అమెరికా చరిత్రలో ఏమున్నది గర్వకారం: అగ్రరాజ్యం చరిత్ర మొత్తం బానిసత్వం, వలసల కన్నీటి గాథలే.!
Published on: Sat Oct 24, 2026 3:54PM

ప్రపంచాన్ని శాసిస్తున్న అగ్రరాజ్యం అమెరికా అంటే పారిశ్రామిక ప్రగతి, వ్యాపార సామర్థ్యాలు కాదు. దోపిడీలు, వివక్ష, వలసల కన్నీటి గాధలూ బానిసత్వ పోకడలూ కూడా. ఆ దేశ మూలాల్లో చారిత్రక దోపిడీలు, వివక్షా పూరిత విధానాలు దాగున్నాయి. తాజాగా అమెరికా రాజకీయ వాతావరణంలో చోటుచేసుకున్న పరిణామాలు, ఒక దేశాధినేత చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. విదేశాల నుంచి వచ్చే అగ్రశ్రేణి శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, వైద్యులు, సాంకేతిక దిగ్గజాలను ఎంతో ఆప్యాయంగా ఆహ్వానించే అమెరికా.. అదే సమయంలో వారి మాతృభూములను, సంస్కృతులను చులకన చేసి మాట్లాడటంలోని పరస్పర విరుద్ధ వైఖరిని మేధావులు తప్పుపడుతున్నారు. ఒకవైపు ప్రపంచ దేశాల నుంచి ప్రతిభను దోచుకుంటూ, మరోవైపు వారి మూలాలను కించపరిచేలా వ్యవహరించే అమెరికన్ రాజకీయ, సామాజిక ధోరణిపై ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది.
ఈ మొత్తం పరిణామాల నేపథ్యంలో, అసలు అమెరికా సంపద ఎలా రూపుదిద్దుకుంది? దాని వెనుక ఉన్న శ్రామిక వర్గాల పాత్ర ఏమిటి? అనే విషయాలపై పరిశీలకులు విశ్లేషణలు చేస్తున్నారు. అమెరికా ఇప్పుడు ఎంత శక్తిమంతమైన దేశమైనా, ఆ దేశ గతం అంతా మయని మరకలు, చెరిపివేయలేని మచ్చలేనని అంటున్నారు. అమెరికాకు వలస వచ్చిన వారి స్వదేశంలో పేదరికం, అసమానతలు, సంస్థాగత లోపాలు ఉన్న మాట వాస్తవమే అయినప్పటికీ, దానిని ఆసరాగా చేసుకుని విదేశీ నాగరికతలను కించపరిచే హక్కు ఏ దేశానికీ లేదన్న అభిప్రాయం బలంగా వ్యక్తమౌతోంది. వలసవాద శక్తులు, ఆర్థిక దోపిడీలు, అణగారిన వర్గాల చెమటోడ్చిన శ్రమ మీదనే ఇప్పుడు అమెరికా అగ్రరాజ్యంగా, ప్రపంచానికి పెద్దన్నగా పెత్తనం చేలాయించగలుగుతోందని గుర్తు చేస్తున్నారు.
అమెరికా చరిత్రను పరిశీలిస్తే దాని ప్రగతి కేవలం పెట్టుబడిదారీ స్వేచ్ఛా మార్కెట్ వల్ల మాత్రమే రాలేదు.. యూరోపియన్ వలసదారులు అడుగుపెట్టక ముందే వేల సంవత్సరాల పాటు అక్కడ నివసించిన స్థానిక ఆదివాసీలను నిర్వాసితులను చేయడం ద్వారానే ఆ భూభాగాలపై ఆధిపత్యం సంపాదించారు. ఆ తర్వాత ఆఫ్రికా ఖండం నుంచి లక్షలాది మందిని బలవంతంగా తరలించి వారిని బానిసలుగా మార్చారు. బానిసల శ్రమతోనే అమెరికా ప్లాంటేషన్ వ్యవసాయ రంగం విపరీతంగా అభివృద్ధి చెందింది. ఆ కాలంలో పేరుకుపోయిన బానిసత్వ సంపద క్రమంగా షిప్పింగ్, బీమా, ఆర్థిక రంగాలకు పాకి, నేటి భారీ కార్పొరేట్ సామ్రాజ్యాలకు పునాది అయింది.
స్వేచ్ఛను ప్రబోధించిన రాజ్యాంగం పుట్టిన దేశంలోనే దశాబ్దాల పాటు బానిసత్వం కొనసాగింది, సమానత్వాన్ని కొనియాడిన నేలమీదే వర్ణవివక్ష ఆధారిత వేర్పాటువాదం వేళ్లూనుకుంది. ఈ అంశాలు అమెరికన్ ప్రజాస్వామ్యంలోని వైరుధ్యాలకు నిలువెత్తు సాక్ష్యాలు. ప్రపంచానికి అంతర్జాతీయ నియమ నిబంధనలను బోధించే అగ్రరాజ్యం.. తన వ్యూహాత్మక ప్రయోజనాల కోసం అనేకసార్లు ఇతర సార్వభౌమ దేశాల హక్కులను కాలరాసిందన్న విమర్వలను ఇసుమంతైనా కొట్టి పారేయలేం.
.webp)
అమెరికా అమలు చేస్తున్న అంతర్జాతీయ వాణిజ్య విధానాలు, వలస చట్టాలు కేవలం ఆర్థిక అవకాశాల కల్పన కోసమే కాకుండా, ఇతర దేశాలపై భౌగోళిక రాజకీయ ఆధిపత్యం చెలాయించే సాధనాలుగా మారుతున్నాయన్న ఆరోపణలూ వెల్లువెత్తుతున్నాయి. సుంకాలు, మార్కెట్ ప్రవేశ నిబంధనలు, నియంత్రణలు, ఆంక్షల అస్త్రాలతో అగ్రరాజ్యం తన దేశీయ పరిశ్రమలను కాపాడుకుంటూనే, అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక వ్యవస్థలపై ఒత్తిడిని తెస్తోంది. ముఖ్యంగా వలస విధానాల విషయంలోనూ ఇదే విధమైన ద్వంద్వ ప్రమాణాలు కనిపిస్తున్నాయి. అమెరికన్ విశ్వవిద్యాలయాలు, బహుళజాతి సంస్థలు విదేశాల నుంచి నైపుణ్యం కలిగిన నిపుణులను ఆహ్వానిస్తున్నప్పటికీ, కఠినమైన వీసా నిబంధనలు, రాజకీయ అనిశ్చితి కారణంగా ఆ వలస కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
హెచ్ వీసా వ్యవస్థ అమెరికన్ కంపెనీలకు నిపుణులను రిక్రూట్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నప్పటికీ, ఉద్యోగుల భద్రతను మాత్రం పూర్తిగా యాజమాన్యాల దయాదాక్షిణ్యాలకు వదిలేస్తోంది. ఈ విధానాలన్నీ అంతర్జాతీయ వాణిజ్యాన్ని సంక్లిష్టంగా మారుస్తున్నాయి. బలహీనమైన దేశాలతో జరిగే చర్చల్లో అమెరికా తన ప్రయోజనాలకే పెద్దపీట వేయడం వల్ల గ్లోబల్ కామర్స్ అసమతుల్యతకు గురవుతోంది. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు వర్ధమాన దేశాలు కేవలం ఆందోళనలకే పరిమితం కాకుండా, తమ స్వదేశీ తయారీ రంగాన్ని బలోపేతం చేసుకోవడం, ఎగుమతులను వైవిధ్యభరితం చేసుకోవడం కీలకమని నిపుణులు అంటున్నారు.
అమెరికా అగ్రరాజ్యంగా కొనసాగడంలో ఆ దేశ సైనిక శక్తి, రక్షణ పరిశ్రమల పాత్ర కీలకం. ప్రపంచవ్యాప్తంగా వివిధ ఖండాలలో జరుగుతున్న ఘర్షణలలో అమెరికన్ బలగాలు లేదా వాటి మద్దతు ఉన్న రక్షణ సంస్థలే కీలక పాత్ర పోషిస్తున్నాయి. స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎస్ఐపీఆర్ఐ) నివేదికల ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా రక్షణ రంగంపై జరుగుతున్న ఖర్చులో సింహభాగం అమెరికాదే. జాతీయ భద్రత పేరుతో భారీ ఎత్తున ఆయుధాలను విక్రయించడం, యుద్ధ వాతావరణాన్ని ప్రోత్సహించడం ద్వారా కొన్ని కార్పొరేట్ శక్తులు లాభాలను ఆర్జిస్తున్నాయనే ఆరోపణలు బలంగా ఉన్నాయి.
భద్రతాపరమైన ఆందోళనలను సరిదిద్దడం ఒకెత్తు అయితే, శాంతి స్థాపనే లక్ష్యంగా ఉండాల్సిన చోట యుద్ధాలను ఒక లాభదాయక వ్యాపార మార్కెట్‌గా మార్చడం మానవాళికి పెను ముప్పుగా పరిణమించింది. ఆయుధ బదిలీలు కొన్ని సందర్భాల్లో ఉద్రిక్తతలను తగ్గించినప్పటికీ, మరికొన్నిసార్లు సంఘర్షణలను మరింత దీర్ఘకాలికంగా మార్చి అమాయక ప్రాణాల నష్టానికి కారణమవుతున్నాయి. రక్షణ రంగాన్ని కేవలం వాణిజ్య ప్రయోజనాల కోసమే కాకుండా, అంతర్జాతీయ చట్టాలు, దౌత్యపరమైన పరిష్కారాల ద్వారా నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ అధిపతి సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ బాస్ సత్య నాదెళ్ల, అడోబ్ సీఈవో శాంతను నారాయణ్, ఐబీఎం అధిపతి అరవింద్ కృష్ణ, ఫెడెక్స్ రాజ్ సుబ్రమణియన్, పాలో ఆల్టో నెట్వర్క్స్ నికేష్ అరోడా, యూట్యూబ్ అధిపతి నీల్ మోహన్ వంటి ఎంతోమంది భారత నిపుణులు ప్రముఖ అమెరికన్ కార్పొరేట్ సంస్థల ఉన్నత స్థానాలను అలంకరించారు. ఈ దిగ్గజాల విజయాల వెనుక వారి వ్యక్తిగత ప్రతిభ, కుటుంబాల త్యాగాలు, అంకితభావం ఉన్నాయి. అమెరికాలో అందిన వాతావరణం వారికి ఎదిగేందుకు తోడ్పడినప్పటికీ, వారి ప్రాథమిక విద్యాభ్యాసానికి, సంస్కృతికి మూలమైన భారత్ దేశ పాత్రను ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించలేము.
అయితే, విదేశాల్లో అత్యున్నత స్థాయికి చేరిన ఈ ప్రవాస భారతీయులు తమ మాతృభూమి అభివృద్ధికి ఏ విధంగా తోడ్పడుతున్నారు అనే చర్చ తరచూ జరుగుతుంటుంది. కోట్లాది రూపాయల విదేశీ మారకద్రవ్యాన్ని పంపడం ద్వారా వీరు దేశ ఆర్థిక వ్యవస్థకు ఆసరాగా నిలుస్తున్నప్పటికీ, దానిని కేవలం ధర్మసహాయంగా చూడలేము. కార్పొరేట్ సంస్థల నియమ నిబంధనలకు లోబడి పనిచేసే ఈ అగ్రశ్రేణి నాయకులు, భారతదేశంలో పబ్లిక్ ఎడ్యుకేషన్, శాస్త్రీయ పరిశోధనలు, నాణ్యమైన ఆరోగ్య సేవలు, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం మరింతగా భాగస్వాములు కావాల్సిన ఆవశ్యకత ఉంది. అందరూ తిరిగి స్వదేశానికి రావాలని కోరడం సాధ్యం కాకపోయినా, వారి మేధస్సును, అనుభవాన్ని జాతీయ పునర్నిర్మాణానికి ఉపయోగించేలా మార్గాలను అన్వేషించాలి.
అమెరికా కేవలం సైనిక బలంతో మాత్రమే కాకుండా, డాలర్ ఆధిపత్యం, ఫైనాన్షియల్ మార్కెట్లు, టెక్నాలజీ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ప్రపంచంపై పట్టు బిగిస్తోంది. అంతర్జాతీయ లావాదేవీలలో డాలర్ ప్రధాన పాత్ర పోషించడం వల్ల వాషింగ్టన్ ఏకపక్షంగా ఆర్థిక ఆంక్షలను విధించే శక్తిని పొందుతోంది.
ఇండియా లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు అమెరికన్ ఆవిష్కరణలతో భాగస్వామ్యం పంచుకుంటూనే, తమ సొంత వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిని కాపాడుకోవడం ముఖ్యం. సెమికండక్టర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, దేశీయ పరిశోధనలు, అధునిక తయారీ రంగాలలో భారత్ స్వయంసమృద్ధి సాధించినప్పుడే నిజమైన సాంకేతిక అభివృద్ధి సాధ్యమవుతుంది. దేశంలోని ప్రతిభావంతులు సరైన అవకాశాలు లేక విదేశాలకు వలస వెళ్లే బ్రెయిన్ డ్రైన్' సమస్యకు శాశ్వత పరిష్కారం లభించాలంటే, ఇక్కడే అంతర్జాతీయ స్థాయి పరిశోధనా సౌకర్యాలు, వృత్తిపరమైన స్వేచ్ఛను కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది.
ఇండియన్ అమెరికన్లు వ్యాపార, శాస్త్ర, వైద్య, సాంకేతిక రంగాలలో అత్యున్నత స్థానాల్లో రాణిస్తున్నప్పటికీ, సమాజంలో వర్ణవివక్షా ధోరణులు పూర్తిగా తొలగిపోయాయని చెప్పలేం. చైనా వలసదారుల బహిష్కరణలు, రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జపనీస్ అమెరికన్ల నిర్బంధాలు, ఆఫ్రికన్ అమెరికన్లపై జరిగిన దశాబ్దాల అణచివేత అమెరికన్ చరిత్రలో చీకటి అధ్యాయాలుగా నిలిచాయి. ఇప్పటికీ వలసదారులపై కొన్ని వర్గాల నుంచి వ్యక్తమవుతున్న వ్యతిరేకత, వారి పట్ల చూపే వివక్ష సమాజంలో అంతర్గతంగా ఉన్న అసమానతలను బయటపెడుతోంది. విదేశీ నిపుణుల సేవలను అభినందిస్తూనే, వారి స్వదేశాలను చులకన చేసే ద్వంద్వ వైఖరి మారాలని మేధావులు అభిప్రాయపడుతున్నారు.
[America History And Indian Expatriate Intellectuals, American Hegemony, Immigration American History, Immigration Policies, H1B Visa Policies,Telugu One]


