TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఈ ఫుడ్స్ ను ఈ కాంబినేషన్ లో తింటే ఎంత బెనిఫిట్ తెలుసా.!

Published on: Wed Nov 11, 2026 3:41PM

మనం రోజూ తినే ఆహారంలో కొన్ని కాంబినేషన్స్ ట్రై చేస్తుంటాం. కానీ ఏ ఆహార పదార్థాన్ని వేటితో కలిపి తింటే మన శరీరానికి ఎక్కువ పోషకాలు అందుతాయనే విషయం మీద చాలామందికి స్పష్టత ఉండదు. మనం తినే వాటిలో కొన్ని కాంబినేషన్ లు ఆరోగ్యానికి అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి. అలాంటి కొన్ని అరుదైన , అత్యంత ప్రయోజనకరమైన ఫుడ్  కాంబినేషన్ లు ఏవో.. వాటిని తినడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటో  గురించి  వివరంగా తెలుసుకుంటే..

పుచ్చకాయ.. ఉప్పు..

​మనలో చాలా మందికి పుచ్చకాయ అనగానే గుర్తుకు వచ్చేది కేవలం తియ్యటి రుచి మాత్రమే. అయితే పుచ్చకాయ ముక్కల మీద కొద్దిగా ఉప్పు చల్లుకొని తింటే దాని రుచితో పాటు ఆరోగ్య ప్రయోజనాలు కూడా రెట్టింపు అవుతాయి. పుచ్చకాయలో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. అలాగే ఉప్పులో సోడియం లభిస్తుంది. ఈ రెండు కలిసి శరీరంలో ఎలక్ట్రోలైట్స్ సమతుల్యంగా ఉండేలా చూస్తాయి. ముఖ్యంగా ఎండకాలంలో లేదా వర్కవుట్లు చేసిన తర్వాత ఈ కాంబినేషన్ శరీరాన్ని తక్షణ శక్తితో పాటు హైడ్రేట్ గా ఉంచడానికి చాలా బాగా సహాయపడుతుంది.

బాదం..డార్క్ చాక్లెట్..

​బాదం పప్పులను డార్క్ చాక్లెట్ తో కలిపి తీసుకోవడం మరొక మంచి అలవాటు. బాదం పప్పులో శరీరానికి అవసరమైన ఆరోగ్యకరమైన కొవ్వులు , విటమిన్ ఈ లభిస్తాయి. అలాగే డార్క్ చాక్లెట్లో యాంటీ ఆక్సిడెంట్స్ గుణాలు ఎక్కువగా ఉండే ఫ్లావనాయిడ్స్ ఉంటాయి. ఈ రెండింటి కలయిక శరీరంలో యాంటీ ఆక్సిడెంట్స్ శక్తిని గణనీయంగా పెంచుతుంది. ఇది గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది , గుండె సంబంధిత సమస్యలు రాకుండా రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

ఓట్స్.. పెరుగు..

​ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ లో ఓట్స్ తినడం చాలా మందికి అలవాటు. అయితే ఈ ఓట్స్ ను పెరుగుతో కలిపి తీసుకోవడం ద్వారా జీర్ణ వ్యవస్థకు అద్భుతమైన లాభాలు కలుగుతాయి. ఓట్స్ లో ప్రీబయోటిక్స్ ఉంటాయి. అలాగే పెరుగులో మంచి బ్యాక్టీరియాను అందించే ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఈ రెండు కలిసి కడుపులోని జీర్ణక్రియను మెరుగుపరచడంలో , గట్ హెల్త్ ని ఆరోగ్యంగా ఉంచడంలో అద్భుతంగా పనిచేస్తాయి. పొట్టకు సంబంధించిన సమస్యలు ఉన్నవారికి ఈ ఆహార కాంబినేషన్ మంచి ఫలితాన్ని ఇస్తుంది.

ఇది కూడా చదవండి మీకు తెలుసా ..ఈ విటమిన్లు లోపిస్తే లివర్ దెబ్బతింటుంది..!

గ్రీన్ టీ.. నిమ్మరసం..

​బరువు తగ్గాలనుకునేవారు లేదా ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టేవారు గ్రీన్ టీ తాగడం సాధారణం. అయితే గ్రీన్ టీ లో కొద్దిగా నిమ్మరసం పిండుకొని తాగితే దాని ప్రయోజనాలు పూర్తిగా శరీరానికి అందుతాయి. నిమ్మకాయలో ఉండే విటమిన్ సి గ్రీన్ టీ లోని యాంటీ ఆక్సిడెంట్లను శరీరం వేగంగా గ్రహించేలా సహాయపడుతుంది. సాధారణంగా గ్రీన్ టీ తాగడం వల్ల అందే పోషకాలు నిమ్మకాయ కలవడం వల్ల మరింత మెరుగ్గా పనిచేస్తాయి.

పసుపు పాలు.. మిరియాల పొడి..

​మన ఇంట్లో తరచూ చేసుకునే పాలలో చిటికెడు పసుపు వేసుకొని తాగడం మన సాంప్రదాయం. అయితే ఈ పసుపు పాలలో చిటికెడు మిరియాల పొడి కూడా కలిపితే ఫలితం మరింత ఎక్కువగా ఉంటుంది. మిరియాలలో పైపరిన్ అనే గుణం ఉంటుంది. ఇది పసుపులోని కర్క్యుమిన్ అనే మూలకాన్ని శరీరం త్వరగా , పూర్తిగా గ్రహించడానికి సహాయపడుతుంది. దీనివల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరగడంతో పాటు ఎముకల నొప్పులు , ఇతర ఆరోగ్య సమస్యల నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది.

​ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి మనం తినే ఆహారంలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే సరిపోతుంది. ఏ ఆహారాన్ని ఏ పదార్థంతో కలిపి తినాలో తెలుసుకొని పాటిస్తే శరీరం ఆరోగ్యంగా ఉండటంతో పాటు రోగాల బారిన పడకుండా కాపాడుకోవచ్చు. ఈ అద్భుతమైన ఆహార కాంబినేషన్  లను  దైనందిన జీవితంలో భాగం చేసుకొని పూర్తి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోండి.

                                                                                                                                                  *రూపశ్రీ.

 

మీకు నచ్చవచ్చు    ఇలా చేస్తే చాలు... పిల్లలు ఫోన్ పక్కన పెట్టి పుస్తకాలంటే ఇష్టపడతారు..!

                               

​