'విదేశాలల్లో తక్కువ ఖర్చుతో విద్య' అనే పేరుతో మోసాలకు పాల్పడుతున్న కొన్ని సంస్థలు...

 

చదువులు రోజురోజుకు వ్యాపారమవుతున్నాయి. తమ పిల్లల భవిష్యత్తు కోసం పొట్ట కట్టుకుని మరి తల్లి దండ్రులు పిల్లలకు చదువులు చెప్పిస్తుంటారు.కానీ చదువుల పేరుతో రోజురోజుకు మోసాలు జరుతున్న సంఖ్య కూడా ఎక్కువగా మారుతోంది అనడంలో ఆశ్చర్యంలేదు. "మీరు డాక్టర్ కావాలనుకుంటున్నారా అయితే మీరు సరైన చోటే ఉన్నారు. విదేశాల్లో తక్కువ ఖర్చుతో ఉన్నత విద్య పూర్తి చేయిస్తాం" అంటూ వచ్చే వాణిజ్య ప్రకటనల్లో రోజురోజుకు మోసాలు ఎక్కువవుతున్నాయి. కొన్ని సంస్థలు విద్యార్థులను ఆకర్షించేందుకు కలర్ ఫుల్ కరపత్రాలతో మార్కెట్ లోకి దూసుకెళ్తున్న వైనంగా మారింది. మెరిసేదంతా బంగారం కాదు అన్నట్టు కొన్ని సంస్థలు చేస్తున్న ప్రకటనలు నిజమో కాదో తెలుసుకోకుండానే విద్యార్థులూ వారి తల్లిదండ్రులూ మోసపోతున్నారు.

తాజాగా విదేశాల్లో ఉన్నత విద్య చదివేందుకు సీట్లు ఇప్పిస్తామని చెప్పి ఓ సంస్థ భారీగా డబ్బులు దండుకొని మొహం చాటేసిన సంఘటన విశాఖలో చోటుచేసుకుంది.స్థానిక రాంనగర్ లో ఆక్యురేట్ సిల్వర్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అసెట్ పేరుతో ఓ సంస్థ నిర్వహిస్తూన్నారు. ఎంబిబియస్, ఇంజనీరింగ్ చదివేందుకు ఆసక్తి చూపుతున్న విద్యార్ధులకు ప్రకటనలతో ఎరవేసినా అసెట్ సంస్థ మాయ మాటలతో విద్యార్ధులను ట్రాప్ చేస్తోంది. రష్యాలోని సెయింట్ పీటర్స్ బర్గ్ స్టేట్ యూనివర్సిటీలో ఏరోనాటికల్ ఇంజినీరింగ్, చైనాలో ఎంబీబీఎస్ అంటూ ఒక్కో విద్యార్థి నుంచి లక్షల్లో వసూలు చేసింది. విశాఖకు చెందిన ఆర్ఎన్ ఎరోనాటికల్ ఇంజనీరింగ్ కోసం లక్షన్నర, కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన మరో విద్యార్థి ఎంబీబీఎస్ సీటు కోసం మూడు లక్షలు చెల్లించారు. 

ఫీజులు తీసుకోని అడ్మిషన్ ఖరారైందని నమ్మించిన అసెట్ సంస్థ వీరిని సెప్టెంబర్ ఇరవై ఒకటిన విదేశాలకూ ప్రయాణం అని చెప్పి ఢిల్లీకి తీసుకెళ్లారు. అయితే ఇవాళ రేపు అంటూ అసెట్ సంస్థ ప్రతినిధులు ఆలస్యం చేయడంతో విద్యార్థులు వారిని నిలదీశారు. చివరకు షెల్టర్ తీసుకున్న హోటల్ కు సంస్థ ప్రతినిధులు బిల్లు చెల్లించక పోవడంతో అక్కడే ఇరుక్కుపోయారు. విద్యార్ధులకు ఏం చేయాలో తోచక ఏపీ భవన్ కు ఫోన్ లో సంప్రదించారు. వారి సహకారంతో ఎలాగోలా బయట పడిన విద్యార్థులు వాట్సప్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు కేసు నమోదు చేశారు. అసెట్ నిర్వహకురాలు సూర్యకుమారిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. సర్టిఫికెట్ లతో పాటు తాము చెల్లించిన మొత్తాన్ని తమకు ఇప్పించాలని బాధిత విద్యార్థులూ వారి తల్లిదండ్రులూ కోరుతున్నారు. తమ లాగా మరెవరూ మోసపోకుండా చూడాలని తగిన చర్యలు తీసుకోవాలని బాధితులు పోలీసులను కోరుతున్నారు.