బాబోయ్ అఖిలపక్షం

 

గతంలో కేంద్ర హోం మంత్రి చిదంబరం రాష్ట్ర విభజనపై చర్చించేందుకు రాష్ట్ర రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. అప్పుడు వారి నుండి లేఖలు తీసుకోవడమే గాకుండా ఎందుకయినా మంచిదని ముందు జాగ్రత్తగా వారి మాటలను రికార్డు చేసి, వీడియోను కూడా తీసి భద్రంగా ఉంచుకొన్నారు. అఖిలపక్షమయితే ఘనంగానే నిర్వహించారు, గానీ రాష్ట్ర విభజన మాత్రం వెంటనే చేయలేదు.

 

మళ్ళీ ఆ తరువాత షిండే ఆయన స్థానంలోకి హోం మంత్రిగా రావడంతో మళ్ళీఅదే తంతు మరోసారి జరిపారు. అప్పుడు కూడా మళ్ళీ లేఖలు, వీడియోలు తతంగం షరా మామూలే. ఎట్టకేలకు కాంగ్రెస్ దైర్యంచేసి రాష్ట్ర విభజన చేస్తున్నట్లు ప్రకటించేసరికి రాష్ట్రంలో రాజకీయపార్టీలు అన్ని కంగు తిన్నాయి. కానీ వెంటనే తేరుకొని తలో వాదన చేస్తూ కేంద్రాన్ని నిందించడం మొదలుపెట్టాయి.

 

అయితే రాష్ట్రంలో పార్టీలు మహా ముదుర్లయితే, కాంగ్రెస్ దేశాన్నే ఏలేస్తున్నపెద్ద దేశముదురు. తన దగ్గరున్నవారి లేఖలను బయటపెట్టి లొంగ దీయాలని ప్రయత్నించింది. గానీ వాళ్ళు లొంగకపోవడంతో వారి నోళ్లకు తాళం వేసేందుకు మళ్ళీ తన దగ్గరున్న బ్రహ్మాస్త్రం అంటే అఖిలపక్ష సమావేశం ఐడియాని మరోమారు వారిపై ప్రయోగించింది. ఊహించినట్లే ప్రతిపక్షాలు మళ్ళీ కంగు తిన్నాయి.

 

రెండు సార్లు అఖిలపక్షంలో పాల్గొనందుకే నేటికే లెంపలు వేసుకొనే పరిస్థితి ఎదురవుతుంటే, ఇప్పుడు మళ్ళీ మరో మారు వెళ్లడం బుద్ధి తక్కువ పనే అవుతుందని గ్రహించిన తెదేపా, వైకాపాలు అఖిలపక్షానికి కుంతీ సాకులు చెప్పి డుమ్మా కొట్టేసాయి. అఖిలపక్షానికి వెళితే రాష్ట్ర విభజనకు అంగీకరిస్తునట్లు సంకేతాలు వెళ్తాయని వైకాపా భయపడితే, వెళ్లి కొత్త ఇబ్బందులు తలెకెత్తుకోవడమెందుకని తెదేపా తప్పించుకొంది. కాంగ్రెస్ పార్టీని ప్రతిపక్షాలు నమ్మవు. వాటిని కాంగ్రెస్ నమ్మదు. అందుకే వారి మధ్య ఈ చదరంగం నిరంతరం సాగుతూనే ఉంటుంది.