TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అమరావతి ఓఆర్ఆర్: 17 ఇంటటర్ చేంజ్ లు.. ప్యాకేజీల వారీగా టెండర్లకు ఆహ్వానం.!

Published on: Mon Oct 5, 2026 10:02AM

ఆంధ్రప్రదేశ్  రాజధాని అమరావతి ప్రాంతంలో రవాణా వ్యవస్థను పూర్తిగా మార్చివేసే లక్ష్యంతో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన ఔటర్ రింగ్ రోడ్డు  నిర్మాణ పనులు  వేగంగా ముందుకుసాగుతున్నాయి. ఈ మెగా ప్రాజెక్టులో భాగంగా చేపట్టాల్సిన ఇంటర్‌ఛేంజ్‌ల సంఖ్యను అధికారులు తాజాగా సవరించారు. రవాణా రంగ నిపుణుల అంచనాలు,  డిజైన్ పరమైన మార్పుల నేపథ్యంలో, ఈ ఔటర్ రింగ్ రోడ్డుపై మొత్తం 17  ప్రాంతాల్లో  ఎంటర్, ఎగ్జిట్ వేలు  (ఇంటర్‌ఛేంజ్‌లు) ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనిద్వారా రాజధాని చుట్టూ ఉన్న ప్రధాన నగరాలు, పట్టణాలకు రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి.

 

మొత్తం 189.93 కిలోమీటర్ల పొడవుతో రూపొందుతున్న  అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు  అత్యున్నత ప్రమాణాలతో ఆరు వరుసల యాక్సెస్ కంట్రోల్డ్ రహదారిగా నిర్మిస్తున్న సంగతి విదితమే. గతంలో ప్రతిపాదించిన  అనుసంధాన రహదారుల డిజైన్లలో మార్పులు చేయడం వల్ల, ప్రాజెక్టు వ్యయం    30 వేల 491 కోట్లకు సర్దుబాటైంది. అదే సమయంలో మార్పులకు అనుగుణంగా ఇంటర్‌ఛేంజ్‌‌ల సంఖ్యను 17కి పరిమితం చేశారు. ఈ రహదారి నిర్మాణం వల్ల రాజధాని ప్రాంతం మీదుగా వెళ్లే సుదూర వాహనాలకు ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా నేరుగా గమ్యస్థానాలకు చేరుకునే అవకాశం లభిస్తుంది.

ఈ ప్రాజెక్టు మాస్టర్ ప్లాన్ ప్రకారం, ఓఆర్‌ఆర్‌ మార్గంలో నిర్మించనున్న 17 ఇంటర్‌ఛేంజ్‌లు ప్రధాన జాతీయ, రాష్ట్ర రహదారులను క్రాస్ చేసే ప్రాంతాల్లో  వస్తున్నాయి. ఉదాహరణకు, కంచికచర్ల వద్ద విజయవాడ, హైదరాబాద్ హైవేపై డబుల్ ట్రంపెట్ ఇంటర్‌‌ఛేంజ్‌ను ప్లాన్ చేయగా, మరికొన్ని ప్రాంతాల్లో రోటరీ ,  సింగిల్ ట్రంపెట్ రకాల ఇంటర్‌ఛేంజ్‌లను ఏర్పాటు చేయనున్నారు. పొన్నవరం, దుగ్గిరాలపాడు, మైలవరం, ఆగిరిపల్లి, పొట్టిపాడు, పుల్లడిగుంట, మేడికొండూరు తదితర ప్రాంతాలు ఈ ఇంటర్‌ఛేంజ్‌ల జాబితాలో  ఉన్నాయి. ఇవి వివిధ జిల్లాల నుంచి వచ్చే రద్దీని క్రమబద్ధీకరించడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి.

అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు  నిర్మాణంలో భాగంగా కృష్ణా నదిపై రెండు  వంతెనల నిర్మాణం అంతర్భాగంగా ఉంది. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఎన్ హెచ్ ఏఐ ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే కీ  ప్యాకేజీలవారీగా టెండర్లను ఆహ్వానించింది. హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ (హెచ్ఏఎమ్) పద్ధతిలో పనులను పూర్తి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. కేవలం రోడ్డు నిర్మాణం మాత్రమే కాకుండా, భవిష్యత్తులో రవాణా రద్దీ త పెరిగినా తట్టుకునేలా  ఇంజనీరింగ్ ప్రమాణాలను ఈ డిజైన్లలో పొందుపరిచారు.

అమరావతి, విజయవాడ, గుంటూరు, తెనాలి తదితర నగరాల పరిధిని కలుపుతూ సాగే ఈ ఔటర్ రింగ్ రోడ్డు కేవలం ఒక రహదారి మాత్రమే కాకుండా, భవిష్యత్తు ఆర్థికాభివృద్ధికి ప్రధాన ధమనిగా మారుతుందని నిపుణులు భావిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాదాలతో తయారవుతున్న ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే, మచిలీపట్నం మరియు కృష్ణపట్నం వంటి ఓడరేవులకు, అంతర్గత పారిశ్రామిక కేంద్రాలకు మధ్య సరుకు రవాణా సమయం గణనీయంగా తగ్గిపోతుంది. దీనివల్ల రాష్ట్రంలో లాజిస్టిక్స్ రంగం పురోగతి సాధించడమే కాకుండా, స్థానికంగా ఉపాధి అవకాశాలు కూడా మెరుగవుతాయని అంచనా వేస్తున్నారు.

 

ప్రస్తుతం జాతీయ స్థాయిలో హైవేల విస్తరణలో భాగంగా చేపడుతున్న ఈ ప్రాజెక్టు పూర్తయితే, రాకపోకల సమయం దాదాపు 30 నుంచి 40 శాతం వరకు ఆదా అవుతుందని కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ అంచనా వేస్తోంది. రాజధాని ప్రాంతంలో పెరుగుతున్న నగర విస్తరణను దృష్టిలో ఉంచుకుని, భవిష్యత్తులో రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్స్ వంటి రవాణా వ్యవస్థలను అనుసంధానించడానికి కూడా ఈ ఓఆర్‌ఆర్‌ డిజైన్‌లో తగిన వెసులుబాటు కల్పించారు. రాబోయే రోజుల్లో ఈ ప్రాజెక్టు పూర్తి కావడంతో ఆంధ్రప్రదేశ్ రవాణా రంగ స్వరూపమే పూర్తిగా మారిపోతుందని ప్రజలు, ప్రయాణికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

[Amaravati ORR Inter changes, , Amaravati Outer Ring Road, Amaravati Interchanges, NHAI Projects, Amaravati Development, Telugu One]