: Fri Sep 25, 2026 7:50PM

ఎండిన నదిలో గంగమ్మ పరవళ్లు.. కరువు నేలపై జలకళ.!
అనంతపురం జిల్లా పుట్లూరు మండలంలో చోటుచేసుకున్న ఒక అద్భుత సంఘటన స్థానికంగానే కాక రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఒక్కరిని విస్మయానికి గురిచేస్తోంది. నమ్మకం ఉంటే రాయి కూడా దేవుడవుతుందనడానికి, భక్తుల ఆర్తనాదాలకు ప్రకృతి కూడా కరిగిపోతుందనడానికి ఈ ఘటనే నిదర్శనం. ఒకవైపు కరువు కోరల్లో చిక్కుకుని, చుక్కనీరు లేక అల్లాడిపోతున్న ప్రజల గుండెల్లో ఈ వినాయక చవితి వేడుకలు తీవ్ర విషదాన్ని నింపాయి. సాధారణంగా గణనాధుడిని తొమ్మిది రోజుల పాటు భక్తిశ్రద్ధలతో పూజించి, ఊరంతా డప్పు చప్పుళ్లతో వైభవంగా నిమజ్జనం చేయడం ఆనవాయితీ. కానీ, ఈసారి ఆ ఊరి ప్రజలకు ఆ భాగ్యం కూడా దక్కలేదు. చిత్రావతి నది పరివాహక ప్రాంతంలోని ఆ ఊరిలో చెరువులు, నదులు పూర్తిగా ఎండిపోయి, నేలంతా బీటలువారాయి.
కనీసం కాలు కడిగేందుకు కూడా నీరు లేని దుస్థితి. ఎంతో ఇష్టంగా తెచ్చుకున్న వినాయకుడిని నీటిలో దింపే పరిస్థితి లేక గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు. "మమ్మల్ని క్షమించు తండ్రి.. నీకు నీళ్లు కూడా ఇవ్వలేకపోతున్నాం" అంటూ గుండెలు పిండేసే వేదనతో విగ్రహాలను ఆ ఎండిపోయిన నది గర్భంలోనే వదిలి భారమైన హృదయాలతో వెనుదిరిగారు.ఆ భక్తుల నిస్సహాయత, వారి కన్నీళ్లు ఆ విఘ్నేశుడిని కదిలించాయో ఏమో.. ప్రకృతి ఒక్కసారిగా రూపం మార్చుకుంది. నిన్నటిదాకా ఎండమావులతో మాడిపోయిన ఆకాశంలో అకస్మాత్తుగా కారుమబ్బులు కమ్ముకున్నాయి. ఉరుములు, మెరుపులతో ఆకాశానికి చిల్లుపడిందా అన్నట్లు కుండపోత వర్షం కురిసింది. దాదాపు 48 మిమీటర్లకు పైగా కురిసిన ఈ భారీ వర్షానికి సమీప కొండల్లోంచి జలపాతాలు దూకగా, వాగులు పోటెత్తాయి.

అప్పుడు జరిగింది అసలైన అద్భుతం. ఎండిపోయిన ఆ నదిలోకి సాక్షాత్తు గంగమ్మే పరుగులు తీస్తూ దూసుకొచ్చింది. మనుషులు నీళ్లు లేవని వదిలేసి వెళ్తే, ప్రకృతి తానే స్వయంగా వరద రూపంలో వచ్చి ఆ స్వామి పాదాలను తాకింది. నీటి మట్టం క్రమంగా పెరిగి వినాయకుడి నడుము, చాతి వరకు ముంచెత్తుతూ ఆ గణనాధుడు గంగమ్మ ఒడిలో అద్భుతంగా జలమయమయ్యాడు. "మీరు నన్ను నిమజ్జనం చేయలేకపోతే ఏంటి? నా నిమజ్జనానికి నేనే గంగను రప్పించుకుంటాను" అన్నట్లుగా సాగిన ఈ దైవలీలను చూసి అక్కడి ప్రజలు భక్తిపారవస్యంతో చేతులెత్తి మొక్కుతున్నారు. నీటి ఎద్దడితో అల్లాడుతున్న ఆ ప్రాంత ప్రజలకు ఈ వర్షం కేవలం నీటిని మాత్రమే కాదు, వారి జీవితాల్లో మళ్లీ ఆశలను నింపింది. విశ్వాసం ఉన్నచోట విజ్ఞానం కూడా తలవంచాల్సిందేనని, నమ్మకం ఉంటే అసాధ్యమైనది కూడా సుసాధ్యమవుతుందని ఈ ఘటన నిరూపించింది
[ Anantapur News, Putlur Chitravati River, Ganesh immersion miracle, water in dry river, Andhra Pradesh rains, Ganesh immersion in Republic, Telugu News, Telugu One, Divine Lila Ghatta, Latest News, Rural News ]


