TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఒకే ఒక్కడు: 560 కోట్ల విలువైన అమెరికా సైనిక విమానాన్ని ధ్వంసం చేశాడు..ఆయుధం ఏంటో తెలుసా.?!

Published on: Wed Nov 18, 2026 1:14PM

అమెరికా సైనిక రవాణా వ్యవస్థకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఈ దెబ్బ తీసినది ఒకే ఒక వ్యక్తి. ఇందుకు అతగాడు వాడిన ఆయుధం కేవలం ఒక గొడ్డలి. అంతే.. ఆ గొడ్డలితో అతగాడు అమెరికా వాయుసేనకు చెందిన సీ130 హెర్క్యులస్ విమానాన్ని ధ్వంసం చేశాడు. ఈ విమానం విలువ మన ఇండియన్ కరెన్సీలో అక్షరాలా 560 కోట్ల రూపాయలు. వివరాల్లోకి వెడితే..  ఐర్లాండ్‌లోని షానన్ విమానాశ్రయంలో పార్క్ చేసి ఈ అమెరికా సైనిక విమానాన్ని   డేవిడ్ కరన్ అలియాస్ దైతీ ఓ కొర్రైన్ అనే ఐరిష్ పౌరుడు గొడ్డలితో ధ్వంసం చేశాడు. ఈ మేరకు అతడిపై  అమెరికాలో   అభియోగాలు నమోదయ్యాయి.

నిందితుడు పక్కా ప్రణాళికతో ఎయిర్‌పోర్ట్ భద్రతా వలయాలను దాటుకుని ట్యాక్సీవేపై నిలిపి ఉంచిన విమానం వద్దకు చేరుకున్నాడు. విమానం వెనుక వైపు తలుపు తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించిన డేవిడ్ కరన్.. ఆ విమానంలోని కీలక విభాగాలను ధ్వంసం చేసేందుకు  కీలక భాగాలను దెబ్బతీసేందుకు తన వెంట తెచ్చుకున్న గొడ్డలి వంటి   పనిముట్లను ఉపయోగించాడు. కాక్‌పిట్‌లోని గేజ్‌లను పగులగొట్టి, వైర్ బండిల్స్, హైడ్రాలిక్,  ఆక్సిజన్ లైన్లు, ఎయిర్ డక్ట్‌లను కత్తిరించేశాడు. 

ఆ తరువాత.. అల్యూమినియంతో తయారైన విమాన బాడీని క్షణాల్లో తినేసే  గాలియం రసాయన ద్రవాన్ని, క్యాప్సూల్స్‌ను ఉపయోగించి విమాన కవచాన్ని పూర్తిగా ధ్వంసం చేశాడు. అక్కడితో ఆగకుండా,  ఇంధన ట్యాంక్ లాక్‌లను తెరిచి అందులో బాల్‌బేరింగ్స్‌ను జారవిడిచాడు. చివరికి విమానం పైకప్పు హాచ్‌ గుండా బయటకు వచ్చి పైభాగాన్ని కూడా  గొడ్డలితో  ధ్వంసం చేశాడు. 

సమాచారం అందుకున్న విమానాశ్రయ భద్రతా సిబ్బంది మరియు విమాన సిబ్బంది అక్కడికి చేరుకుని   నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడి తీవ్రత కారణంగా ఆ సైనిక విమానం మరమ్మతులకు కూడా నోచుకోని విధంగా ధ్వంసమైంది. ఇక పోతే   ఈ దాడికి పాల్పడే ముందు డేవిడ్ కరన్ ఇంటర్నెట్‌లో విమాన కంట్రోల్ సిస్టమ్స్, ఎయిర్‌పోర్ట్ భద్రతా విధానాలపై పరిశోధన చేసిన విషయం దర్యాప్తులో వెల్లడైంది.  

ఇది కూడా చదవండి: అమెరికాలో స్తంభించిన విమానయానం: మూడో రోజు వేలాది విమానాలు రద్దు.!

అమెరికా ప్రభుత్వ ఆస్తులను కావాలనే ధ్వంసం చేశారనే అభియోగం కింద న్యూయార్క్ గ్రాండ్ జ్యూరీ ఈ కేసును విచారిస్తోంది. ఈ నేరం రుజువయితే నిందితుడికి  పదేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని ఫెడరల్ ప్రాసిక్యూటర్లు చెబుతున్నారు. వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇలాంటి భారీ భద్రతా వైఫల్యం తలెత్తడం అటు అమెరికా, ఇటు ఐర్లాండ్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది.

ఈ ఘటన నేపథ్యంలో అంతర్జాతీయ విమానాశ్రయాల్లో విదేశీ సైనిక విమానాల భద్రతపై రక్షణ రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా నిఘా కట్టుదిట్టం చేయాలని విశ్లేషకులు అంటున్నారు. అదలా ఉంటే.. డేవిడ్ కరన్ ఈ దుశ్చర్యకు పాల్పడడానికి కారణమేంటన్నది తేలాల్సి ఉంది.  

మీకు నచ్చవచ్చు:  వియత్నాం కంటే ఇరాన్ యుద్ధమే అమెరికాకు పెద్ద పరాజయం?
మధ్యప్రాచ్యంలో మరో ఎప్పటికీ ముగియని యుద్ధం..ఇరాన్‌తో పోరులో అమెరికాకు అగ్నిపరీక్షే.!

[AmericaMilitaryAircraft, Destroyed, Irish National, ShannonAirport,  Security Breach, 560crores,  Property Damage, TeluguOne]