ఏపీ అభివృద్దికి సేవలందిస్తా: తెలుగు బిడ్డగా ఆశీర్వదించండి.. అనంత్ అంబానీ.!
Published on: Fri Oct 2, 2026 4:24PM

అన్నమయ్య జిల్లా మదనపల్లె వేదికగా శుక్రవారం (అక్టోబర్ 2) జరిగిన జరిగిన గ్లోబల్ హార్టికల్చర్ హబ్ అలాగే ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ శంకుస్థాపన కార్యక్రమంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ మరియు వ్యాపార వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
.webp)
.ఈ కార్యక్రమంలో అనంత్ అంబానీ తెలుగులో ప్రసంగించి సభికులను విస్మయపరిచారు. ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి ఆయన తనను ఒక పారిశ్రామికవేత్తలా కాకుండా రాష్ట్రానికి చెందిన బిడ్డలా భావించాలని కోరారు. అందమైన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం తాను సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నానని, తగిన మార్గదర్శనం చేయాలని ఆయన చంద్రబాబును కోరారు. రాయలసీమ ప్రాంతంలో ఉద్యానవన రంగానికి పెద్దపీట వేసేలా రిలయన్స్ సంస్థ భారీ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టిందన్న అనంత్ అంబానీ, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ద్వారా స్థానిక రైతన్నలకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందించి, వారిని ఆర్థికంగా మరింత ఉన్నతస్థితికి తీసుకువస్తామన్నారు.
కేవలం వ్యవసాయాభివృద్ధే కాకుండా గ్రామీణ ఉపాధి అవకాశాలను మెరుగుపరచడమే లక్ష్యంగా తమ ప్రణాళికలు ఉంటాయని స్పష్టం చేశారు.మదనపల్లె గడ్డపైనే రవీంద్రనాథ్ టాగూర్ జాతీయ గీతాన్ని ఆంగ్లంలోకి అనువదించిన చారిత్రక ప్రాధాన్యాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్న అనంత్ అంబానీ, ప్రధాని నరేంద్ర మోదీ కలలుగన్న వికసిత్ భారత్ సాధనలో దేశంలోని యువతతో పాటు తాము కూడా భాగస్వామ్యం అవుతామన్నారు.

అనంత్ అంబానీ ప్రసంగం ముగిసిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయనపై ప్రశంసల వర్షం కురిపించారు. అనంత్ కేవలం వ్యాపార రంగానికే పరిమితం కాకుండా పర్యావరణ పరిరక్షణ, మూగజీవాల సంరక్షణ కోసం నిరంతరం శ్రమిస్తున్నారని కొనియాడారు. తిరుమల శ్రీవారి సేవలో భాగంగా రిలయన్స్ సంస్థ అందించిన ఎలక్ట్రిక్ బస్సుల సేవలను గుర్తుచేసుకుంటూ, ఆయనను తెలుగు ముద్దుబిడ్డగా అభివర్ణించారు. ప్రభుత్వం చేపడుతున్న పారిశ్రామిక అనుకూల విధానాల వల్ల రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు తరలివస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇలాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు అందుబాటులోకి వస్తే రాయలసీమ రూపురేకలు పూర్తిగా మారిపోవడంతో పాటు, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు భారీగా పెరుగుతాయని పరిశీలకులు అంటున్నారు. కాగా తెలుగులో తడబాటు లేకుండా మాట్లాడిన అంతన్ అంబానీని చంద్రబాబు ఆత్మీయంగా హత్తుకుని అభినందించారు.
[Anant Ambani, CM Chandrababu Naidu, Madanapalle Event, Global Horticulture Hub, Indian School of Agriculture, Telugu One]


