డిసెంబర్ లో డీజీపీల జాతీయ సదస్సు: ఎక్కడో తెలుసా?
Published on: Thu Sep 24, 2026 11:14AM

దేశ అంతర్గత భద్రత, పోలీసు యంత్రాంగం పనితీరును మరింత మెరుగుపరిచే లక్ష్యంతో నిర్వహించే అఖిల భారత డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)ల సదస్సు ఈసారి ఆంధ్రప్రదేశ్‌లో జరగనుంది. ఆధ్యాత్మిక నగరం తిరుపతి వేదికగా ఈ ఏడాది డిసెంబర్ మొదటి వారంలో డీజీపీల 61వ సదస్సు జరగనుంది. ఇందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. దేశ అత్యున్నత నాయకత్వంతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న రక్షణ రంగ ప్రముఖులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు.
ఈ జాతీయ స్థాయి సమావేశం కోసం తిరుపతి జిల్లాలోని ఏర్పేడు మండలం సమీపంలో ఉన్న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ప్రాంగణాన్ని ఖరారు చేశారు. ఈ సదస్సుకు దేశ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరౌతారు. అలాగే.. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ కూడా ఈ సమావేశంలో పాల్గొని ప్రసంగిస్తారు.

ఈ సమావేశానికి దేశంలోని 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన డీజీపీలతో పాటు, కేంద్ర నిఘా సంస్థల అధిపతులు హాజరౌతారు. అలాగే దేశవ్యాప్తంగా వివిధ విభాగాలకు చెందిన సుమారు 400 మంది ఐపీఎస్ అధికారులు ఈ సదస్సులో భాగస్వామ్యం కానున్నట్లు సమాచారం. దేశ సరిహద్దు భద్రత, అంతర్గత శాంతిభద్రతలు, సైబర్ క్రైమ్ నియంత్రణ, ఉగ్రవాద కట్టడి, పోలీసు శాఖలో ఆధునిక సాంకేతికత వినియోగం వంటి అంశాలపై చర్చిస్తారు.

తెలుగు రాష్ట్రాల చరిత్రలో పోలీస్ శాఖకు సంబంధించి జాతీయ సదస్సు జరగడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ఈ సదస్సు విజయవంతం అయ్యేందుకు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం, పోలీసు శాఖ, కేంద్ర నిఘా వర్గాలు సమన్వయంతో ముందస్తు ఏర్పాట్లను సమీక్షిస్తున్నాయి.
All India DGP Conference, Tirupati, PM Narendra Modi, Amit Shah, NSA, Ajit Dhowal,National security meeting, Andhra Pradesh, Telugu One


