ఆదిలాబాద్ రిమ్స్ లో అగ్నిప్రమాదం.. ఇద్దరు నవజాత శిశువులు మృతి.!
Published on: Tue Sep 22, 2026 9:31AM

ఆదిలాబాద్ రాజీవ్ గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్) ఆసుపత్రిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆసుపత్రిలోని నవజాత శిశువుల ప్రత్యేక చికిత్సా విభాగంలో సోమవారం (సెప్టెంబర్ 21)అర్ధరాత్రి దాటిన తరువాత సంభవించిన అగ్నిప్రమాదంలో ఇద్దరు పసికందులు ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు.. అదే వార్డులో చికిత్స పొందుతున్న 28 మంది చిన్నారులను సిబ్బంది సురక్షితంగా బయటకు తరలించారు.
సోమవారం అర్థరాత్రి సమయంలో రిమ్స్లోని స్పెషల్ న్యూబార్న్ కేర్ యూనిట్ (ఎస్ఎన్సీయూ)లో ఈ ప్రమాదం జరిగింది. దీంతో అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న ఆసుపత్రి ప్రాంగణంలో ఒక్కసారిగా కలకలం రేగింది. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే చిన్నారులను కాపాడేందుకు ముందుకు దూకారు. ఈ క్రమంలో వార్డులో ఉన్న 28 మంది శిశువులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే, ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులను మాత్రం కాపాడలేకపోయారు.

ప్రాథమిక అంచనాల ప్రకారం, వార్డులోని ఎయిర్ కండిషనర్‌కు సంబంధించిన విద్యుత్ వ్యవస్థలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. అయితే.. ప్రమాదానికి కచ్చితమైన కారణం ఏమిటన్నది నిర్ధారించాల్సి ఉంది. విద్యుత్ పరికరాల్లో సాంకేతిక లోపం తలెత్తిందా? ఏసీ వ్యవస్థలో సమస్య ఏర్పడిందా? మరేదైనా కారణంతో మంటలు వ్యాపించాయా? అనే అంశాలపై విచారణ జరుపుతున్నారు. మంటలు చెలరేగిన వెంటనే ఆసుపత్రి సిబ్బంది స్పందించి, ప్రమాదంలో చిక్కుకునే అవకాశం ఉన్న చిన్నారులను బయటకు తరలించే చర్యలు చేపట్టారు. మరోవైపు, సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే, ఇద్దరు నవజాత శిశువులు ప్రాణాలు కోల్పోవడంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. తమ బిడ్డలకు మెరుగైన వైద్యం అందుతుందని ఆశించి ఆసుపత్రికి వచ్చిన ఆ చిన్నారుల తల్లిదండ్రులకు ఈ ఘటన తీరని వేదనను మిగిల్చింది.
ఈ అగ్నిప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదం ఎలా జరిగింది? అగ్నిప్రమాదం గుర్తించిన వెంటనే ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఆసుపత్రిలో భద్రతా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అనే అంశాలను పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా ఎస్ఎన్‌సీయూ విభాగంలోని విద్యుత్ పరికరాలు, ఏసీ వ్యవస్థ, అగ్నిమాపక పరికరాల పనితీరుపై దృష్టి సారించారు.
ఇలా ఉండగా రిమ్స్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో ఇద్దరు శిశువులు మరణించడంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదం నుంచి బయటపడిన చిన్నారులకు మెరుగైన వైద్యం అందించాలని, వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటనపై ఉన్నతస్థాయి విచారణ చేపట్టి సమగ్ర నివేదిక అందించాలని రేవంత్ ఆదేశించారు. కాగా మాజీ మంత్రి జోగు రామన్న ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిని సందర్శించి బాధిత కుటుంబాలను పరామర్శించారు. అగ్ని ప్రమాద ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
[Adilabad RIMS fire accident, two infants dead, Telangana news, hospital fire accident, Telugu One]


