రూ. 46 కోట్ల చెక్కుల వివాదం.. అక్క అంబిక, సోదరుడిపై నటి రాధ ఫిర్యాదు..!
Published on: Mon Sep 21, 2026 8:36PM

ప్రముఖ సినీనటి రాధ తన కుటుంబ సభ్యులపై చెన్నై పోలీసులను ఆశ్రయించారు. తన అక్క, నటి అంబికతో పాటు సోదరుడు మల్లికార్జున కుంజన్ నాయర్‌పై చెన్నై పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. తనకు తెలియకుండా తన సంతకంతో ఉన్న ఖాళీ చెక్కులను తీసుకుని, వాటిని దుర్వినియోగం చేసి సుమారు రూ.46 కోట్ల మేరకు నగదు పొందేందుకు ప్రయత్నించారని రాధ ఆరోపించారు. రాధ ఫిర్యాదు ప్రకారం.. చెన్నైలోని తన వ్యాపార కార్యకలాపాలకు సంబంధించిన ఖర్చుల కోసం ఆమె గతంలో కొన్ని ఖాళీ చెక్కులపై సంతకాలు చేసి తన గదిలో ఉంచేవారు. సిబ్బంది జీతాలు, విద్యుత్ బిల్లులు, పన్నులు, నీటి చార్జీలు, తోట నిర్వహణ వంటి ఖర్చుల కోసం వీటిని వినియోగించేవారని తెలిపారు.
అనంతరం తన వ్యాపార సంస్థ పేరును ‘ARS Garden Studio’ నుంచి ‘RR Gardens’గా మార్చడంతో కొత్త చెక్‌బుక్ తీసుకున్నారని, పాత చెక్‌బుక్‌ను వినియోగించడం నిలిపివేశారని పేర్కొన్నారు. అయితే సెప్టెంబర్ 17న బ్యాంకు నుంచి వచ్చిన సమాచారంతో విషయం వెలుగులోకి వచ్చిందని రాధ తెలిపారు. పాత చెక్‌బుక్‌కు చెందిన ఐదు చెక్కులను అంబిక పేరుతో నగదుగా మార్చేందుకు బ్యాంకులో సమర్పించినట్లు తనకు సమాచారం అందిందని చెప్పారు. దీంతో వెంటనే బ్యాంకును సంప్రదించి ఆ చెక్కులపై ‘స్టాప్ పేమెంట్’ ఆదేశాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. తాను అంబికకు ఆ చెక్కులను ఇవ్వలేదని, ఆమెతో ఎలాంటి ఆర్థిక లావాదేవీ కోసం వాటిని ఉపయోగించే పరిస్థితి లేదని రాధ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే చెక్కుల్లో వివరాలను తన సోదరుడు మల్లికార్జునే నింపినట్లు తనకు తెలిసిందని, ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి దర్యాప్తు చేయాలని పోలీసులను కోరారు.
.webp)
ఇదే సమయంలో, సెప్టెంబర్ 18న మరోసారి చెక్కులను బ్యాంకులో సమర్పించేందుకు ప్రయత్నం జరిగిందని రాధ ఆరోపించారు. అయితే తాను ముందుగానే స్టాప్ పేమెంట్ ఇవ్వడంతో రూ.46 కోట్ల నగదు విత్‌డ్రా కాలేదని ఆమె వెల్లడించారు. చెక్కుల వ్యవహారంతో పాటు చెన్నైలోని తన ఇంటి విషయంలోనూ కుటుంబ సభ్యులతో వివాదం ఉందని రాధ ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. తనకు చెందిన వస్తువులు, విలువైన పత్రాలు తదితర అంశాలపైనా పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ ఆరోపణలపై పోలీసులు విచారణ చేపట్టాల్సి ఉంది. ఆరోపణలు ఇంకా నిర్ధారణ కాలేదు. రాధ, అంబిక ఇద్దరూ 1980లలో తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో ప్రముఖ నటీమణులుగా గుర్తింపు పొందారు. తాజాగా ఇద్దరి మధ్య తలెత్తిన కుటుంబ, ఆర్థిక వివాదం పోలీస్ ఫిర్యాదు వరకు వెళ్లడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
[ Actress Radha files complaint against sister Ambika and brother, Chennai Police,Mallikarjuna Kunjan Nair, Actress Ambika, Actress Radha, ARS Garden Studio, RR Gardens, Telugu One, Telugu News ]


