ఆళ్ల నాని అస్తమయం..రాజకీయ వర్గాల్లో విషాదం..!
Published on: Tue Sep 15, 2026 2:40PM

ఏపీ మాజీ డిప్యూటీ సీఎం, మాజీ మంత్రి ఆళ్ల నాని (57) కన్నుమూశారు. మంగళవారం విశాఖపట్నంలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఐదుగురు డిప్యూటీ సీఎంలలో ఒకరిగా పనిచేసిన ఆళ్ల నాని.. వైద్య, ఆరోగ్యశాఖ మంత్రిగా కూడా కీలక బాధ్యతలు నిర్వహించారు.
ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌గా రాజకీయాల్లోకి వచ్చిన ఆళ్ల నాని.. 1969 డిసెంబరు 30న పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఆళ్ల సూర్యచంద్రరావు, నాగమణి దంపతులకు జన్మించారు. ఏలూరులోని కేపీ హైస్కూల్‌లో 1985లో పదో తరగతి, సర్ సీఆర్‌ఆర్ కళాశాలలో 1988లో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బీఏ చదువుతూ మధ్యలోనే విద్యాభ్యాసాన్ని నిలిపివేశారు.

రాజకీయ ప్రస్థానం..!
కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన ఆళ్ల నాని.. 1994, 1999 అసెంబ్లీ ఎన్నికల్లో ఏలూరు నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2004లో టీడీపీ అభ్యర్థి అంబికా కృష్ణపై 33,053 ఓట్ల మెజారిటీతో విజయం సాధించి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009లోనూ ఏలూరు నుంచి గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా కొనసాగారు.
2013లో కాంగ్రెస్‌కు రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2014లో వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. 2017లో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.
2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరఫున ఏలూరు నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అనంతరం వైఎస్ జగన్ కేబినెట్‌లో డిప్యూటీ సీఎంతో పాటు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ముఖ్యంగా కోవిడ్ సమయంలో ఆరోగ్యశాఖ మంత్రిగా ఆయన నిర్వహించిన బాధ్యతలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఏలూరు నుంచి టీడీపీ అభ్యర్థి బడేటి రాధాకృష్ణ (బడేటి చంటి) చేతిలో ఆళ్ల నాని ఓటమి పాలయ్యారు. అనంతరం 2025లో తెలుగుదేశం పార్టీలో చేరారు.

దాదాపు రెండు దశాబ్దాల పాటు ఏలూరు రాజకీయాల్లో కీలక నేతగా కొనసాగిన ఆళ్ల నాని మృతితో రాజకీయ వర్గాల్లో విషాదం నెలకొంది. ఆయన మృతిపట్ల వైఎస్సార్‌సీపీ నేతలతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సంతాపం తెలిపారు.
[ Alla Nani, Alla Kali Krishna Srinivas, Alla Nani Death, Former AP Deputy CM, Former Minister Alla Nani, Eluru Politics, YSRCP, TDP, YS Jagan, AP Politics, Andhra Pradesh Politics, Health Minister, COVID 19, Eluru MLA, Alla Nani News ]


