అత్యంత అనుభవం ఉన్న పైలట్.. అయినా తప్పని ప్రమాదం.. కారణం అదేనా..!

భారీ వర్షాలతో సతమతమవుతున్నకేరళలో నిన్న రాత్రి విమాన ప్రమాదం జరిగింది. దుబాయ్ నుంచి కోజికోడ్ వచ్చిన ఎయిరిండియాకు చెందిన బోయింగ్ విమానం కోజికోడ్ విమానాశ్రయంలో ల్యాండింగ్ కు ప్రయత్నిస్తున్న సమయంలో రన్ వే పై నుంచి జారిపోయి రెండు ముక్కలైంది. ఈ ప్రమాదంలో విమాన పైలెట్, కో పైలట్ సహా 20 మంది మృతి చెందారు. మరో 100 మందికి పైగా గాయపడ్డారు. వందే భారత్ మిషన్‌లో భాగంగా కోజికోడ్ వచ్చిన ఈ విమానంలో ప్రమాదం సమయంలో 180 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. గాయపడిన వారిని కోజికోడ్ లోని వివిధ ఆసుపత్రులకు తరలించారు.

 

నిన్న కోజికోడ్‌లో జరిగిన విమాన ప్రమాదంలో పైలెట్ దీపక్ వసంత సాథే అత్యంత అనుభవం కలిగిన వారు, ఆయన IAF లో వింగ్ కమాండర్ గా పని చేసి రిటైర్ అయ్యారు. ఆయనకు NDA తరపున స్వార్డ్ ఆఫ్ ఆనర్ అవార్డ్ కూడా లభించింది. అయినప్పటికీ ఆ విమానం రన్‌వేపై ల్యాండ్ అయేటపుడు కుదుపులకు లోనై రన్‌వేపై దూసుకుపోతూ పక్కనే ఉన్న లోయలోకి జారిపోతూ రెండు ముక్కలైపోయిందంటే ఆ ప్రమాదం ఎంత భయంకరంగా జరిగిందో అర్థం చేసుకోవచ్చు.

 

నిన్న రాత్రి విమానం ల్యాండ్ అయ్యే సమయంలో వర్షం పడ్తుండటం వల్ల రన్‌వే చిత్తడిగా ఉంది. అందువల్ల విమానం దిగగానే... టైర్లు జారి ఉంటాయని అనుమానిస్తున్నారు. దీంతో విమానం లోయలోకి వెళ్లిపోయిందని అనుకుంటున్నారు. ఈ ప్రమాదం పై ఎయిర్ మార్షల్ పీకే బార్బోరా స్పందిస్తూ ఎంతో అనుభవం ఉన్న పైలెట్ అయిన దీపక్ వసంత సాథే కూడా విమానాన్ని కంట్రోల్ చేయలేకపోయారంటే... ప్రమాదం ఏ స్థాయిలో జరిగివుంటుందో ఊహించుకోవచ్చని అభిప్రాయపడ్డారు.

 

మరో పక్క భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా కోజికోడ్‌ రన్‌వే విమానాలు దిగడానికి సరైనది కాదని తొమ్మిదేళ్ల కిందటే ఎయిర్‌ సేఫ్టీ ఎక్స్‌పర్ట్ కెప్టెన్‌ మోహన్‌ రంగనాథన్ ఒక నివేదికలో వివరించారు‌. ఇలాంటి ప్రమాదం ఏదైనా జరిగే అవకాశం ఉందని అప్పట్లోనే ఆయన చెప్పారు. దానికి తగ్గట్లే ఇప్పుడు ఈ ప్రమాదం జరిగింది. ఐతే ఇకపై ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ఏం చెయ్యాలనే అంశంపై దర్యాప్తు రిపోర్ట్ వచ్చాక... కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.