విచారణకు రండి: అంబటికి ఈడీ నోటీసులు.. ఆరోగ్యం కుదుటపడ్డాకా వస్తానన్న మాజీ మంత్రి.!
Published on: Thu Sep 24, 2026 5:24PM

ఆంధ్రప్రదేశ్ మద్యం రవాణా కుంభకోణం కేసులో వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. శుక్రవార ఉదయం పదిన్నర గంటలకు హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఆ నోటీసులలో పేర్కొంది.
కాగా ఈడీ నోటీసులపై స్పందించిన అంబటి రాంబాబు.. 15 రోజుల క్రితమే గుండెకు స్టంట్లు వేయించుకున్నానని, వైద్యుల సూచన మేరకు విశ్రాంతి తీసుకుంటూ కోలుకుంటున్నానన్నారు. పూర్తిగా కోలుకున్న తర్వాత ఈడీ అధికారులకు ముందుగా సమాచారం ఇచ్చి విచారణకు హాజరవుతానని, విచారణకు పూర్తిగా సహకరిస్తానని తెలిపారు. అయితే అంబటి రాంబాబు వివరణపై ఈడీ అధికారుల స్పందన ఏంటన్నది తెలియాల్సి ఉంది.
వైసీపీ హయాంలో ప్రభుత్వ మద్యం దుకాణాలకు సంబంధించి లిక్కర్ రవాణా కాంట్రాక్టులను సిగ్మా, ప్రసాద్ ట్రాన్స్‌పోర్ట్ సంస్థలకు కట్టబెట్టడంలో జరిగిన అవకతవకలపై ఈడీ దర్యాప్తులో ప్రభుత్వ ఖజానాకు రూ 195 కోట్ల రూపాయలకు పైగా నష్టం వాటిల్లినట్లు తేలింది.

ఈ కేసుకు సంబంధించి సబ్‌కాంట్రాక్టులు, నిధుల మళ్లింపుతో అంబటి రాంబాబుకు ప్రమేయంపై ప్రశ్నించేందుకు ఈడీ అధికారులు అంబటికి నోటీసులు జారీ చేశారు. ఇదే కేసులో బుధవారం మర్రి సుబ్బారెడ్డి, పురుషోత్తమరావుల వాంగ్మూలాలను ఈడీ బుధవారం (సెప్టెంబర్ 23) నమోదు చేసింది.
[Ambati Rambabu, ED Notices, AP Liquor Transport Scam, YSRCP Leader, Enforcement Directorate, Ambati, Health, Telugu One]


