అమరావతి ఒఆర్ఆర్: నాలుగు ప్యాకేజీలుగా నిర్మాణం.. 13 వేల 92 కోట్ల అంచనా వ్యయం.!
Published on: Mon Oct 5, 2026 12:48PM

అమరావతికి మహర్ధశ పట్టే దిశగా రవాణా రంగంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాజధాని చుట్టూ ఆరు వరుసల ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఏపీ సర్కార్ భారీ అంచనా వ్యయంతో టెండర్ల ప్రక్రియను అధికారికంగా ప్రారంభించింది. 189.93 కీలోమీటర్ల పొడవున నిర్మితం కానున్న ఈ అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు అంచనా వ్యయం 13 వేల కోట్ల 91 లక్షల 75 వేల రూపాయలు. ఈ ప్రాజెక్టును డీబీవోటీ, హైబ్రిడ్ యాన్యుటీ విధానాల ద్వార నాలుగు ప్యాకేజీలుగా విభజించి పనులను సత్వరం పూర్తి చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఈ టెండర్ల దాఖలు చేయడానికి వచ్చే నెల 18 తుది గడువుగా నిర్ణయించారు. అనంతరం టెండర్లను ఆ మరుసటి రోజు అంటే నవంబర్19న తెరవనున్నారు.
ఇక నాలుగు ప్యాకేజీల వివరాలను పరిశీలిస్తే.. మొదటి ప్యాకేజీ కింద కంచికచర్ల నుంచి మైలవరం వరకు మరీ స్పష్టంగా చెప్పాలంటే.. విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారి వద్ద జీరో కిలోమీటర్ల నుంచి 27వ కి.మీ. వరకు నిర్మిస్తారు. కొండపల్లి, పంగిడి అటవీ ప్రాంతాల గుండా సాగే ఈ మార్గంలో 2.68 కి.మీ., 1.64 కి.మీ. చొప్పున రెండు భారీ సొరంగాలు ఉంటాయి. ఇక రెండో ప్యాకేజీ కింద 27వ కి.మీ. నుంచి కృష్ణా జిల్లా కంకిపాడు మండలం కోలవెన్ను వరకూ అంటే 83వ కిలోమీటర్ వరకు హైవేను విస్తరిస్తారు. రాజధాని పరిధిలో వేగవంతమైన రవాణాకు ఈ మార్గం కీలకం కానుంది.
.webp)
అలాగే మూడో ప్యాకేజీలో భాగంగా 83వ కిలోమీటర్ నుంచి. నుంచి గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం పుల్లడిగుంట అంటే 133.5వ కిలోమీటర్) వరకు పనులు చేపట్టనున్నారు. ఇందులో 50.5 కి.మీ. ప్రధాన ఓఆర్‌ఆర్‌తో పాటు నారాకోడూరు నుంచి బుడంపాడు వరకు 5.2 కి.మీ. మేర నాలుగు వరుసల బైపాస్ అనుసంధాన రహదారిని నిర్మిస్తారు. అలాగే.. వల్లూరుపాలెం వద్ద కృష్ణా నదిపై 4.8 కి.మీ. పొడవైన భారీ వంతెనను కూడా ఈ ప్యాకేజీలో భాగంగానే నిర్మిస్తారు. ఇక నాలుగో ప్యాకేజీ 133.5వ కి.మీ. నుంచి 189వ కి.మీ. (మొత్తం 55.5 కి.మీ.) వరకు సాగుతుంది. ఈ మార్గంలో పేరేచర్ల వద్ద 400 మీటర్ల సొరంగం, మున్నలూరు వద్ద కృష్ణా నదిపై 3.15 కి.మీ. పొడవున భారీ వంతెన నిర్మిస్తారు.
.webp)
ఈ మొత్తం ప్రాజెక్టు ద్వారా 189.93 కిలోమీటర్ల ప్రధాన రహదారితో పాటు అదనపు అనుసంధాన మార్గాన్ని కలుపుకుని మొత్తం 195.13 కి.మీ. మేర మార్గం రూపుదిద్దుకోనుంది. ప్రాజెక్టు మొత్తానికి అంచనా వేసిన వ్యయం రూ.30,491 కోట్లలో సివిల్ పనుల కోసమే నాలుగు ప్యాకేజీలలో 10 కోట్ల 595 లక్షల70 వేల రూపాయలు వ్యయం అవుతుందన్నది అంచనా.
ఈ గ్రీన్‌ఫీల్డ్ హైవే ప్రాజెక్టు పూర్తయితే అమరావతి రాజధాని నగరానికి జాతీయ స్థాయి రవాణా అనుసంధానం ఏర్పడుతుంది. చుట్టుపక్కల జిల్లాల నుంచి రాకపోకలు సాగించే వాహనదారులకు ట్రాఫిక్ ఇబ్బందులు పూర్తిగా తొలగిపోనున్నాయి. అత్యంత క్లిష్టమైన భౌగోళిక పరిస్థితులను అధిగమిస్తూ నిర్మించనున్న ఈ రింగ్ రోడ్డు, భవిష్యత్తులో పారిశ్రామిక మరియు ఆర్థికాభివృద్ధికి ప్రధాన చోదక శక్తిగా మారుతుందని నిపుణులు భావిస్తున్నారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ టెండర్ల ప్రక్రియ విజయవంతంగా ముగిస్తే, త్వరలోనే క్షేత్రస్థాయిలో పనులు ఊపందుకోనున్నాయి. రాబోయే కాలంలో రాజధాని ప్రాంత రూపురేఖలను మార్చివేసే ఈ మహానగర రింగ్ రోడ్డు నిర్మాణంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
[Amaravati Outer Ring Road, Amaravati ORR Tenders, Greenfield Highway, Amaravati Greenfield Highway, AP Capital Amarawati, Road connectivity, Telugu One]


