ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టుకు మరో కీలక ముందడుగు..!
Published on: Mon Sep 21, 2026 5:35PM

హర్షం వ్యక్తం చేసిన కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి..!
ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి మరో కీలక ముందడుగు పడింది. ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ఎయిర్‌ఫోర్స్ ట్రైనింగ్ సెంటర్, జాయింట్ యూజర్ ఎయిర్‌ఫీల్డ్ (JUA) పనుల విషయంలో కేంద్ర రక్షణ శాఖ, పౌర విమానయాన శాఖలు సమన్వయానికి నోడల్ అధికారులను నియమించాయి. రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ ప్రాజెక్టు పనులను ముందుకు తీసుకెళ్లేందుకు ఈ నియామకాలు దోహదపడను న్నాయని బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి తెలిపారు.

ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టు అభివృద్ధి కోసం రక్షణ శాఖ ఆధ్వ ర్యంలో పలు కీలక మౌలిక వసతులు ఏర్పాటు చేయనున్నారు. ఇందులో ట్రైనర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లకు సంబంధించిన సౌకర్యాలు, విజిటింగ్ ఎయిర్‌క్రాఫ్ట్ పార్కింగ్ డిస్పర్సల్స్, షెల్టర్లు, ఎయిర్‌క్రాఫ్ట్ హ్యాంగర్లు, ఆపరేషనల్ కాంప్లెక్స్, శిక్షణా సదుపాయాలు, మెయింటెనెన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ తదితరాలు ఉన్నాయని కిషన్ రెడ్డి తెలిపారు. అదే విధంగా పౌర విమానయాన అవసరాల కోసం ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) ఆధ్వర్యంలో సివిల్ టెర్మినల్‌తో పాటు మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవర్‌హాల్ (MRO) సదుపాయాన్ని అభివృద్ధి చేయనున్నారు.
రక్షణ సిబ్బంది అవసరాలను దృష్టిలో ఉంచుకుని క్వార్టర్స్, క్రీడా, వినోద సదుపాయాలతో పాటు ఇతర మౌలిక వసతులను కూడా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. నీటి సరఫరా, పారిశుద్ధ్యం తదితర ప్రత్యేక ఇంజినీరింగ్ సదుపాయాల అభివృద్ధి కూడా ప్రాజెక్టులో భాగంగా ఉండనుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివిధ శాఖలు, సంస్థల మధ్య సమన్వయం మరింత మెరుగుపడి పనులు వేగవంతం కావాలంటే తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా ఒక నోడల్ అధికారిని నియమించాలని కేంద్ర మంత్రి సూచించారు. కేంద్రంలోని రక్షణ, పౌర విమానయాన శాఖల నుంచి నోడల్ అధికారుల నియామకం జరగడం ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టు అభివృద్ధి ప్రక్రియలో కీలక పరిణామంగా భావిస్తున్నామని కిషన్ రెడ్డి తెలిపారు.
[ Adilabad Airport, Union Minister G. Kishan Reddy, JUA, AAI, Air Force Training Center, Union Minister Rammohan Naidu, Ministry of Civil Aviation, Telugu One, Telugu News ]


