అమర్ రాజా గ్రూప్ విరాళం; ఆంధ్రకు 5కోట్లు! తెలంగాణకు కోటి!

ప్రస్తుతం భారత్‌లో కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే దేశంలో కరోనా కేసులు 1100 మార్కును దాటేశాయి. ఈ క్రమంలో కరోనాపై పోరుకు ఆర్థిక సాయం చేయ‌డానికి దాత‌లు ముందుకు వ‌స్తున్నారు. ఈ నేపథ్యంలో కరోనాపై పోరుకు తమ వంతుగా 6 కోట్ల విరాళం అందజేస్తున్నట్లు  అమ‌ర్ రాజా సంస్థ ప్రకటించింది.  

‘దేశం అత్యంత విపత్కర పరిస్థితులను ఎదుర్కుంటోంది. ఇటువంటి సమయంలో కరోనాపై పోరాడే బాధ్యతను అందరూ పంచుకోవడమే ముఖ్యం. అందుకే ఈ పోరాటాన్ని ముందుండి నడిపిస్తున్న ఆరోగ్యసిబ్బందికి అన్నిరకాల సహాయమూ అందించాలని నిర్ణయించుకున్నాం. ఈ విపత్కర పరిస్థితుల్లో పేషెంట్లకు చికిత్స అందించగలిగే ఆస్పత్రులకు సాధ్యమైనంత సహకారం అందించాలనే ఉద్దేశంతోనే ఈ విరాళం ప్రకటించాం’  అని అమర్ రాజా గ్రూప్ త‌ర‌ఫున ఎంపీ గల్లా జయదేవ్ ఓ ట్వీట్ ద్వారా తెలియ‌జేశారు.

కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక పోరాటానికి అమర్ రాజా గ్రూప్స్ తమ వంతు విరాళాన్ని అందజేసింది. ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ.5 కోట్లు, తెలంగాణ ప్రభుత్వం నకు రూ.1 కోటి విరాళం  ప్రకటించారు.  ‘కరోనా’ కట్టడికి ఏపీ ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి  అమర్ రాజా గ్రూప్ మద్దతుగా నిలుస్తూ రూ.5 కోట్ల చెక్ ను చిత్తూరు జిల్లా కలెక్టర్ కు ఈ గ్రూప్ సీఈఓ అందజేశారని తన పోస్ట్ లో పేర్కొన్నారు.  ఇందుకు సంబంధించిన చెక్కులను అమర రాజా గ్రూప్ చైర్మన్ డా.రామచంద్ర ఎన్ గల్లా, వారి కుమార్తె రమాదేవి  జిల్లా కలెక్టర్ డా.నారాయణ భరత్ గుప్తా గారికి సోమవారం ఉదయం కలెక్టర్ ఛాంబర్ నందు అందజేశారు.