TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

దేశంలోనే తొలి ఏఐ పోలీస్ స్టేషన్‌గా పంజాగుట్ట.!

Published on: Wed Nov 25, 2026 5:18PM

తెలంగాణ పోలీస్ శాఖ ఆధునిక సాంకేతికత వినియోగంలో మరో కీలక ముందడుగు వేస్తోంది. దేశంలోనే తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత పోలీస్ స్టేషన్‌గా హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌ను అభివృద్ధి చేస్తోంది. ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన ఏఐ వ్యవస్థ పనితీరును డీజీపీ సీవీ ఆనంద్ స్వయంగా పరిశీలించారు. అడిషనల్ డీజీపీ అకూన్ సబర్వాల్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్‌తో కలిసి పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌ను సందర్శించి, అక్కడ చేపట్టిన సాంకేతిక ఏర్పాట్లను సమీక్షించారు.

ఫిర్యాదుల నమోదులో ఇక జాప్యానికి చెక్.!

సాధారణంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన బాధితులు తమ సమస్యను అధికారులకు వివరించి, ఫిర్యాదు నమోదు చేయించుకోవడానికి కొంత సమయం వేచి ఉండాల్సి వస్తుంది. అయితే పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో అందుబాటులోకి తీసుకొస్తున్న ఏఐ విధానంతో ఈ ఇబ్బందులకు చెక్ పెట్టనున్నారు. స్టేషన్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఏఐ కియోస్క్ ముందు బాధితులు తమ సమస్యను వివరిస్తే చాలు.. వారు చెప్పిన వివరాలను ఏఐ వ్యవస్థ రికార్డు చేసి ఫిర్యాదు పత్రాన్ని సిద్ధం చేస్తుంది. అనంతరం దానిని సంబంధిత అధికారులకు పంపిస్తుంది.

దాదాపు 10 భాషల్లో ఫిర్యాదు చేసే అవకాశం.!

ఈ ఏఐ వ్యవస్థలో మరో ప్రత్యేకత బహుభాషా సదుపాయం. బాధితులు తమకు తెలిసిన భాషలోనే ఫిర్యాదు చేసే అవకాశం కల్పించనున్నారు. దాదాపు పది భాషల్లో ఫిర్యాదులను స్వీకరించి, ఏఐ సాయంతో వాటిని స్థానిక భాషలోకి అనువదించి సంబంధిత అధికారులకు చేరవేస్తారు. దీనివల్ల ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికులు, పర్యాటకులు భాషాపరమైన ఇబ్బందులు లేకుండా తమ సమస్యలను పోలీసులకు తెలియజేయవచ్చు.

దర్యాప్తులోనూ ఏఐ సాంకేతికత.!

కేవలం ఫిర్యాదుల స్వీకరణకే పరిమితం కాకుండా.. ఎఫ్‌ఐఆర్‌ల నమోదు, కేసు డైరీల నిర్వహణ, దర్యాప్తు నివేదికల తయారీ, చార్జిషీట్ల రూపకల్పన వంటి కీలక పోలీసు విధుల్లోనూ ఏఐ సాంకేతికతను వినియోగించాలన్నది ఈ ప్రాజెక్టు లక్ష్యం. దీనివల్ల పోలీసు సిబ్బందిపై పరిపాలనా పనిభారం తగ్గడంతో పాటు, కేసుల దర్యాప్తులో వేగం పెరిగే అవకాశం ఉంది.

నేరాల నియంత్రణకు డేటా విశ్లేషణ.!

పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని ట్రాఫిక్ రద్దీ, హాస్టళ్లు, వాణిజ్య సముదాయాలు, గతంలో నమోదైన నేరాలు, నేరాల సరళి వంటి అంశాలను ఏఐ వ్యవస్థ విశ్లేషించనుంది. ఈ డేటా ఆధారంగా పోలీసింగ్‌ను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించవచ్చు. బ్లూకోల్ట్స్ సిబ్బంది కదలికలు, పెట్రోలింగ్ విధానాలను మెరుగుపరచడంతో పాటు, నేరాలు జరిగే అవకాశమున్న ప్రాంతాలను గుర్తించి అక్కడ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయవచ్చు.

సక్సెస్ అయితే రాష్ట్రవ్యాప్తంగా విస్తరణ.!

ప్రస్తుతం పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఈ విధానాన్ని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నారు. కొత్త సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించేందుకు పోలీస్ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ కూడా ఇవ్వనున్నారు. ఈ పైలట్ ప్రాజెక్టు ఫలితాలను సమీక్షించి, ప్రజలకు అందుతున్న సేవల్లో వేగం, పారదర్శకత, పనితీరును అంచనా వేయనున్నారు. ప్రయోగం విజయవంతమైతే రాష్ట్రంలోని ఇతర పోలీస్ స్టేషన్లకు కూడా ఈ విధానాన్ని విస్తరించే ఆలోచనలో పోలీస్ శాఖ ఉంది.

మొత్తంగా.. పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితులకు మరింత సులభంగా సేవలు అందించడం, ఫిర్యాదుల నమోదులో జాప్యాన్ని తగ్గించడం, దర్యాప్తు ప్రక్రియలో ఆధునిక సాంకేతికతను జోడించడం లక్ష్యంగా తెలంగాణ పోలీస్ శాఖ ఈ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఈ ప్రయోగం విజయవంతమైతే దేశ పోలీసింగ్ వ్యవస్థలోనే సాంకేతిక విప్లవానికి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ వేదికగా నిలిచే అవకాశం ఉంది.

మీకు నచ్చవచ్చు: మనిషి 1400 ఏళ్లు బతకగలడా..వృద్ధాప్యానికి ఏఐ చెక్ పెట్టనుందా.!

మీకు నచ్చవచ్చు: మిస్ యూనివర్స్ 2026 విజేతగా జెన్నిఫర్ బారెటో..తొలి వివాహితగా చరిత్ర.!

 

 

[ AI Police Station, Panjagutta Police Station, DGP CV Anand, Akun Sabharwal, Mahesh Bhagwat, Telangana Police, Artificial Intelligence, Smart Policing, AI Technology, Hyderabad Police ]