సిలికాన్ వ్యాలీని తలదన్నేలా అమరావతి: చంద్రబాబు స్వర్ణాంధ్ర విజన్..
Published on: Mon Oct 5, 2026 2:50PM

అమరావతి సైబరాబాద్ ను తలదన్నే ఐటీ హబ్ గా ఉంటుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అన్నారు. స్వర్ణాంధ్ర విజన్ పేరిట నిర్వహించిన ఉన్నత స్థాయి సదస్సులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర భవిష్యత్తు ప్రణాళికలపై కీలక ప్రకటనలు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాను నిర్మించి అభివృద్ధి చేసిన సైబరాబాద్‌ను మించిన సాంకేతిక కేంద్రంగా ఏపీ రాజధాని అమరావతిని రూపుదిద్దుతున్నట్లు చెప్పారు. ఆధునిక టెక్నాలజీ రంగానికి పెద్దపీట వేస్తూ, అమరావతిని సిలికాన్ వ్యాలీని తలదన్నేలా మార్చడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. భవిష్యత్తులో దేశ విదేశాల నుంచి పేరుమోసిన ఐటీ నిపుణులు ఈ ప్రాంతం వైపు ఆకర్షితులయ్యే విధంగా మౌలిక వసతులను కల్పిస్తున్నామని నారా చంద్రబాబు చెప్పారు.
.webp)
వచ్చే ఏడాది ఫిబ్రవరి కల్లా ఆధునికమైన క్వాంటం కంప్యూటర్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించిన చంద్రబాబు.. ప్రాంతీయంగానే కాకుండా, ఈ అధునాతన వ్యవస్థ ద్వారా దేశవ్యాప్తంగా వివిధ రంగాలకు క్వాంటం కంప్యూటర్ సేవలను విస్తరించనున్నట్లు తెలిపారు. గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ సంస్థల సేవలను తలపించేలా సరికొత్త సాంకేతిక ఆవిష్కరణలకు అమరావతి కేంద్ర బిందువు కానుందన్నారు. ఒకప్పుడు కేవలం పరిమిత సంకేతాలు అందించిన టెలికాం రంగం నేడు అన్ని రంగాలను శాసిస్తున్నట్లే, క్వాంటం టెక్నాలజీ కూడా భవిష్యత్తులో అనేక విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతుందని వివరించారు.
ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలలో స్థిరపడిన ప్రవాస భారతీయ ఐటీ నిపుణులు సైతం ఇప్పుడు అమరావతి వైపు ఆసక్తిగా చూస్తున్నారనీ, నూతన ఆవిష్కరణలకు ఎప్పుడూ ప్రోత్సాహం అందిస్తామని, క్వాంటం కంప్యూటింగ్ వంటి అత్యాధునిక రంగాల్లో పనిచేయాలనుకునే యువతకు, పారిశ్రామికవేత్తలకు రాష్ట్రంలో ఎర్ర తివాచీ పరుస్తామని చెప్పారు. ప్రపంచ స్థాయి పెట్టుబడులు ఇప్పటికే అమరావతి వైపు వస్తున్నాయని, ఇది రాబోయే కాలంలో రాష్ట ఆర్థిక వ్యవస్థకు బ్యాక్ బోన్ కానుందన్నారు.

సాంకేతిక రంగంతో పాటు వ్యవసాయం, తాగునీటి రక్షణకు సంబంధించి కూడా చంద్రబాబు ప్రస్తావించారు. దేశంలో ఇప్పటికే విద్యుత్ గ్రిడ్ ఏ విధంగా అమల్లో ఉందో, అదే రీతిలో దేశవ్యాప్తంగా వాటర్ గ్రిడ్ ఏర్పాటు కీలకమన్న చంద్రబాబు నాయుడు, దేశంలోని ఐదు ప్రధాన నదులను అనుసంధానించడం ద్వారా ఏ రాష్ట్రానికీ తాగు, సాగునీటి కొరత లేకుండా చూసే అవకాశం ఉంటుందన్నారు. ఈ ప్రతిపాదనను ఇప్పటికే దేశ ప్రధాని దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు. దేశ ప్రణాళికాబద్ధమైన నిర్ణయాలతో ముందుకు వెళ్తున్న ప్రస్తుత నాయకత్వం కింద, ఇలాంటి గ్రిడ్ ఏర్పాటు జరిగితే రాష్ట్రాల మధ్య నీటి వివాదాలు శాశ్వతంగా తొలగిపోతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
గతంలో హైదరాబాద్ నగరంలో తాము చేపట్టిన దీర్ఘకాలిక అభివృద్ధి కార్యక్రమాల ఫలితంగానే, నేడు ఆ ప్రాంతం తెలంగాణ రాష్ట్రానికి ప్రధాన ఆర్థిక వనరుగా మారిందని గుర్తు చేసిన చంద్రబాబు.. భవిష్యత్తులో అమరావతి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తిరుగులేని ఆర్థిక శక్తిగా మారుతుందని చెప్పారు. నిర్దేశిత గడువు ప్రకారం 2028 నాటికల్లా రాజధాని తొలి దశ నిర్మాణ పనులన్నీ పూర్తి చేసి నగర ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
[Amaravati Development, Cyberabad Plus, AP Chief Minister Chandrababu Naidu, Quantum Computer, Swarna Andhra Vision, Andhra Pradesh Capital, Telugu One]


