TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

హిజాబ్ కంపల్సరీ కాదన్న అలహాబాద్ హైకోర్టు.!

Published on: Tue Aug 25, 2026 10:20AM

పాఠశాలల్లో నిర్ణయించిన యూనిఫామ్ నిబంధనలను అలహాబాద్ హైకోర్టు సమర్ధించింది. విద్యాసంస్థల ప్రాంగణంలో నిర్దేశిత యూనిఫామ్‌తో పాటు హిజాబ్ ధరించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఒక విద్యార్థిని దాఖలు చేసిన పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టు తోసిపుచ్చింది.  ఇస్లాంలో హిజాబ్ ధరించడం అత్యవసరమైన ఆచారమని పిటిషనర్ నిరూపించలేకపోయారని పేర్కొంది.  వివరాలిలా ఉన్నాయి. 

ప్రయాగ్‌రాజ్‌లోని అత్తర్‌సుయియా ప్రాంతంలోని ఠాగూర్ పబ్లిక్ స్కూల్‌లో టెన్త్ చదివిన సుకైనా రిజ్వీ అనే విద్యార్థిని, అదే పాఠశాలలో 11వ తరగతిలో చేరాలని నిర్ణయించుకున్నది. అయితే పాఠశాల యాజమాన్యం నిర్ణయించిన డ్రెస్‌కోడ్‌తో పాటు అదనంగా తలకు హిజాబ్ ధరించేందుకు అవకాశం ఇవ్వాలని, ఈ మేరకు పాఠశాల పరిపాలనా మండలికి   ఆదేశాలు ఇవ్వాలని తన తల్లి ద్వారా అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

ఈ పిటిషన్ ను విచారించిన  జస్టిస్ జేజే మునీర్, జస్టిస్ ఇంద్రజీత్ శుక్లాతో అలహాబాద్ హైకోర్టు ధర్మాసనం  సదరు పాఠశాలలో చదువుతున్న ఇతర మైనారిటీ వర్గానికి చెందిన ఏ ఒక్క విద్యార్థిని కూడా హిజాబ్ ధరించడం లేదనీ, కేవలం నోటి మాటగా హిజాబ్ ఇస్లాంలో తప్పనిసరి అని చెప్పడం తప్ప, మత గ్రంథాల నుంచి గానీ,  చట్టపరమైన ఆధారాల నుంచి గానీ దాన్ని రుజువు చేసేలా ఎలాంటి ఆధారాలు సమర్పించలేకపోయారని పేర్కొంది. 

గతంలో ఈ తరహా అంశాలపై వివిధ రాష్ట్రాల ఉన్నత న్యాయస్థానాలు వెలువరించిన తీర్పులను ఈ సందర్భంగా అలహాబాద్ హైకోర్టు గుర్తుచేసింది. విద్యాసంస్థల్లో సమానత్వం, క్రమశిక్షణ, సంస్థాగత గుర్తింపును పెంపొందించడానికి రూపొందించిన యూనిఫామ్ కోడ్‌ను మార్చాలని విద్యార్థులు పట్టుబట్టడానికి వీల్లేదని స్పష్టం చేసింది.  రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్ 25 ప్రకారం మత స్వేచ్ఛ హక్కులు ఉన్నప్పటికీ, తగినంత చట్టపరమైన పునాది,  ఆధారాలు లేకుండా  విద్యాసంస్థల నిబంధనలను సవాలు చేయలేరని  తేల్చిచెబుతూ..  పిటిషన్‌ను  కొట్టివేసింది.

ఈ తీర్పు దేశంలోని పలు విద్యాసంస్థల్లో అమలు అవుతున్న డ్రెస్‌కోడ్ నిబంధనలకు మరింత చట్టపరమైన బలాన్ని చేకూర్చిందని న్యాయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. పాఠశాలల్లో వ్యక్తిగత మతపరమైన గుర్తింపుల కంటే క్రమశిక్షణ, సమానత్వమే ముఖ్యమనే భావనను ఈ పరిణామం మరొకసారి స్పష్టం చేసింది. భవిష్యత్తులో విద్యాసంస్థలలోని నియమ నిబంధనలకు సంబంధించి వచ్చే వివాదాలకు ఈ తీర్పు ఒక మార్గదర్శకంగా నిలుస్తుందని భావిస్తున్నారు.

Allahabad High Court Verdict on Hizab, Hijab in Islam, School Uniform Rules, Freedom of Religion Sukaina Rizvi Petition