బ్రహ్మోస్ క్షిపణులు: పాకిస్థాన్ కు కంటిమీద కునుకు కరవు.!
Published on: Sat Sep 26, 2026 9:55AM

ఇండియా రక్షణ రంగ తయారీ సామర్థ్యాలు వేగంగా విస్తరిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో తయారవుతున్న అధునాతన బ్రహ్మోస్ క్షిపణులు శత్రు దేశాలకు వణుకు పుట్టిస్తున్నాయి. ఈ విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా చెప్పారు. గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్‌పో సెంటర్‌లో ఉత్తరప్రదేశ్ అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శన (యూపీఐటీఎస్) ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించిన అమిత్ షా.. యూపీ గడ్డపై తయారవుతున్న బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణులు పాకిస్తాన్‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయన్నారు. రాష్ట్రంలో మారుతున్న పారిశ్రామిక, భద్రతా వాతావరణానికి ఇది నిదర్శనంగా అభివర్ణించారు. అలాగే అమేథీలో తయారవుతున్న ఏకే-203 అసాల్ట్ రైఫిల్స్ ఉగ్రవాదులు, నక్సలైట్లకు సింహస్వప్నంగా మారాయన్నారు.

గతంలో యూపీలో నేరాలకు నిలయంగా ఉన్న పరిస్థితులు ఇప్పుడు పూర్తిగా మారిపోయాయన్న అమిత్ షా. ఒకప్పుడు నాటు తుపాకులు తయారైన చోట, ఇప్పుడు రక్షణ రంగ కారిడార్లు ఏర్పడి అత్యాధునిక ఆయుధాలు తయారవుతున్నాయన్నారు. ఝాన్సీ, లక్నో, కాన్పూర్, ఆగ్రా, అలీఘర్, చిత్రకూట్ వంటి ప్రాంతాల్లో డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్ నోడ్స్ శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయని అమిత్ షా పేర్కొన్నారు. దేశ రక్షణ ఉత్పత్తుల ఎగుమతులు గణనీయంగా పెరిగాయని, భారత రక్షణ రంగం అంతర్జాతీయంగా బలమైన శక్తిగా ఎదుగుతోందని చెప్పారు.
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచవ్యాప్తంగా తలెత్తిన సంక్షోభాలను తట్టుకుని నిలబడిందనీ, మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం ప్రారంభమై పుష్కరం పూర్తయిన సందర్భాన్ని గుర్తుచేస్తూ.. ఇండియా ఇప్పుడు అగ్రగామి ఆర్థిక వ్యవస్థల సరసన సగర్వంగా నిలిచిందన్నారు. ఒకప్పుడు ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లిన యూపీ యువత.. నేడు 'ఒక జిల్లా.. ఒక ఉత్పత్తి' (ఓడీఓపీ) వంటి వినూత్న పథకాల ద్వారా స్వరాష్ట్రంలోనే ఉపాధి పొందుతున్నదన్నారు.
శాంతిభద్రతల పరిరక్షణే పెట్టుబడులకు మొదటి మెట్టున్న అమిత్ షా.. రాష్ట్రంలో మెరుగైన శాంతిభద్రతల కారణంగానే నేడు భారీగా విదేశీ, స్వదేశీ పెట్టుబడులు తరలివస్తున్నాయని అన్నారు. రాబోయే రోజుల్లో భారత్ అన్ని రంగాల్లోనూ ప్రపంచంలోనే నంబర్‌వన్‌గా నిలవాలన్నదే ప్రధాని మోదీ లక్ష్యమని, ఆ సంకల్పాన్ని సాధించే దిశగా దేశం మునుపెన్నడూ లేనంత వేగంతో ముందుకు సాగుతోందని చెప్పారు.
[Amit Shah, BrahMos missiles, Uttar Pradesh, Pakistan, UPITS 2026, Pakisthan, Fear, MakeinIndia, Telugu One]


