TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఆళ్ల నాని మృతి పట్ల సీఎం చంద్రబాబు, లోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతి..!

Published on: Tue Sep 15, 2026 4:01PM

 

అత్తగారింటికి పండుగకు వచ్చిన ఆళ్ల నాని హఠాన్మరణం..!

ఏపీ మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని మృతి పట్ల సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సోషల్ మీడియా ఎక్స్‌ వేదికగా ముఖ్యమంత్రి స్పందిస్తూ.. ఆళ్ల నాని మృతిపై సంతాపం తెలియజేశారు. ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని(కాళీ కృష్ణ శ్రీనివాస్) హఠాన్మరణం నాకు తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. 56 సంవత్సరాల వయసులోనే గుండెపోటుతో దూరమవ్వడం బాధాకరం. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాను. ఆళ్ల నాని ఆత్మకు శాంతిని చేకూర్చాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను’ అంటూ ఎక్స్‌లో సీఎం చంద్రబాబు పోస్ట్ చేశారు.

మంత్రి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేశ్, ఆళ్ల నాని మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వివాదాలకు దూరంగా, అందరితోనూ స్నేహపూర్వకంగా మెలిగే నాని స్మృతిలో నివాళులర్పిస్తున్నానని తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నారు.

ఏలూరు నియోజకవర్గం నుంచి మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచి, ప్రజలతో మమేకమైన నేతగా పేరుపొందిన ఆళ్ల నాని మరణం రాష్ట్ర రాజకీయాల్లో, ముఖ్యంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పూడ్చలేని లోటుగా భావిస్తున్నారు. ఆయన మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.

మాజీ ఉప ముఖ్యమంత్రి, వైసీపీ నేత ఆళ్ల నాని మంగళవారం ఉదయం గుండెపోటుతో విశాఖపట్నంలో మృతి చెందారు. అత్తగారింటికి పండగకు వచ్చిన ఆయనకు ఊహించని విధంగా గుండెలో నొప్పి రావడంతో హుటాహుటిన నగరంలోని సీతమ్మధారలో గల కిమ్స్ ఐకాన్ హాస్పిటల్‌కు తరలించగా అక్కడ మృతి చెందారు.

రాజకీయ నాయకునిగా కాకుండా, ఉత్తమ కార్య నిర్వహణ అధికారిగా ఆళ్ల నాని పేరు తెచ్చుకున్నట్లుగా చెప్పొచ్చు. వర్గ రాజకీయాలకు, గ్రూపు కోటరీలకు తావివ్వకుండా కల్మషం లేని నాయకునిగా కొనసాగుతూ వచ్చారు. రాజకీయ రంగంలో అజాతశత్రువుగా పేరుపొందిన ఆళ్ల నాని హఠాన్మరణం అన్ని రాజకీయ పార్టీల నేతలను దిగ్భ్రాంతికి గురిచేసింది.

సంఘటన గురించి తెలిసిన వెంటనే అన్ని పార్టీలకు చెందిన నేతలు తొలుత కిమ్స్ ఐకాన్ ఆసుపత్రికి చేరుకున్నారు. అక్కడి నుంచి ఆయనను డిశ్చార్జ్ చేసి కుటుంబ సభ్యులు మురళీనగర్‌లో గల తమ ఇంటికి తీసుకువెళ్లగా నాయకులందరూ అక్కడికి చేరుకున్నారు. అయితే ఆళ్ల నానికి వచ్చిన గుండెపోటు ఇదే మొదటిసారా? గతంలో ఎప్పుడైనా వచ్చిందా? ఆయన మరణానికి గల కారణాలు ఏమిటి? అన్న విషయమై వైద్యులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది. ఆళ్ల నాని మరణం రాజకీయ వర్గాలను తీవ్ర విషాదానికి గురిచేసింది.

 

 

[ Alla Nani, Alla Kali Krishna Srinivas, Alla Nani Death, Alla Nani Passed Away, Former AP Deputy CM, AP Former Minister, Andhra Pradesh Politics, Eluru Politics, YSRCP, TDP, Chandrababu Naidu, Nara Lokesh, YS Jagan, KIMS Icon Hospital, Visakhapatnam, Heart Attack, Former Deputy Chief Minister, Eluru MLA, Andhra Pradesh News, AP Political News]