మద్యం కుంభకోణం కేసులో అంబటి అరెస్టు తప్పదా?
Published on: Sat Sep 19, 2026 3:48PM

మద్యం కుంభకోణం కేసులో వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్టు తప్పదా అన్న చర్చ ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో ఓ రేంజ్ లో జరుగుతోంది. ఈ కేసులో అంబటి రాంబాబు చుట్టూ ఇప్పుడు ఉచ్చు బిగుసుకుంటోందని అంటున్నారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఏపీ మద్యం రవాణా టెండర్ల కుంభకోణం కేసు దర్యాప్తును ముమ్మరం చేసిన ఈడీ తాజాగా అంబటి రాంబాబుకు నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయంలో ఈ నెల 22న విచారణకు హాజరుకావాల్సిందిగా ఆ నోటీసుల్లో పేర్కొంది.

మద్యం టెండర్ల కుంభకోణానికి సంబంధించి గతంలోనే ఏపీఎస్‌బీసీఎల్ కేంద్రీకృత టెండర్ల కేటాయింపులపై ఈడీ తీవ్ర ఆరా తీసింది. గత ప్రభుత్వ హయాంలో అక్టోబర్ 10, 2020న ఫ్లోట్ చేసిన ఈ టెండర్లలో భారీ అవకతవకలు జరిగాయని ఈడీ దర్యాప్తులో తేలింది. డిపోల నుంచి ప్రభుత్వ రిటైల్ దుకాణాలకు మద్యం రవాణా చేసే ఈ ప్రక్రియలో ఢిల్లీకి చెందిన సిగ్మా సప్లై చైన్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కిలోమీటరుకు రూ. 33 చొప్పున తొలి ఏడాది విలువ దాదాపు రూ. 73 కోట్ల టెండర్‌ను దక్కించుకున్నట్లు ఈడీ గుర్తించింది. అయితే, ఈ సిగ్మా సంస్థ కేవలం నామమాత్రపు పాత్ర మాత్రమే పోషించి, సుమారు 4 శాతం ఆదాయాన్ని మాత్రమే ఉంచుకుని, మిగతా మొత్తాన్ని ఒక సిండికేట్‌కు మళ్లించిందని దర్యాప్తులో వెల్లడైంది.
ఈ సిండికేట్ ద్వారా సబ్‌కాంట్రాక్ట్‌లను తక్కువ రేట్లకు ప్రసాద్ ట్రాన్స్‌పోర్ట్స్ వంటి పలు సంస్థలకు కట్టబెట్టి భారీగా అక్రమ మార్జిన్లు ఆర్జించారనేది ఈడీ ప్రధాన అభియోగం. ఈ క్రమంలోనే అప్పట్లో సివిల్ సప్లైస్ మంత్రిగా పనిచేసిన కారుమూరి వెంకట నాగేశ్వరరావు, ఆయన కుమారుడు సునీల్ కుమార్ తమ రాజకీయ ప్రభావాన్ని ఉపయోగించి సబ్‌కాంట్రాక్ట్‌లు ఇప్పించారని, దీనివల్ల కారుమూరి వర్గానికి సుమారు రూ. 15 కోట్ల లబ్ధి చేకూరిందని ఆరోపణలు వచ్చాయి. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కారుమూరి నాగేశ్వరరావు, సునీల్ కుమార్‌తో పాటు సిండికేట్ హెడ్ కాసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, మాజీ ఎండీ దొంతిరెడ్డి వాసుదేవ రెడ్డిలను ఈడీ వేర్వేరు ఆపరేషన్లలో అరెస్ట్ చేయడం తెలిసిందే.
ఇప్పుడు ఇదే దర్యాప్తు మాజీ మంత్రి అంబటి రాంబాబు వరకు పాకింది. నిందితులకు, రవాణా సబ్‌కాంట్రాక్టర్లకు మధ్య కుదిరిన ఒప్పందాలు, ఆర్థిక లావాదేవీలలో అంబటి రాంబాబు పాత్ర ఉందన్న అనుమానాలతోనే ఈడీ ఈ సమన్లు జారీ చేసిందని తెలుస్తోంది. సబ్‌కాంట్రాక్ట్‌లు పొందిన వారికి ఈయన ఏ విధంగా సహకరించారనే కోణంలో సెప్టెంబర్ 22న జరిగే విచారణలో ఈడీ అధికారులు ప్రశ్నించే అవకాశం ఉంది. మరోవైపు.. ఈ పరిణామాలపై అంబటి రాంబాబు తనదైన శైలిలో స్పందిస్తూ రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే ఇదంతా జరుగుతోందని విమర్శలు గుప్పిస్తున్నారు. ఏదేమైనప్పటికీ, వరుస అరెస్టులు, ఈడీ దూకుడుతో వైసీపీ శిబిరంలో టెన్షన్ వాతావరణం నెలకొంది.
[Ambati Rambabu, ED Notices, AP Liquor Scam, Enforcement Directorate, YCP Leaders, Liquor Tender Case, Telugu One]


