ఒలింపిక్స్ కు వేదికగా అమరావతి?.. ఆ దిశగానే చంద్రబాబు అడుగులు.!
Published on: Fri Aug 28, 2026 2:59PM

నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ప్రపంచ క్రీడా పటంలో అగ్రస్థానంలో నిలబెట్టే దిశగా చంద్రబాబు ప్రభుత్వం అడుగులు పడుతున్నాయి. అలా ఇలా కాదు.. 20236 విశ్వ క్రీడా వేదికగా అమరావతిని తీర్చి దిద్దేలా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నారు. ఔను 2036 అంటే సరిగ్గా దశాబ్దం తరువాత జరగనున్న ఒలింపిక్ పోటీలకు అమరావతి వేదికగా ఉండాలన్న లక్ష్యం, సంకల్పంతో ఆయన వ్యూహాలు ప్రణాళికలు రచిస్తున్నారు. ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకమైన ఒలింపిక్స్ ను నిర్వహించేందుకు భారత్ ఆతిథ్య హక్కుల కోసం పోటీ పడుతున్న తరుణంలో.. దేశంలో జరిగే ఈ పోటీలలో అమరావతి ప్రధాన పాత్ర పోషించేలా రంగం సిద్ధం చేయాలని చంద్రబాబు ఇప్పటికే అధికారులకు విస్పష్ట ఆదేశాలు జారీ చేశారు.
భారత్‌కు 2036 ఒలింపిక్స్ ఆతిథ్య అవకాశాలు వస్తే.. అందులోని వివిధ రకాల క్రీడా పోటీలను అమరావతిలోనే నిర్వహించేలా మౌలిక సదుపాయాలు కల్పన, స్టేడియంల నిర్మాణం దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. అమరావతిలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో క్రీడా మైదానాలు, కాంప్లెక్సులు, అత్యాధునిక అథ్లెటిక్ సదుపాయాలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఏపీ రెడీ అవుతోంది. ఈ మేరకు అధికారులకు విస్పష్ట ఆదేశాలు కూడా జారీ అయ్యాయి.
అంతర్జాతీయ ప్రమాణాలకు తగినట్లుగా క్రీడా మౌలిక వసతులను నిర్మించడం వల్ల కేవలం ఒలింపిక్స్ మాత్రమే కాకుండా ఇతర అంతర్జాతీయ టోర్నమెంట్లకు కూడా అమరావతి వేదిక అయ్యే అవకాశలు ఉంటాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కాగా, క్రీడాకారులకు అవసరమైన శిక్షణ కేంద్రాలు, గ్రేటర్ కనెక్టివిటీ, వసతి సౌకర్యాలు, మౌలిక సదుపాయాలను అనుసంధానిస్తూ బ్లూప్రింట్ సిద్ధం అవుతోంది.
(Amaravati To Host Olympics 2036, Ap CM CBN, AP Capital Amaravati, Sports Infrastructure, Global Sports Hub, Telugu One)


