ఆసియా క్రీడలు 2026: జపాన్‌పై అఫ్గానిస్తాన్ థ్రిల్లింగ్ విక్టరీ!
Published on: Thu Sep 24, 2026 11:20AM

ఆసియా క్రీడలు 2026 పురుషుల టీ20 క్రికెట్ టోర్నీలో తొలి మ్యాచ్‌లోనే ఉత్కంఠభరితమైన పోరు సాగింది. జపాన్, అఫ్గానిస్తాన్ జట్ల మధ్య జరిగిన ఈ మ్యాచ్ క్రికెట్ అభిమానులకు పక్కా వినోదాన్ని అందించింది. టాస్ గెలిచిన జపాన్ జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుని అఫ్గానిస్తాన్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. నిస్షిన్‌లోని కోరోగి స్పోర్ట్స్ పార్క్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఆరంభం నుంచే జపాన్ బౌలర్లు కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేస్తూ అఫ్గాన్ బ్యాటర్లను తీవ్రంగా ఒత్తిడిలోకి నెట్టారు. సీనియర్ ఆటగాళ్లతో కూడిన అఫ్గానిస్తాన్ పవర్ ప్లేలోనే కీలక వికెట్ కోల్పోయి నెమ్మదిగా ఇన్నింగ్స్‌ను నిర్మించాల్సి వచ్చింది. ప్రారంభంలోనే హసన్ ఈసాఖిల్ కేవలం 3 పరుగులు చేసి 14 పరుగుల వద్ద పెవిలియన్ చేరడంతో అఫ్గానిస్తాన్ కష్టాల్లో పడింది.
అలాంటి కీలక సమయంలో మహమ్మద్ అక్రమ్ మరియు కరీమ్ జనత్ జట్టును ఆదుకోవడానికి బాధ్యతాయుతమైన ఆటతీరును ప్రదర్శించారు. మహమ్మద్ అక్రమ్ అత్యంత కీలకమైన ఇన్నింగ్స్ ఆడుతూ 29 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 34 పరుగులు చేసి జట్టులో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కరీమ్ జనత్ 23 బంతుల్లో 21 పరుగులు చేసి అతనికి మంచి సహకారం అందించాడు. అయితే 68 పరుగుల వద్ద అక్రమ్ అవుట్ కావడంతో అఫ్గాన్ స్కోరు మళ్లీ మందగించింది. ఇబ్రహీమ్ తకాహాషి 4 ఓవర్లలో 19 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీయగా, షోమా సుగయా స్లేటర్ 3 ఓవర్లలో 18 పరుగులు ఇచ్చి 2 వికెట్లు పడగొట్టి అఫ్గాన్ బ్యాటింగ్ రన్ రేట్‌ను కట్టడి చేశారు.

మధ్య ఓవర్లలో కెప్టెన్ దార్విష్ రసూలీ 27 బంతుల్లో 4 ఫోర్లతో 29 పరుగులు చేసి ఇన్నింగ్స్‌కు స్థిరత్వం తెచ్చాడు. ఆఖరి ఓవర్లలో వికెట్ కీపర్ మహమ్మద్ ఇషాక్ వేగంగా పరుగులు సాధించాడు. ఇషాక్ కేవలం 17 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సర్‌తో నాటౌట్‌గా 25 పరుగులు చేసి విధ్వంసకర ఆటతీరుతో జట్టు స్కోరును 120 దాటించాడు. ఆఖరి 4 ఓవర్లలో అఫ్గాన్ బ్యాటర్లు ఏకంగా 45 పరుగులు పిండుకోవడంతో నిర్ణీత 20 ఓవర్లలో అఫ్గానిస్తాన్ 6 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేయగలిగింది.
130 పరుగుల మోస్తరు లక్ష్యంతో బరిలోకి దిగిన జపాన్ జట్టుకు అఫ్గాన్ బౌలర్లు చుక్కలు చూపించారు. ముఖ్యంగా అఫ్గానిస్తాన్ స్పిన్ ధాటికి జపాన్ బ్యాటర్లు క్యూ కట్టారు. ఆరంగేట్రం చేసిన అఫ్గాన్ యువ లెగ్ స్పిన్నర్ అరబ్ గుల్ సంచలన బౌలింగ్‌తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చివేశాడు. అరబ్ గుల్ తన 4 ఓవర్లలో రెండు మెయిడెన్లు విసిరి, కేవలం 8 పరుగులు మాత్రమే ఇచ్చి 4 కీలక వికెట్లు నేలకూల్చాడు. గుల్ ఎకానమీ రేటు కేవలం 2.00గా నమోదు కావడం గమనార్హం. అతని ధాటికి జపాన్ 60/4 నుండి 63/8 కి క్షణాల్లో పడిపోయింది. కనీస పోరాటం లేకుండా కేవలం 3 పరుగుల వ్యవధిలోనే 4 వికెట్లు కోల్పోయింది.
అరబ్ గుల్‌కు తోడుగా నంగేయాలియా ఖరోటే 3.3 ఓవర్లలో 19 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టగా, అబ్దుల్లా అహ్మద్‌జాయ్ 3 ఓవర్లలో 13 పరుగులు ఇచ్చి 2 వికెట్లు సాధించారు. జపాన్ ఇన్నింగ్స్‌లో రేయో సకురానో థామస్ 23 పరుగులు, బెంగమిన్ ఇటో డేవిస్ 17 పరుగులు చేసినప్పటికీ మ్యాచ్‌ను గెలిపించలేకపోయారు. దీంతో జపాన్ 19.3 ఓవర్లలో కేవలం 81 పరుగులకే ఆలౌట్ అయింది. ఫలితంగా అఫ్గానిస్తాన్ 48 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి ఆసియా క్రీడల టోర్నీలో విజయబోణీ కొట్టింది.
[Asian Games 2026, Afghanistan vs Japan, T20 Cricket, Afghanistan Cricket Team, Japan Cricket Team, Arab Gul, Nangeyalia Kharote, Mohammad Akram, Karim Janat, Darwish Rasooli]


