టెక్ దిగ్గజాలకు ట్రంప్ షాక్: గ్రీన్ కార్డు దరఖాస్తుల నిలిపివేత.. అనిశ్చితిలో టెక్కీల భవిష్యత్.!
Published on: Fri Oct 9, 2026 10:28AM

అమెరికాలో ఉద్యోగం చేయాలని కలలు కనే వేలాది మంది విదేశీ నిపుణులకు, ముఖ్యంగా టెక్కీలకు ట్రంప్ సర్కార్ షాక్ ఇచ్చింది. ప్రముఖ టెక్ దిగ్గజాలు మైక్రోసాఫ్ట్, అడోబ్, ఇన్ఫోసిస్), టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), విప్రో, కాగ్నిజెంట్), హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, క్యాప్‌జెమినీ సహా మొత్తం ఎనిమిది దిగ్గజ కంపెనీలకు సంబంధించిన గ్రీన్ కార్డ్ దరఖాస్తులను నిలిపివేసింది. ఈ నిలిపివేతకు నిర్దుష్ట కాల వ్యవధిని పేర్కొనకపోవడంతో.. వేలాది మంది టెక్కీల భవిష్యత్ గందరగోళంలో పడింది.
అమెరికా లేబర్ సెక్రటరీ కీత్ సోండర్‌లింగ్ ఈ నిలిపివేత నిర్ణయాన్ని ప్రకటించారు. ఆయన ప్రకటన మేరకు శాశ్వత కార్మిక ధృవీకరణ కార్యక్రమం (పీఈఆర్ఎమ్) కింద ఈ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. విదేశీ ఉద్యోగులను శాశ్వత ప్రాతిపదికన నియమించుకోవడానికి కంపెనీలు ఉపయోగించే పీఈఆర్ఎమ్ ప్రక్రియను పూర్తిగా నిలిపివేస్తుశారు. ఈ ఎనిమిది సంస్థలపై ఫెడరల్ దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలోనే ఈ చర్యలు తీసుకున్నారు. ఇమ్మిగ్రేషన్ నిబంధనల దుర్వినియోగం,అమెరికన్ ఉద్యోగులకు నష్టం కలిగించే పద్ధతులపై విచారణ ఇందుకు కారణం. అదలా ఉంచితే ఈ తాజా ఆంక్షల కారణంగా ఈ కంపెనీలలో కొత్తగా సమర్పించే దరఖాస్తులతో పాటు, ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న పీఈఆర్‌ఎం దరఖాస్తుల ప్రక్రియ కూడా పూర్తిగా నిలిచిపోయింది.
అమెరికాలో హెచ్-1బి వీసాలపై పనిచేస్తూ శాశ్వత నివాసం కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది ఉద్యోగులపై ఈ నిర్ణయం ప్రభావం తీవ్రంగా ఉంటుంది. అయితే, ఈ సస్పెన్షన్ కేవలం గ్రీన్ కార్డ్ లేబర్ సర్టిఫికేషన్ ప్రక్రియకు మాత్రమే వర్తిస్తుందని, ప్రస్తుతానికి ఉద్యోగుల H-1B వీసాలపై దీని ప్రభావం ఉండదని అధికారులు చెబుతున్నప్పటికీ, గ్రీన్ కార్డ్ కోసం ఏళ్ల తరబడి క్యూలో ఉన్న భారతీయ టెక్కీల పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా మారింది. ఈ విషయంపై అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్.. గత ఏడాది మైక్రోసాఫ్ట్ సంస్థ ఆరువేల మంది అమెరికన్ ఉద్యోగులను తొలగించి, అదే సమయంలో 6 వేల 300 హెచ్1బి తాత్కాలిక వీసాలు, 3 వేల గ్రీన్ కార్డ్‌ల ప్రయోజనం పొందిందన్నారు.

ఇలా వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్న కంపెనీలపై కఠినంగా వ్యవహరిస్తామన్న ఆయన.. ఈ విషయంలో సమగ్ర దర్యాప్తునకు మాత్రమే సస్పెన్షన్ వేటు వేశామని వివరణ ఇచ్చారు. అయితే దర్యాప్తు ఎంత కాలం కొనసాగుతుంది, ఆంక్షల ఎత్తివేతకు గడువు ఏమిటి? అన్న విషయాలను ట్రంప్ సర్కార్ వెల్లడించలేదు. దీంతో ఈ ఆంక్షలు సుదీర్ఘ కాలం కొనసాగే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. అదే జరిగితే.. అమెరికాలో శాశ్వత నివాస కలలు కంటున్న విదేశీ టెక్ నిపుణుల ఆశలు అడియాశలు అవుతాయన్న ఆందోళన వ్యక్తమౌతోంది.
[America Green Card Freeze,President Donald Trump, Microsoft Green Card, Infosys TCS, Wipro, PERM suspension, US Tech Workers, Telugu One]


